పన్ను భారం తగ్గించుకోండిలా ..

7 Nov, 2022 07:58 IST|Sakshi

అదొక పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబం. చింతలు లేని కుటుంబం. ‘ట్యాక్స్‌ కాలమ్‌’కి ఆ కుటుంబానికి ఏమిటి సంబంధం అంటే .. వాళ్లంతా కలిపి చాలా తక్కువగా పన్ను చెల్లించి పరువుగా బతుకుతున్నారు.  

కుటుంబ పెద్ద అయ్యర్‌ గారికి .. 90 సంవత్సరాలు, ఆయన భార్యకు 85 ఏళ్లు. ఇద్దరిది మంచి ఆరోగ్యం. ముగ్గురు మగపిల్లలు. వాళ్లందరికి పెళ్లిళ్లు అయ్యాయి. కోడళ్లు .. మనవళ్లు.. మనవరాళ్లు ఉన్నారు. అయ్యర్‌గారిది మొదటి నుంచి ఇడ్లీల అమ్మకమే. మొదట్లో ఒక టేబుల్‌. తర్వాత బండి. తర్వాత గుడిసె.. తర్వాత షెడ్డు .. ఇప్పుడొక స్థిరమైన ఇంట్లో వ్యాపారం. ఇంటిల్లిపాదీ ఇడ్లీలు అమ్ముతారు. ఒకటే వంట. ఒకే మాట. వారి ఐకమత్యమే వారి బలం. ఎప్పుడూ చట్టప్రకారమే వ్యాపారం చేస్తూ వచ్చారు అయ్యర్‌గారు.

తనకో పాన్, భార్యకో పాన్‌. కొడుకులది కూడా అదే పద్ధతి. కోడళ్లు అత్తగారికి ఏమీ తీసిపోరు. హోటల్‌ నిర్వహణ కాగితాల ప్రకారం ఎవరి పని వారిదే. టర్నోవర్‌ వారిదే. ప్రతి సంవత్సరం టర్నోవరు రూ. 20,00,000 దాటకుండా జాగ్రత్త పడతారు. జీఎస్‌టీ వర్తించదు. పెద్దాయన ఆదాయంలో నుంచి ఖర్చులు పోను నికర ఆదాయం రూ. 5,00,000 దాటకుండా జాగ్రత్తపడతారు. అవసరం అయితే సేవింగ్స్, ఎన్‌ఎస్‌సీలు.. ఇంకా మెడిక్లెయిమ్‌.. వైద్య ఖర్చులు అన్ని వెసులుబాట్లు ఉపయోగిస్తారు. అలాగే భార్య విషయంలోనూ అదే జాగ్రత్త. 

ఒక కొడుక్కి పిల్లలు, వారి చదువులు .. 80సి కింద స్కూల్‌ ఫీజులను క్లెయిమ్‌ చేస్తారు. మరొక కొడుక్కి ఒకే సంతానం. ఇంటికి లోన్‌ తన పేరు మీద తీసుకుని వడ్డీ చెల్లిస్తారు. అసలు చెల్లిస్తారు. దాన్ని 80సి కింద క్లెయిమ్‌ చేస్తారు. మరొక కొడుక్కి ఒక కూతురు. సేవింగ్స్‌ చేస్తారు. ఇతని పేరు మీద మరొక ఇల్లు, అప్పులు, వడ్డీలు ఉన్నాయి. ముగ్గురు పిల్లలకు కార్లు ఉన్నాయి. లోన్‌ మీద కొన్నారు. వడ్డీని ఖర్చుగా చూపుతారు. పెట్రోల్‌ ఖర్చులు, తరుగుదల వ్యయాలు, డ్రైవర్‌ కూడా ఉన్నాడని, జీతం ఇస్తున్నామని చెబుతారు.

ఎంత లాభం వచ్చినా ఇలాంటి ఖర్చులతో తగ్గుతుంది. కోవిడ్‌ నేపథ్యంలో ఇంటింటికి టిఫిన్లు ఇవ్వడం ద్వారా స్వామి కార్యంతో పాటు స్వకార్యమూ చక్కబెట్టుకున్నట్లుగా ఆ టిఫిన్లను అందించే ట్రిప్పుల్లోనే స్వంత పనులు కూడా చేసుకుంటారు. ఎందరో పని వాళ్లు. మనిషికి రూ.10,000 జీతం. ఆ ఉద్యోగికి ట్యాక్స్‌ ఉండదు. టీడీఎస్‌ ఉండదు. మీకు ఈ ప్లానింగ్‌ నప్పకపోవచ్చు.. కుదరకపోవచ్చు లేదా వర్తించకపోవచ్చు. కానీ, కాన్సెప్టును అర్థం చేసుకోండి. పైన చెప్పింది కథా కమామీషు కాదు. పేర్లు, అంకెలు గోప్యంగా ఉంచిన ఒక యదార్థ గాధ.

మరిన్ని వార్తలు