సేవింగ్స్‌ అకౌంట్లపై బ్యాంకులు వడ్డీ జమ చేస్తాయని మీకు తెలుసా?

2 Jan, 2023 10:44 IST|Sakshi

2022 ఏప్రిల్‌ 1 నుంచి 2022 డిసెంబర్‌ 31 వరకు .. ఆ తర్వాత 2023 మార్చి 31 వరకు మీ బ్యాంకు ఖాతాలను ముందుగా అప్‌డేట్‌ చేయించండి. అన్ని బ్యాంకుల్లో మీకున్న అన్ని అకౌంట్లు,  అలాగే మీకున్న జాయింట్‌ బ్యాంకు ఖాతాలు, మీరు .. మీ కుటుంబ సభ్యులు.. రెసిడెంటు కావచ్చు లేదా నాన్‌ రెసిడెంటు కావచ్చు .. అందరివి అన్ని ఖాతాలను అప్‌డేట్‌ చేసి విశ్లేషణ మొదలుపెట్టండి. ముందు జమలను పరిశీలించండి. ప్రతి జమకి వివరాలు వేరే లాంగ్‌ నోట్‌బుక్‌లో రాయండి.

మీ సేవింగ్స్‌ అకౌంటు ఖాతాలో బ్యాంకులు సాధారణంగా మూడు నెలలకోసారి..లేదా కొన్ని బ్యాంకులు ఆరు నెలలకోసారి వడ్డీని జమ చేస్తుంటాయి. అలాంటి పద్దుల్ని గుర్తించి అవన్నీ ఒక చోట రాయండి. సాధారణంగా ఎక్కువ మంది ఈ వడ్డీని పరిగణనలోకి తీసుకోరు. సినిమా పరిభాషలో చెప్పాలంటే ’లైట్‌’గా తీసుకోకండి. ఇక మిగిలినవి మీరు నిర్వహించిన జమలు. వీటిలో .. 
 
1. నగదు జమలు: ఈ డిపాజిట్లు ఎందుకు చేశారో తెలుసుకోండి. మొదట్లో డ్రా చేయగా, ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినవా? లేదా అద్దెనా? పారితోషికమా? ఆదాయమా? అప్పు­గా వచ్చినదా? ఎవరిచ్చారు? కుటుంబ సభ్యు­లా? ఇతరులా? దేని నిమిత్తం ఇచ్చారు? వందలు అయితే ఫర్వాలేదు. ఏదో కథ చెప్పొచ్చు. వేలల్లో ఉంటే సంతృప్తికరమైన జవాబు ఇవ్వండి. అమ్మకాలా? ట్యూషన్‌ ఫీజులా? ఆదాయమే కాదా? తగిన జాగ్రత్త వహించాలి. 

2. నగదు కాని జమలు: ఇవి చెక్కులు, డీడీలు, పే ఆర్డర్లు, ఫోన్‌పే, గూగుల్‌పే, బదిలీలు కావచ్చు. మీరే ఒక అకౌంటు నుండి మరో అకౌంటుకు బదిలీ చేయొచ్చు. మీ కుటుంబ సభ్యులు చేయవచ్చు. విదేశాల నుండి మీ కుటుంబ సభ్యులు చేయవచ్చు. మీ నికర జీతం కావచ్చు.. ఇంటద్దె కావచ్చు ..  వడ్డీ కావచ్చు.. వ్యవసాయం మీద ఆదాయం కావచ్చు .. జీవిత బీమా .. ఎన్‌ఎస్‌సీల మెచ్యూరిటీ మొత్తం కావచ్చు. బ్యాంకు లోన్‌ కావచ్చు.. అప్పు ఇచ్చి ఉండవచ్చు.. లేదా గతంలో మీరు ఇచ్చిన అప్పును వారు వెనక్కి ఇచ్చి ఉండవచ్చు. అలాగే మీ ఆదాయం కావచ్చు .. ఏదైనా స్థిరాస్తి అమ్మకం ద్వారా వచ్చిన బాపతు కావచ్చు. ఇందులో మళ్లీ అడ్వాన్సు ఉండొచ్చు.. వాయిదాలు .. ఫైనల్‌ సెటిల్మెంట్‌ ఉండొచ్చు. సేల్స్‌ కావచ్చు .. ఫీజులు కావచ్చు టీడీఎస్‌ పోనూ మిగిలిన మొత్తమే జమవుతుంది. అప్పుడు టీడీఎస్‌తో కలిపి లెక్కలోకి తీసుకోవాలి. 

ఇలా ప్రతి జమని విశ్లేషించండి. ప్రత్యేకంగా ఆదాయాలు ఒక పక్కన రాయండి. ఆదాయాలు కానివి మరో పక్కన వివరంగా రాయండి. ఇక చెప్పేదేముంది. మీ ముందే ఉంది చిట్టా. పరీక్షించండి. పరికించి చూడండి ప్రతీ జమని.   

మరిన్ని వార్తలు