Stock Market: రిటైర్మెంట్‌ తర్వాత స్టాక్‌ మార్కెట్‌లో ప్రవేశించవచ్చా?

13 Sep, 2021 07:34 IST|Sakshi

నా వయసు 61 ఏళ్లు. పదవీ విరమణ తీసుకున్నాను. నా దగ్గరున్న నిధిపై మంచి రాబడుల కోసం ఈక్విటీలను పరిశీలించొచ్చా? – టీకే సిన్హా

20 ఏళ్ల క్రితం అయితే పదవీ విరమణ తర్వాత స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయకూడదనే ఆలోచన ఉండేది. ఎందుకంటే నాడు స్థిరాదాయ పథకాలు (డెట్‌) మెరుగైన రాబడులను ఇచ్చేవి. అప్పట్లో ఈక్విటీ పెట్టుబడులు మరింత రిస్క్‌తో ఉండేవి. కానీ, ఇప్పుడు సురక్షితంగా మారాయి. వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టిన  పరిస్థితుల్లో పదవీ విరమణ తీసుకున్న చాలా మందికి ఈక్విటీ పెట్టుబడులు సైతం కీలకంగా మారాయి.

కనుక ఈక్విటీల్లోనూ కొంత భాగం ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయని సందర్భాల్లో.. మీ వద్ద తగినంత పొదుపు నిధి లేకపోతే.. కేవలం స్థిరాదాయ పథకాల్లోనే ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మీ అవసరాలు మీ మూలనిధిని మించిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయకపోవడం కూడా రిస్కీ అవుతుంది. దీన్ని ఎంత ముందుగా గుర్తిస్తే అంత మంచిది. గతంలో అయితే ఇంటి అద్దె, పెన్షన్‌ ఆదాయం లేదా డెట్‌ నుంచి అధిక ఆదాయం ఉండేది. కానీ, నేటి పరిస్థితుల్లో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టుకోవడం తప్పనిసరి.  

నేను పెట్టుబడులకు కొత్త. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు ఎలా ప్రారంభించాలి? – ఎండీ అబీద్‌ హుస్సేన్‌
 

సెక్షన్‌ 80సీ కింద ఆదాయంపై పన్ను మినహాయింపు కోరుకునేట్టు అయితే పన్ను ఆదా పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) రెండింటిని ఎంచుకుని సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. సెక్షన్‌ 80సీ కింద పన్ను ఆదా కోరుకోనట్టు అయితే.. నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్‌ లేదా అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌లో రెండు మంచి పథకాలను ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టుకోవచ్చు.

ఉదాహరణకు యూటీఐ నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్‌ లేదా మిరే అస్సెట్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. సిప్‌ ద్వారా పెట్టుబడులు మొదలు పెట్టి కనీసం మూడేళ్లపాటు అయినా కొనసాగించాలి. క్రమశిక్షణతో, మార్కెట్లు పడినా, పెరిగినా ప్రతికూల అభిప్రాయాలను పెద్దగా పట్టించుకోకుండా కొనసాగడం అవసరం. ఇలా చేయగలిగితే ఈక్విటీ మార్కెట్ల పనితీరుపై చక్కని అవగాహన ఏర్పడుతుంది. ఆత్మ విశ్వాసంతో మరింత ప్రణాళికాయుతంగా పెట్టుబడుల విషయంలో ముందుకు వెళతారు.  

ఖర్చులను జీవిత భాగస్వామి భరించేట్టు అయితే.. స్వయం ఉపాధిలోని మహిళ ప్రతీ నెలా తన ఆదాయం నుంచి రూ.10,000–20,000 మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు? – గోపాల్‌ ప్రసాద్‌
 

మీ విషయంలో ఆర్జించే మొత్తంపై స్వేచ్ఛ ఉన్నట్టే. దీన్ని వినియోగానికి మళ్లించకుండా.. పద్ధతి ప్రకారం పెట్టుబడులు పెట్టుకోవాలి. ఈ విషయంలో పెట్టుబడులకు సంబంధించిన సూత్రాలను ఆచరణలో పెట్టాలి. ఎంత కాలానికి ఇన్వెస్ట్‌ చేస్తారన్న అంశంపై పెట్టుబడి సాధనం ఆధారపడి ఉంటుంది. ఐదేళ్లు, ఆలోపే డబ్బులతో అవసరం ఉందనుకుంటే.. అప్పుడు పెట్టుబడి సాధనాల విషయంలో కాస్త రక్షణాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఏ మాత్రం రాజీలేని లక్ష్యం అయితే మరింత రక్షణాత్మకంగా వ్యవహరించాలి. అప్పుడు స్థిరాదాయ పథకాలను దాటి వెళ్లకూడదు. ఒకవేళ కొంత ఆలస్యం అయినా ఫర్వాలేదనుకుంటే.. ఉదాహరణకు ఇంటి రుణానికి డౌన్‌ పేమెంట్‌ కోసం అయితే ఏడాది, రెండేళ్ల పాటు లక్ష్యాన్ని వాయిదా వేసుకోగలరు. అటువంటి సందర్భాల్లో 15–20 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించి, మిగిలిన మొత్తాన్ని డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఐదేళ్లు, అంతకుమించిన కాల వ్యవధి కోసం అయితే ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడుల విలువను రోజువారీగా చూడడం మానుకోవాలి. అప్పుడు ఆందోళన లేకుండా స్థిరంగా వ్యవహరించగలరు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు