2021–2022: 41 నగరాల్లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు!

14 Jul, 2022 07:34 IST|Sakshi

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌ గత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంది. ఇళ్ల ధరలు సగటున 11 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా 41 పట్టణాల్లో 2021–22లో ఇళ్ల ధరలు పెరిగినట్టు నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ) విడుదల చేసిన రెసిడెక్స్‌ సూచీ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది.

హైదరాబాద్‌ కాకుండా మిగిలిన ఏడు ప్రధాన పట్టణాలను పరిశీలించినట్టయితే.. అహ్మదాబాద్‌లో అత్యధికంగా 13.8 శాతం, బెంగళూరులో 2.5 శాతం, చెన్నైలో 7.7 శాతం, ఢిల్లీలో 3.2 శాతం, కోల్‌కతాలో 2.6 శాతం, ముంబైలో 1.9 శాతం, పుణెలో 0.9 శాతం చొప్పున ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపించింది. సీక్వెన్షియల్‌గా (అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే) చూస్తే.. 50 పట్టణాలతో కూడిన రెసిడెక్స్‌ ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య 2.6 శాతం వృద్ధి చెందింది.

 అంతకుముందు త్రైమాసికంలో ఉన్న 1.7 శాతంతో పోలిస్తే పుంజుకుంది. అంతేకాదు, 2021 జూన్‌ నుంచి త్రైమాసికం వారీగా ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపిస్తోందని.. హౌసింగ్‌ మార్కెట్‌ కరోనా లాక్‌డౌన్‌ల నుంచి కోలుకున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 50 పట్టణాల్లో ఇళ్ల ధరలను త్రైమాసికం వారీగా ట్రాక్‌ చేసేందుకు ఎన్‌హెచ్‌బీ 2007లో రెసిడెక్స్‌ ఇండెక్స్‌ను ప్రారంభించింది.

మరిన్ని వార్తలు