iPhone 14 Crash Detection : ఐఫోన్ 14లో కార్‌ క్రాష్ డిటెక్షన్ ఫీచర్.. అది ఎలా పనిచేస్తుందంటే?

31 Dec, 2022 13:59 IST|Sakshi

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌  రోడ్డు ప్రమాదంతో యావత్‌ దేశం ఉలిక్కిపడింది. పంత్‌ ఢిల్లీ నుంచి తన స్వస్థలం ఉత్తరాఖండ్‌కు వస్తున్న సమయంలో.. రూర్కీ సమీపంలోని నర్సన్‌ సరిహద్దు వద్ద ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అతని కారులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న పంత్‌ను అదే మార్గంలో హరిద్వార్‌ వెళ్తున్న బస్ డ్రైవర్‌ సునీల్‌ కారులో నుంచి బయటకు లాగారు.

అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఇలాంటి ప్రమాదాల నుంచి యూజర్లను కాపాడేందుకే యాపిల్‌ సంస‍్థ ఐఫోన్‌ 14లో కార్‌ క్రాష్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను అభివృద్ధి చేసింది. ఐఫోన్‌, యాపిల్‌ వాచ్‌ వినియోగిస్తున్న యూజర్లు రోడ్డు ప్రమాదాలకు గురైతే  అత్యవసర సేవలకు కనెక్ట్‌ అయ్యేందుకు సహాయ పడుతుంది.  

యాపిల్‌ కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అంటే ఏమిటి?
క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అనేది సెడాన్లు, మినీవ్యాన్‌లు,ఎస్‌యూవీలు, పికప్ ట్రక్కులు, ఇతర ప్యాసింజర్ కార్లతో కూడిన ఫ్రంట్-ఇంపాక్ట్, సైడ్-ఇంపాక్ట్ వంటి కారు ప్రమాదాల్ని గుర్తించేందుకు సహాయపడుతుంది. ఆ ఫీచర్‌ ఇప్పుడు ఐఫోన్‌ 14 మోడల్స్‌తో పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8, యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ (2వ తరం), యాపిల్‌ వాచ్‌ ఆల్ట్రా తాజా వెర్షన్ వాచ్‌ఓఎస్‌లో సైతం అందుబాటులోకి వచ్చింది.  

కార్‌ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఎలా పని చేస్తుంది? 
ఐఫోన్‌ 14 మోడల్‌లలో క్రాష్ డిటెక్షన్ డిఫాల్ట్‌గా ఆన్ ఆవుతుంది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అలారం మోగుతుంది. ఐఫోన్ లేదా ఆపిల్ వాచ్‌లో రోడ్డు ప్రమాదానికి గురైనట్లు చూపిస్తుంది. వెంటనే ఫోన్‌ స్క్రీన్‌ మీద ఎమర్జెన్సీ ఫోన్‌ నెంబర్ల స్లైడర్‌ డిస్‌ప్లే అవుతుంది. ఆ డిస్‌ప్లే మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్‌ చేసే పరిస్థితుల్లో లేరంటే 20 సెకన్లలో అదే నెంబర్‌కు ఫోన్‌ కాల్‌ వెళుతుంది. ప్రమాదంలో ఉన్నారని కుటుంబ సభ్యులు, స్నేహితులు, పోలీసులు, దగ్గరలో ఉన్న హాస్పటల్స్‌కు  వాయిస్‌  కాల్స్‌ వెళతాయి.

మరిన్ని వార్తలు