ఫోన్‌ బ్యాటరీ లైఫ్‌లో సమస్యలా? ఈ 5 చిట్కాలు ఫాలో అవండి

4 Jul, 2021 18:36 IST|Sakshi

గత కొన్ని ఏళ్లుగా స్మార్ట్‌ఫోన్‌ టెక్నాలజీలో కీలక మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ప్రాసెసర్ల నుంచి మొదలు పెడితే హై-రిజల్యూషన్ డిస్‌ప్లేల వరకు ఎన్నో రకాల ఫీచర్లు మనకు అందుబాటులోకి వచ్చాయి. కానీ, ఇప్పటికి  స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ విషయానికి వస్తే పెద్దగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కేవలం బ్యాటరీ చార్జ్ అయ్యే వేగం, సామర్థ్యంలో మాత్రమే మార్పులు వచ్చాయి. అనేక ఏళ్లుగా ఇప్పటికి స్మార్ట్‌ఫోన్‌ యూజర్లను వేదిస్తున్న సమస్య బ్యాటరీ త్వరగా ఖాళీ కావడం. శామ్ సంగ్ వంటి సామర్థ్యం పరంగా పెద్ద పెద్ద బ్యాటరీ ఉన్న ఫోన్లు అందుబాటులోకి వచ్చిన వాడకం కూడా అదే రీతిలో పెరిగింది. అయితే, ఈ 5 చిట్కాలతో మన స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ లైఫ్ పెంచుకునే వీలుంది. 

1. పవర్ సేవింగ్ మోడ్
మీకు అత్యవసర సమయాల్లో మీ ఫోన్ బ్యాటరీ తొందరగా ఖాళీ కాకుండా ఉండాలంటే పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసుకోవడం మంచిది. దీనివల్ల మీ ఫోన్ లో అనవసరంగా రన్ అయ్యే యాప్స్ ని బ్యాక్ గ్రౌండ్ లో తొలగిస్తుంది. దీంతో మీ బ్యాటరీ తొందరగా ఖాళీ కాదు. అలాగే, ఆండ్రాయిడ్ 10పై రన్ అవుతున్న ఫోన్లలో ఉండే అడాప్టివ్ పవర్ సేవింగ్ మోడ్ యాక్టివేట్ చేసుకోవాలి. దీనివల్ల మీరు ఫోన్ లో చాలా తక్కువగా వాడే యాప్స్ కు బ్యాటరీ అవసరం మేరకు మాత్రమే సరఫరా చేయబడుతుంది.

2. నెట్ వర్క్ డేటా
మీ ఇంట్లో వై-ఫై సౌకర్యం అందుబాటులో ఉంటే వై-ఫై ఉపయోగించడం చాలా మంచిది. బయటకి వెళ్లిన సందర్భంలో మాత్రమే మీ మొబైల్ డేటాను ఆన్ చేసుకోవాలి. వై-ఫైతో పోలిస్తే మీ మొబైల్ డేటా ఆన్ చేసిన సమయంలోనే ఎక్కువ బ్యాటరీ డ్రెయిన్ అవుతుంది. రెండింటినీ ఆన్ చేసి ఉంచితే బ్యాటరీ వినియోగం పెరుగుతుంది. ఫలితంగా బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే, లొకేషన్ సేవలు అవసరం లేని సమయంలో ఆఫ్ చేసుకుంటే. ముఖ్యంగా మీరు ఇంట్లో, ఆఫీస్ లో ఉన్నప్పుడు  లొకేషన్ ఆఫ్ చేసుకోవడం ఉత్తమం.  

3. డార్క్ మోడ్
మీరు ఉపయోగించే ఫోన్లో గాని, యాప్స్ లో డార్క్ మోడ్ ఆప్షన్ ఉంటే అది ఆన్ చేసుకుంటే మంచిది. ఐఫిక్స్  ప్రకారం, డార్క్ మోడ్ ఆన్ చేయడం ద్వారా మీరు ఒక గంట బ్యాటరీ జీవితకాలాన్ని ఆదా చేయవచ్చు. అలాగే, అడాప్టివ్ బ్రైట్ నెస్ ఫీచర్ ఆన్ చేసుకోవడం వల్ల మీరు వెళ్లే ప్రదేశాన్ని బట్టి బ్యాటరీ ఆటోమెటిక్ గా నియంత్రించబడుతుంది. 

4. స్క్రీన్ టైమ్‌ ఔట్‌
చాలామంది ఫోన్ ఉపయోగించిన ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత స్క్రీన్‌ ఆఫ్‌ అయ్యేలా టైమ్‌ సెట్ చేస్తారు. దీనివల్ల కూడా బ్యాటరీ కాలం త్వరగా అయిపోయే అవకాశం ఉంది. ఇక నుంచి మీ స్క్రీన్ టైమ్‌ ఔట్‌ను 30 సెకన్లకు తగ్గించి చూడండి. దానివల్ల బ్యాటరీ వినియోగం తగ్గిపోతుంది. 

5.వాల్ పేపర్, విడ్జెట్
చాలా మంది ఎక్కువగా స్క్రీన్ మీద లైవ్ వాల్ పేపర్ పెడుతుంటారు. మీ డిస్ ప్లే వాటిని యానిమేట్ చేయడానికి ఎక్కువ శక్తి అవసరం కాబట్టి బ్యాటరీ ఖర్చు అవుతుంది. అలాంటి సందర్భాలలో సాదారణ వాల్ పేపర్ పెట్టుకోవడం మంచిది, అలాగే విడ్జెట్ లు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాయి కాబట్టి బ్యాటరీ లైఫ్ తొందరగా తగ్గిపోతుంది.

చదవండి: ఫేస్‌బుక్ యూజర్లకు మరో షాక్.. ఈ యాప్స్ తో జర జాగ్రత్త!

మరిన్ని వార్తలు