హైదరాబాద్‌లో ఇళ్ల రేట్లు రయ్‌...

18 Feb, 2022 03:38 IST|Sakshi

2021లో 7 శాతం పెరుగుదల

ఎనిమిది మెట్రోల్లో 3–7 శాతం అధికం

నిర్మాణ వ్యయం పెరిగిపోవడం వల్లే

రియల్‌ ఇన్‌సైట్‌ రెసిడెన్షియల్‌ నివేదిక

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ మార్కెట్లో ఇళ్ల ధరలు గణనీయంగా 7 శాతం మేర పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది మెట్రో నగరాల్లో 2021 సంవత్సరంలో ఇళ్ల ధరలు 3–7 శాతం మధ్య పెరిగినట్టు ప్రాప్‌టైగర్‌.కామ్‌ రూపొందించిన ‘రియల్‌ ఎస్టేట్‌ ఇన్‌సైట్‌ రెసిడెన్షియల్‌ – యాన్యువల్‌ రౌండప్‌ 2021’ నివేదిక తెలియజేసింది. నిర్మాణంలో వినియోగించే సిమెంట్, స్టీల్‌ తదితర రేట్లు పెరగడమే ఇళ్ల ధరల వృద్ధికి దారితీసినట్టు పేర్కొంది. గతేడాది హైదరాబాద్‌ మార్కెట్లో 22,239 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 36 శాతం వృద్ధి నమోదైంది.  

నివేదికలోని అంశాలు..
► ఎనిమిది నగరాల్లో ఇళ్ల విక్రయాలు 2021లో 13 శాతం పెరిగి 2,05,936 యూనిట్లుగా ఉన్నాయి. 2020లో విక్రయాలు 1,82,639 యూనిట్లుగా ఉండడం గమనించాలి.
► కొత్తగా ఆరంభించిన ఇళ్ల యూనిట్లు 75 శాతం పెరిగి 2.14 లక్షల యూనిట్లుగా ఉన్నాయి.  
► అహ్మదాబాద్‌ మార్కెట్లో ఇళ్ల ధరలు 7 శాతం పెరగ్గా, బెంగళూరులో 6 శాతం, పుణేలో 3 శాతం, ముంబైలో 4 శాతం, చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్, కోల్‌కతా మార్కెట్లలో 5 శాతం చొప్పున ధరలు 2021లో పెరిగాయి.
► బెంగళూరు మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 7 శాతం పెరిగి 24,983 యూనిట్లుగా ఉన్నాయి.
► చెన్నై మార్కెట్లో 25 శాతం వృద్ధితో 13,055 యూనిట్లు అమ్ముడుపోయాయి.
► ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఒక శాతమే పెరిగి 17,907 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.
► కోల్‌కతా మార్కెట్లో 9% వృద్ధితో 9,896 యూనిట్లు అమ్ముడుపోయాయి.  
► ముంబైలో 8 శాతం పెరిగి 58,556 యూనిట్లు అమ్ముడయ్యాయి.
► పుణేలో 9% మేర విక్రయాల్లో వృద్ధి నమోదైంది. 42,425 ఇళ్లు విక్రయమయ్యాయి.

ధరలు ఇంకా పెరుగుతాయి
55% మంది కొనుగోలుదారుల అభిప్రాయం
సీఐఐ అనరాక్‌ సర్వే

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇళ్ల ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలే కాదు.. కొనుగోలుదారులూ అభిప్రాయపడుతున్నారు. నిర్మాణంలో వినియోగించే ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరిగిపోవడం తెలిసిందే. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌.. సీఐఐతో కలసి వినియోగదారుల అభిరుచులపై ఒక సర్వే నిర్వహించింది. 2021 జూలై నుంచి డిసెంబర్‌ మధ్య ఈ సర్వే జరిగింది. ఈ వివరాలను అనరాక్‌ వెల్లడించింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి 5,210 మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు.

నిర్మాణ వ్యయాలు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడంతో ఇళ్ల ధరలు పెరుగుతాయని అంచనాతో ఉన్నట్టు 55 శాతం మంది చెప్పారు. అయితే ధరలు పెరగడం 10 శాతం లోపు ఉంటే డిమాండ్‌పై మోస్తరు నుంచి, తక్కువ ప్రభావమే ఉంటుందని.. 10 శాతానికి మించి పెరిగితే మాత్రం కొనుగోళ్ల సెంటిమెంట్‌పై గట్టి ప్రభావమే చూపిస్తుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. రియల్‌ ఎస్టేట్‌ను ఒక ఆస్తిగా పరిగణిస్తున్నవారి సంఖ్య 2021 తొలి ఆరు నెలల్లో 54 శాతంగా ఉండగా, ద్వితీయ ఆరు నెలల్లో 57 శాతానికి పెరిగింది.

ఈ ఏడాది ద్వితీయ భాగంలో వడ్డీ రేట్లు పెరగడం కొనుగోళ్ల వ్యయాన్ని పెంచుతుందన్న అంచనా వ్యక్తం అయింది. ఇంటి యజమానులు కావాలన్న ధోరణిలోనూ పెరగుదల కనిపించింది. 63 శాతం మంది రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల బడ్జెట్‌ ఇళ్ల పట్ల ఆసక్తిగా ఉన్నారు. అందుబాటు ధరల ఇళ్లకు డిమాండ్‌ 2021 ద్వితీయ ఆరు నెలల్లో 40% నుంచి 27 శాతానికి తగ్గింది. 32% మంది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.  

మరిన్ని వార్తలు