EV Charging Points: దేశానికే ఆదర్శం.. హైదరాబాద్‌

9 Oct, 2021 18:33 IST|Sakshi

రెండు నెలల క్రితం కిచెన్‌ రూమ్‌లో స్కూటర్‌ ఫోటో నెట్‌లో హల్‌చల్‌ చేసింది. బెంగళూరికి చెందిన ఓ ఐటీ ప్రొఫెషనల్‌ తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఛార్జింగ్‌ పెట్టుకునేందుకు ఎక్కడా చోటు లేక కిచెన్‌కి తీసుకొచ్చాడు. ఒక్క బెంగళూరే కాదు అనేక నగరాల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి. కానీ ఈ తరహా పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త పడుతోంది హైదరాబాద్‌.

ముందుగానే
హ్యాపెనింగ్‌ సిటీ పేరు తెచ్చుకున్న హైదరాబాద్‌ ట్రెండ్‌కి తగ్గట్టుగా మారడంలో ఇతర నగరాల కంటే ముందు వరుసలో ఉన్నారు ఇక్కడి ప్రజలు. ఎలక్ట్రిక్‌ వాహనాలు వాడాలంటూ ప్రభుత్వం చెబుతున్న సూచనలకు తగ్గట్టుగా రెడీ అవుతున్నారు. తమ అపార్ట్‌మెంట్‌లలో ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయాలంటూ విద్యుత్‌ శాఖను సంప్రదిస్తున్నారు.

గేటెట్‌లో ఛార్జింగ్‌ స్టేషన్లు
నగరంలో పలు అపార్ట్‌మెంట్లు ఇప్పటికే ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇక నగరంలో ప్రముఖ గేటెడ్‌ కమ్యూనిటీగా ఉన్న మైహోం గ్రూప్‌కి చెందిన భుజా, అవతార్‌లలో ఇప్పటికే ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక యూనిట్‌ కరెంటుకి రూ. 6.50 వంతున ఛార్జ్‌ చేస్తున్నారు. ఇదే బాటలో ఉన్నాయి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరిన్ని అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీస్‌.

మధ్యలో అంటే కష్టం
ఇక ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న అపార్ట్‌మెంట్లలో కొత్తగా ఛార్జింగ్‌ స్టేషన్ల నిర్మాణం చేపట్టడం కష్టంగా మారింది. దీంతో ఈవీ వెహికల్స​ కోసం కొత్తగా పవర్‌ అవుట్‌లెట్లను ఇస్తున్నారు. వీటికే ప్రత్యేకంగా మీటర్లు కేటాయిస్తున్నారు. సదరు ఆపార్ట్‌మెంట్‌లో ఈవీలు ఉపయోగించేవారు వీటి బాధ్యతలను తీసుకుంటున్నారు. ‘పెరుగుతున్న పెట్రోలు ధరలతో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనేవారి సంఖ్య ఒక్కసారిగా ఊపందుకుంది. కానీ మా అపార్ట్‌మెంట్‌లో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ నిర్మించే స్థలం లేదు. అందుకే పార్కింగ్‌ ఏరియాలోనే పవర్‌ అవుట్‌లెట్లు ఏర్పాటు చేశాం’ అని గచ్చిబౌలికి చెందని ఓ ఆపార్ట్‌మెంట్‌ సోసైటీ సభ్యులు తెలిపారు. 

ఇతర ప్రాంతాల్లో
ఈవీ వెహికల్స్‌కి హెడ్‌క్వార్టర్స్‌గా పేరొందిన బెంగళూరులో ఛార్జింగ్‌ స్టేషన్ల సమస్య ఎక్కువగా ఉంది. అక్కడ అపార్ట్‌మెంట్‌ సోసైటీలు, ఈవీ వెహికల్స్‌ యజమానులకు మధ్య తరుచుగా ఈ విషయంపై వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంలపై అక్కడ స్థానిక కోర్టుల్లో కేసులు సైతం నడుస్తున్నాయి. బెంగళూరుతో పాటు ముంబై, ఢిల్లీలలోనూ ఈ తరహా సమస్యలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితి రాకముందే హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లు క్రమంగా ఈవీ వెహికల్స్‌ తగ్గట్టుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండే నగర పశ్చిమ ప్రాంతంలో ఈ మార్పు వేగంగా చోటు చేసుకుంటోంది. 

వరంగల్‌, కరీంనగర్‌
ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్‌, రోడ్‌ ట్యాక్స్‌ల నుంచి తెలంగాణ ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. నగరంలో ఉన్న ఐటీ కంపెనీల్లో ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 140 పబ్లిక్‌ ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు నిర్మించేందుకు టెండర్లు పిలిచింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో 120 ఛార్జింగ్‌ స్టేషన్లు హైదరాబాద్‌లో రానుండగా, కరీంనగర్‌, వరంగల్‌ నగరాల్లో 10 వంతున ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 
 

మరిన్ని వార్తలు