ఈ పొరపాట్లు చేయొద్దు.. ఫారం 16ని చెక్‌ చేయండి

19 Jul, 2021 05:44 IST|Sakshi
కె.సీహెచ్‌. ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య ట్యాక్సేషన్‌ నిపుణులు

ఐటీ రిటర్నులు వేస్తున్నాం.. పన్నులు కట్టేస్తున్నాం కదా అని మనలో మనం సంబరపడుతుంటాము. కానీ కొన్ని తప్పులు కూడా చేస్తుంటాం. ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో బైటపడ్డ నిజాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మనం చేసే తప్పుల గురించి తెలుసుకుందాం..

► ఒక ఉద్యోగి ఒక సంవత్సరకాలంలో రెండు చోట్ల ఉద్యోగం చేసినప్పుడు .. ఇద్దరూ ఫారం 16 జారీ చేసి ఉంటారు. ఇద్దరూ స్టాండర్డ్‌ డిడక్షన్‌ బెనిఫిట్‌ ఇస్తారు. ఇద్దరూ సెక్షన్‌ 80సి మినహాయింపులూ ఇస్తారు. కానీ ఉద్యోగి ఎన్ని ఉద్యోగాలు చేసినా ఒకసారే మినహాయింపు వస్తుంది. రెండు సార్లు రాదు. స్టేట్‌మెంట్‌ తయారు చేసినప్పుడు ఆదాయంలో మార్పు రాదు. కానీ మినహాయింపులు, సగానికి తగ్గుతాయి. ఫలితంగా పన్నుభారం పెరుగుతుంది. ఈ విషయం అర్థం కాక పన్ను భారం పెరిగిపోయిందో అని ఆందోళన .. కాస్సేపు బాధ .. కాస్సేపు బెంగ వస్తాయి. ఇవన్నీ సర్దుకునే సరికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి ఫారం 16ని చెక్‌ చేయండి. ఇటువంటి పరిస్థితి ఏర్పడితే సరిదిద్దుకోండి.

► కొన్ని ఆదాయాలను పరిగణనలోకి తీసుకోరు. బ్యాంకు డిపాజిట్‌ మీద వడ్డీ, సేవింగ్స్‌ ఖాతాలో జమయ్యే వడ్డీ, ఆన్సర్‌ పేపర్లు దిద్దితే వచ్చే డబ్బు, ఇన్విజిలేషన్‌ వల్ల వచ్చే డబ్బు, నగదు రూపంలో వచ్చే ట్యూషన్‌ ఫీజులు, ఇంటద్దెలు, గార్డియన్‌గా పిల్లలకు వచ్చిన ఆదాయం, జీవిత భాగస్వామికి వచ్చే ఆదాయం.. ఇవన్నీ చూపించాలి. ఎటువంటి రిస్కు తీసుకోవద్దు.

► పన్ను భారం ఉండని ఆదాయాన్ని.. అంటే.. మినహాయింపు లభించే ఆదాయాలను కూడా రిటర్నులో డిక్లేర్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల పన్ను భారం ఉండదు. భవిష్యత్తులో ‘‘సోర్స్‌’’ వివరణ ఇచ్చినప్పుడు ఎంతో ఉపశమనంగా ఉంటుంది.

► బ్యాంకుల మీద వచ్చే వడ్డీ కేవలం 10 శాతం టీడీఎస్‌కి గురి అవుతుంది. మీ నికర ఆదాయంపై 10 శాతం, 20 శాతం లేదా 30 శాతం వర్తించవచ్చు. 20 శాతం, 30 శాతం రేటు పడినప్పుడు వడ్డీ మీద టీడీఎస్‌ సరిపోదు. పది శాతం పన్ను పడుతుంది. అలా తెలియగానే ఎంతో బాధ.. ఏదో తప్పు జరిగిందని ఆవేదన, ఆలోచన వస్తాయి. మిగతా మొత్తం చెల్లించక్కర్లేదు అనుకోవడం తప్పు.

► నికర ఆదాయం నిర్దేశించిన పరిమితి దాటితే స్థూల పన్ను భారంలో 10 శాతం సర్‌చార్జి పడుతుంది. సర్‌చార్జి మీద 4 శాతం సెస్సు అదనం. ముందుగా ఏ ఆదాయానికి ఆ ఆదాయం విడిగా లెక్కించి, అజాగ్రత్త వలన నికర ఆదాయం తక్కువగా అనిపించి సర్‌చార్జీని పరిగణనలోకి తీసుకోరు. కానీ అన్నీ కలిపేసరికి నికర ఆదాయం కోటి రూపాయలు దాటితే సర్‌చార్జి కరెంటు షాకులాగా తగులుతుంది. తప్పు .. తప్పని తేలకపోతే ఫర్వాలేదు. కానీ తేలితే మళ్లీ బెంగ.. భయం.. పైగా పన్నూ తప్పదు.
కాబట్టి ఇలా ఎన్నో తప్పులు దొర్లవచ్చు. కనుక తస్మాత్‌ జాగ్రత్త వహించండి. 

మరిన్ని వార్తలు