రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా మాటే పెట్టు'బడి'..!

15 Aug, 2022 07:17 IST|Sakshi

కంపెనీల ఎంపిక... 
ఝున్‌ఝున్‌వాలా ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టారంటే స్టాక్‌ మార్కెట్లో ఎంతో మంది ఇన్వెస్టర్లకు అది అనుసరణీయంగా మారుతుందనడంలో అతిశయోక్తి కాదు. మరో ఆలోచన లేకుండా అవే కంపెనీల్లో పెట్టుబడి పెట్టి గుడ్డిగా అనుసరించే వారూ ఉన్నారు. కానీ, ఎవరైనా స్వీయ అధ్యయనంతో పెట్టుబడి పెట్టినప్పుడే దాన్ని కొనసాగించగలరు. పెట్టుబడికి ముందు ఒక కంపెనీకి సంబంధించి ఎన్నింటినో ఝున్‌ఝున్‌వాలా చూస్తారు. ఎదుగూ, బొదుగూ లేని వ్యాపారంతో కూడిన క్రిసిల్‌లో ఎందుకు ఇన్వెస్ట్‌ చేశారు? అన్నది అప్పట్లో చాలా మంది నిపుణులు, ఇన్వెస్టర్లకు అర్థం కాలేదు. భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగంగా వృద్ధి సాధిస్తుంటే, విశ్వసనీయమైన క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీల సేవలకు డిమాండ్‌ భారీగా పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. అదే నిజమైంది. రేటింగ్‌ ఏజెన్సీ మార్కెట్లో ఇప్పటికీ క్రిసిల్‌ లీడర్‌. 2002లో రూ.200 పెట్టి ఒక్కో క్రిసిల్‌ షేరు కొంటే, దాని విలువ ఇప్పుడు రూ.3,250.

అన్ని సందర్భాల్లో ‘రైట్‌’ కానక్కర్లేదు 
విజయవంతమైన ఇన్వెస్టర్లు ఆచితూచి, సరైన స్టాక్స్‌ ఎంపిక చేసుకుంటారని ఎక్కువ మంది భావిస్తుంటారు. కానీ, ఎంతో తలపండిన వారెన్‌ బఫెట్‌ దగ్గర్నుంచి ఝున్‌ఝున్‌వాలా వరకు స్టాక్స్‌ పెట్టుబడుల్లో ఎదురుదెబ్బలు సహజం. కనుక వైఫల్యాలను ఆమోదించి, పాఠాన్ని నేర్వడమే ఇన్వెస్టర్‌ చేయాల్సింది. ఝున్‌ఝున్‌వాలా ట్రాక్‌ రికార్డును పరిశీలిస్తే డిష్‌ టీవీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్, మంధన రిటైల్‌ వెంచర్స్‌ ఇవన్నీ పెట్టుబడులను హరించివేసినవి. ఆయన పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న జియోజిత్‌ ఫైనాన్షియల్, బిల్‌కేర్, ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌ ఇలా చాలా కంపెనీలు విజయాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ, అదే సమయంలో ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న కంపెనీల్లో మిగిలినవి గొప్ప రాబడులను ఇచ్చాయి. అందుకే ఆయన నష్టపోయిదానికంటే కూడబెట్టుకున్నది ఎక్కువ. టైటాన్‌ ఒక్కో షేరును రూ.5 కొనుగోలు చేశారు. నేడు అదే షేరు ధర రూ.2,472. ఈ ఒక్క పెట్టుబడి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మొత్తం స్టాక్‌ మార్కెట్‌ జర్నీలో నష్టాలను పూడ్చేసి, అదనపు సంపదను తెచ్చిపెట్టింది. కనుక తప్పిదాలను గుర్తించి, అవసరమైతే ఆ కంపెనీల నుంచి తప్పుకోవడం, రానున్న రోజుల్లో సంపద సృష్టికి అవకాశం ఉన్న వాటిని గుర్తించి పెట్టుబడులు పెట్టడం కీలకం. 

ట్రేడింగ్‌/ఇన్వెస్టింగ్‌... 
చాలా మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు ట్రేడింగ్, ఇన్వెస్టింగ్‌ వేర్వేరు అని భావించరు. నిజానికి ఈ రెండూ విరుద్ధమైనవి. వీటికి అనుసరించే సూత్రాలూ భిన్నమైనవే. రాకేశ్‌ రూ.5,000తోనే ఇంతటి సంపద సాధించగలిగారా..? కాదు. పెట్టుబడికి నిధి కావాలి. ఆ విషయం ఝున్‌ఝున్‌వాలా త్వరగానే గుర్తించారు. మంచి పెట్టుబడి నిధి కోసం ఆయన ఆరంభంలో దశాబ్దం పాటు ట్రేడింగ్‌ను వృత్తిగా మలుచుకున్నారు.ఎదురుదెబ్బలు తగిలినా, కిటుకులు పట్టుకున్నారు. భారీ నిధితో పాటు, మార్కెట్‌ గురించి మంచి విజ్ఞానాన్నీ సంపాదించారు. ట్రేడింగ్‌  స్వల్పకాల రాబడిని ఇస్తుందని.. స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే, దీర్ఘకాల సంపదగా మారుతుందని ఆయన చెప్పేవారు.

