రెండు రెట్లు పెరిగిన ఇళ్ల విక్రయాలు

30 Sep, 2021 03:56 IST|Sakshi

ఏడు ప్రధాన పట్టణాల్లో డిమాండ్‌

సెప్టెంబర్‌ క్వార్టర్‌పై అనరాక్‌ నివేదిక

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది జూలై–సెపె్టంబర్‌ కాలంలో రెండు రెట్లు పెరిగాయి. మొత్తం 62,800 యూనిట్లు విక్రయమైనట్టు అనరాక్‌ సంస్థ తెలిపింది. గృహ రుణాలపై తక్కువ రేట్లు, ఐటీ/ఐటీఈఎస్‌ రంగాల్లో నియామకాలు పెరగడం డిమాండ్‌ పెరిగేందుకు కారణమైనట్టు ఈ సంస్థ విశ్లేíÙంచింది. క్రితం ఏడాది సరిగ్గా ఇదే కాలంలో ఇళ్ల విక్రయాలు 29,520 యూనిట్లుగా ఉన్నట్టు తెలిపింది. అలాగే, క్రితం త్రైమాసికం ఏప్రిల్‌–జూన్‌లో ఇళ్ల విక్రయాలు 24,560 యూనిట్లుగా ఉన్నాయి.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం (ఎంఎంఆర్‌), ఢిల్లీ–ఎన్‌సీఆర్, పుణే పట్టణాల్లోని విక్రయాలపై ఓ నివేదికను అనరాక్‌ బుధవారం విడుదల చేసింది. ఇళ్ల ధరలు ఈ పట్టణాల్లో సగటున 3 శాతం మేర పెరిగాయి. చదరపు అడుగు రూ.5,760గా ఉంది. 2020 సెపె్టంబర్‌ త్రైమాసికంలో సగటు చదరపు అడుగు ధర రూ.5,600గా ఉండడం గమనార్హం. ఇళ్ల నుంచే కార్యాలయ పని విధానం (డబ్ల్యూఎఫ్‌హెచ్‌) నివాస గృహాల డిమాండ్‌ను నిర్ణయించనున్నట్టు అనరాక్‌ పేర్కొంది. టీకాలను పెద్ద మొత్తంలో వేస్తుండడంతో ప్రాజెక్టుల నిర్మాణ ప్రదేశానికి వచ్చి ఇళ్లను చూసే వారి సంఖ్య పెరిగినట్టు తెలిపింది.  

హైదరాబాద్‌లో నాలుగు రెట్లు అధికం
2021 జూలై–సెపె్టంబర్‌ కాలంలో హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు నాలుగు రెట్లు అధికంగా నమోదయ్యాయి. 2020 జూలై సెపె్టంబర్‌లో 1,650 యూనిట్లే అమ్ముడుపోగా.. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌ మధ్య 6,735 యూనిట్లు విక్రయమయ్యాయి. చెన్నైలో విక్రయాలు రెట్టింపై 3,405 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో విక్రయాలు 10,220 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 5,200 యూనిట్లుగా ఉన్నాయి. ముంబై ఎంఎంఆర్‌ ప్రాంతంలోనూ అమ్మకాలు నూరు శాతానికి పైగా పెరిగి 20,965 యూనిట్లుగా ఉన్నాయి. బెంగళూరులో 58 శాతం అధికంగా 8,550 యూనిట్లు అమ్ముడుపోయాయి.

>
మరిన్ని వార్తలు