మీ మొబైల్‌ భద్రమా? ఉన్నట్టుండి బ్యాటరీ డౌన్‌, తెలియకుండానే డాటా ఖతం.. ఇంకా..

14 Mar, 2023 12:46 IST|Sakshi

రోజురోజుకి టెక్నాలజీ విపరీతంగా పెరుగుతున్న క్రమంలో మనకు కావాల్సిన సమాచారం మొత్తం మన చేతిలో (స్మార్ట్‌ఫోన్‌లో) ఉంచుకుంటున్నాము. అయితే కొంతమంది మన సమాచారాన్ని తెలుసుకోవడానికి హ్యాక్ చేస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇది చాలా ఎక్కువైపోయింది.

మన ఫోన్‌లో మన ప్రమేయం లేకుండా మనకు సంబంధించిన సమాచారం ఎవరైనా చూస్తున్నారా?.. లేదా.. అని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

తెలియని అప్లికేషన్‌లు (Unfamiliar Applications): 
ఆధునిక కాలంలో స్పైవేర్ ఇతర వ్యక్తులను గురించి తెలుసుకోవడానికి ప్యారంటల్ కంట్రోల్ యాప్స్ ఉపయోగించుకుంటారు. ఈ యాప్‌లలో ఒకదానిని ఉపయోగించి ఎవరైనా మీ ఫోన్‌లో స్పై చేస్తుంటే తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి డౌన్‌లోడ్ చేసినట్లు మీకు గుర్తులేని ఏవైనా తెలియని అప్లికేషన్‌ల కోసం మీ ఫోన్‌లో సర్చ్ చేయవచ్చు. దీనికోసం నెట్ నానీ, కాస్పెర్స్కీ సేఫ్ కిడ్స్, నార్టన్ ఫ్యామిలీ యాప్స్‌ ఉపయోగపడతాయి.

పర్‌ఫామెన్స్‌లో సమస్యలు:
స్పైవేర్ మీ డేటాను ఎప్పటికప్పుడు సేకరించుకుంటుంది. అయితే మునుపటికంటే మీ మొబైల్ పర్ఫామెన్స్ విషయంలో తగ్గితే వెంటనే దానికి కారణాలు తెలుసుకోండి. స్మార్ట్‌ఫోన్‌ను ఎలా వేగవంతం చేయాలనే దానిపై అరా తీయండి, ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని శోధించండి.

బ్యాటరీ త్వరగా ఖాళీ అవ్వడం:
స్పైవేర్ నిరంతరం పని చేస్తుంటే, అది మీ బ్యాటరీని సాధారణం కంటే వేగంగా ఖాళీ చేస్తుంది. అయితే అన్ని బ్యాటరీలు క్రమంగా క్షీణిస్తాయి, అలా కాకుండా కారణం లేకుండా త్వరగా క్షీణించడం ప్రారంభమైతే దానికి కారణం తెలుసుకోండి. ముందుగా మీరు ఏదైనా కొత్త అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేసారా? లేదా అప్‌డేట్ చేసారా చూడండి. కొన్ని యాప్స్ కూడా బ్యాటరీ త్వరలో ఖాళీ అవ్వడానికి కారణం అయ్యే అవకాశం ఉంది.

మొబైల్ ఫోన్ వేడెక్కడం: 
మీ మొబైల్ చాలా వేగంగా వేడెక్కుతుంటే ఎవరో మీ మొబైల్ హ్యాక్ చేస్తున్నారని అనుమానించండి. తక్కువగా ఉపయోగించనప్పుడు లేదా అసలే ఉపయోగించకుండా ఉన్నప్పుడు వేడెక్కితుంటే తప్పకుండా దానికి కారణాలు తెలుసుకోండి.

ఎక్కువ డేటా వినియోగం:
మీ మొబైల్ ఫోన్‌లో అనుకోకుండా ఎక్కువ డేటా ఖాళీ అవుతుంటే స్పైవేర్ రన్ అవుతుందనే సంకేతం కావచ్చు. ఎందుకంటే నేరస్థుడు సమాచారాన్ని పొందటానికి యాప్ డేటాను ఉపయోగించాల్సి ఉంటుంది, కాబట్టి డేటా వినియోగంలో పెరుగుదల చాలా ఎక్కువ ఉంటుంది.

ఆఫ్ చేయడం లేదా రీస్టార్ట్ చేయడంలో సమస్యలు:
నిజానికి మన ఫోన్ మనకు కావలసినప్పుడు షట్ డౌన్ చేసుకోవచ్చు, లేదా రీస్టార్ట్ చేసుకోవచ్చు. అయితే హ్యాకర్లు మన మొబైల్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆఫ్ చేయడం లేదా రీస్టార్ట్ చేయడంలో సమస్యలు తలెత్తుతాయి. నేరస్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా మీ ఫోన్ ఉపయోగించాలి కాబట్టి యాక్సెస్ చేయడం జరుగుతుంది.

సర్చ్ బ్రౌజర్ హిస్టరీ:
మీ మొబైల్ ఫోన్‌లో ఎప్పటికప్పుడు బ్రౌజర్ హిస్టరీ చెక్ చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా అందులో ఫోన్ స్పై సాఫ్ట్‌వేర్ గురించి ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్పైవేర్‌ని డౌన్‌లోడ్ చేయడానికి మీ బ్రౌజర్‌ని ఎవరైనా ఉపయోగించే అవకాశం ఉంది. బహుశా అలా జరిగినప్పుడు హిస్టరీలో మనకు కనపడుతుంది.

మొబైల్ ఫోన్‌లో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి.

స్పైవేర్ రిమూవ్ టూల్ ఉపయోగించండి:
మీ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి స్పైవేర్‌ను తీసివేయడానికి రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించండి. ఇది స్పైవేర్ (మరియు ఇతర రకాల మాల్వేర్) కోసం మీ పరికరాన్ని స్కాన్ చేస్తుంది, అదే సమయంలో దానిని పూర్తిగా తీసివేస్తుంది. అయితే దీని కోసం భద్రత కలిగిన సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించాలని గుర్తుంచుకోండి.

ఆపరేటింగ్ సిస్టమ్‌ అప్డేట్ చేయండి:
మొబైల్ ఫోన్ హ్యాక్ నుంచి తప్పించుకోవడానికి ఆపరేటింగ్ సిస్టమ్‌ అప్డేట్ చేయడం మంచిది. దీని ద్వారా పూర్తిగా తీసివేసే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ దాని వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కావున దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉపయోగించాలని సూచిస్తున్నాము.

ఫోన్‌ ఫ్యాక్టరీ రీసెట్ చేయండి:
ఫోన్‌ ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల స్పైవేర్ పూర్తిగా తొలగించబడుతుంది. ఫోన్‌ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే ఫోన్‌లో ఉన్న అన్ని అంశాలు పోతాయి. మీరు ఏదైనా ఫోన్ తీసుకుంటే దానిని తప్పకుండా రీసెట్ చేయాలి. అంతే కాకుండా ఎప్పుడూ అనవసరమైన యాప్స్ డౌన్‌లోడ్‌ చేయకుండా ఉండాలి.

మరిన్ని వార్తలు