అధ్యయనం/ప్యాషన్‌... 
జీవితం అంటే పశ్చాత్తాపాలు కాదు.. ప్రతి తప్పిదం నుంచి నేర్చుకునే మజిలీ అని ఝున్‌ఝున్‌వాలా చెబుతారు. తప్పులే తనను మెరుగైన ఇన్వెస్టర్‌గా మార్చాయని ఆయన స్వయంగా చెప్పారు. వేరే వారిని గుడ్డిగా అనుసరించి ఇన్వెస్ట్‌ చేయడం విజయాన్ని ఇవ్వదు. ఎవరికి వారు మార్కెట్‌ను అధ్యయనం చేయాలి. ప్రముఖ ఇన్వెస్టర్లు చేసిన తప్పులు, వారి విజయానికి దోహదం చేసిన అంశాలను నేర్చుకోవాలి. దీనివల్ల మరింత పరిణతితో లాభాలు పెంచుకోవడం సాధ్యం. రాకేశ్‌కు స్టాక్స్‌లో పెట్టుబడి అంటే ఓ ప్యాషన్‌. ఆయన సంపదలో 99 శాతం స్టాక్స్‌లోనే ఉందంటే ఈక్విటీల పట్ల ఆయనకున్న విశ్వాసం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘మార్కెట్లో సంపద కూడబెట్టుకోవాలంటే సొంతంగా పరిశోధన చేయాలి. నేర్చుకోవడాన్ని అభిరుచిగా మార్చుకోవాలి’ అని ఆయన సూచిస్తారు.

నమ్మకం ఉంచాలి.. 
సరైన అవకాశం అని భావించినప్పుడు భారీగా పెట్టుబడి పెట్టడం ఝున్‌ఝున్‌వాలా విధానం. 1980ల్లో సెసాగోవా (ఇప్పుడు వేదాంతలో భాగం) అనే ఐరన్‌ఓర్‌ కంపెనీ షేరు రూ.24–25లో ఉన్న సందర్భంలో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా రూ.కోటి ఇన్వెస్ట్‌ చేశారు. ఐరన్‌ఓర్‌ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉన్న రోజులవి. కానీ, ఆ కంపెనీలో ఎంతో విలువ దాగుందని ఆయన భావించి పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత నష్టాలు వచ్చినా పట్టించుకోలేదు. కానీ, అదే షేరు తర్వాతి కాలంలో ఎన్నో రెట్ల లాభాలను తెచ్చిపెట్టింది. టైటాన్‌లోనూ అంతే.  కంపెనీ అంతర్గత విలువ కంటే తక్కువలో ట్రేడ్‌ అవుతుంటే అలాంటి కంపెనీలను ఝున్‌ఝున్‌వాలా విస్మరించరు. 2020 మార్కెట్‌ పతనంలో టాటా మోటార్స్‌ షేరు రూ.65కు పడిపోయింది. మార్కెట్‌ విలువ రూ.24,000 కోట్లకు దిగొచ్చింది. జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌తోపాటు, రూ.2,00,000 కోట్ల అమ్మకాలు కలిగిన కంపెనీ ఇంత తక్కువలో ట్రేడ్‌ అవ్వడం చాలా చౌక అని భావించి ఎక్స్‌పోజర్‌ తీసుకున్నారు. అక్కడి నుంచి టాటా మోటార్స్‌ ఏడు రెట్లకు పైగా పెరిగింది.

సహనం
ఓర్పు అన్నది ఈక్విటీ మార్కెట్లో రెండువైపులా పదునైన కత్తి వంటిది. మంచి యాజమాన్యం, ఆర్థిక బలం, కంపెనీ ఉత్పత్తి లేదా సేవల పట్ల ప్రజల్లో మంచి గుర్తింపు, ఆదరణ ఇలాంటి ఎన్నో బలాలున్న కంపెనీని ఎంపిక చేసుకుని పెట్టుబడి పెట్టామంటే.. మంచి లాభాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ, అంచనాలు నిజమై మంచి రాబడినిచ్చే వరకు ఆగే ఓపిక కూడా ఉండాలి. ‘స్టాక్‌ మార్కెట్‌ ఓపిక లేని వాడి పెట్టుబడిని తీసుకెళ్లి ఓపిక వహించిన వాడికి రాబడిగా ఇస్తుంది’అన్నది వారెన్‌ బఫెట్‌ చెప్పేమాట. ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత కొద్ది రాబడికే విక్రయించడం, బాగా నష్టం వచ్చిందని వెంటనే విక్రయించి బయటపడడం సక్సెస్‌ను ఇవ్వదు. రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడుల ప్రయాణాన్ని గమనిస్తే చాలా స్టాక్స్‌లో ఆయన దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించినట్టు తెలుస్తుంది. తాను కొనుగోలు చేసింది వ్యాపారాన్నే కానీ, స్టాక్‌ను కాదని ఆయన నమ్ముతారు. కంపెనీ పనితీరు బాగుండి, ఆర్థిక మూలాలు బలంగా ఉన్నంత కాలం.. భవిష్యత్తు బాగుంటుందన్న విశ్వాసం ఉన్నంత కాలం ఆ పెట్టుబడులను ఓపిగ్గా కొనసాగిస్తారు. అదే రూ.5లో కొన్న టైటాన్‌ స్టాక్‌ రూ.2,500 అయినా అమ్మకుండా ఆయన్ను కొనసాగించేలా చేసింది.

చదవండి👉 ఈ టిప్స్‌ పాటిస్తే స్టాక్‌ మార్కెట్‌లో మీరే మెగాస్టార్లు : రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా

మరిన్ని వార్తలు