Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయ్‌

31 Aug, 2022 10:41 IST|Sakshi

జూన్‌ త్రైమాసికంలో 42 పట్టణాల్లో పెరుగుదల 

ఎన్‌హెచ్‌బీ రెసిడెక్స్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 11.5 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో దేశవ్యాప్తంగా 42 పట్టణాల్లో ఇళ్ల ధరలు పెరిగినట్టు నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ)కు చెందిన రెసిడెక్స్‌ (ఇళ్ల ధరల సూచీ) ప్రకటించింది. ఎనిమిది మెట్రోల్లోనూ ధరల పెరుగుదల నమోదైనట్టు పేర్కొంది. ఎనిమిది మెట్రోల్లో అహ్మదాబాద్‌లో అత్యధికంగా 13.5 శాతం, చెన్నైలో 12.5 శాతం చొప్పున ధరల పెరుగుదల ఉండగా, ఆ తర్వాత ఎక్కువగా పెరిగింది హైదరాబాద్‌ మార్కెట్లోనే కావడం గమనించాలి.

బెంగళూరులో 3.4 శాతం, ఢిల్లీలో 7.5 శాతం, కోల్‌కతాలో 6.1 శాతం, ముంబైలో 2.9 శాతం, పుణెలో 3.6 శాతం చొప్పున ఇళ్ల ధరల్లో వృద్ధి నెలకొంది. ఇక దేశవ్యాప్తంగా ఐదు పట్టణాల్లో ఇళ్ల ధరలు తగ్గగా, మూడు పట్టణాల్లో స్థిరంగా ఉన్నాయి. ఎన్‌హెచ్‌బీ రెసిడెక్స్‌ ఇండెక్స్‌ 50 పట్టణాల గణాంకాలను ట్రాక్‌ చేస్తుంటుంది. సీక్వెన్షియల్‌గా చూస్తే (మార్చి త్రైమాసికం నుంచి) ఈ 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు 1.7 శాతం పెరిగాయి. 2017–18 నుంచి 50 పట్టణాల్లో ఇళ్ల ధరలను త్రైమాసికం వారీగా ఎన్‌హెచ్‌బీ రెసిడెక్స్‌ ప్రకటిస్తోంది.  

చదవండి: (Electric Vehicles In India: 2030 నాటికి 5 కోట్ల ఈవీలు) 

మరిన్ని వార్తలు