అత్యవసర నిధి ఎంత ఉండాలి? ఎలా మేనేజ్‌ చేయాలి?

1 Nov, 2021 13:11 IST|Sakshi

పోర్ట్‌ఫోలియోలో ఈఎస్‌జీ ఫండ్స్‌కు చోటివ్వాలా? ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో ఈఎస్‌జీ ఫండ్స్‌ కూడా ఉండాలా? మంచి ఫ్లెక్సీక్యాప్‌ లేదా లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌కు ఇవి ఏ రకంగా భిన్నంగా ఉంటాయి? – రాజుగోపాల్‌ శ్రీధర్‌ 
ఎన్విరాన్‌మెంట్, సోషల్‌ అండ్‌ గవర్నెన్స్‌ (ఈఎస్‌జీ) ఫండ్స్‌కు ఇప్పుడు ఆరంభదశ. ఇందులో విశ్వసనీయమైన ఎంపికలు ప్రస్తుతానికి లేవన్నది నా అభిప్రాయం. ప్రధాన ఫండ్స్‌లోనూ ఈఎస్‌జీకి చోటు కీలకంగా మారుతోంది. సమాజానికి, పర్యావరణానికి అనుకూలమైన కంపెనీలు వ్యాపారానికి కూడా మంచివే. భారత్‌లో దీర్ఘకాలంలో విజేతలైన కంపెనీలకు సంబంధించి కార్పొరేట్‌ పరిపాలన ఎంతో కీలకంగా ఉంటోంది. మన దేశంలో ఈఎస్‌జీ ఫండ్స్‌ ఇంకా ప్రధాన విభాగంగా పరిణమించలేదు. ఈ దశలో ఇన్వెస్టర్లకు ఈ విభాగంలో విస్తృతమైన ఎంపికలు లేవు.  

ఈక్విటీల్లో పెట్టుబడులపై రాబడులను డెట్‌ ఫండ్స్‌కు మళ్లించడాన్ని మీరు సూచిస్తారా? ముఖ్యంగా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌కు సంబంధించి ఇలా చేయవచ్చా? – మోతి రాజేంద్రన్‌ 
రక్షణాత్మక ధోరణితో ఉండే ఇన్వెస్టర్లు స్మాల్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయకూడదు. ఒకవేళ మీరు స్మాల్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి, వాటిపై మంచి లాభాలు కనిపిస్తుంటే, వాటిని కాపాడుకునేందుకు వెనక్కి తీసుకుని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ (డెట్‌ పథకాలు) ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల పూర్తి భద్రత లభించినట్టు కాదు. ఎందుకంటే మీరు కేవలం లాభాలను మాత్రమే వెనక్కి తీసుకుని, అసలు పెట్టుబడిని అందు లోనే కొనసాగిస్తారు కనుక.. మార్కెట్లు దిద్దుబాటుకు లోనయితే పెట్టుబడుల విలువ గణనీయంగా క్షీణించే అవకాశం లేకపోలేదు. మీదైన అస్సెట్‌ అలోకేషన్‌ విధానాన్ని అనుసరించండి. దీనికి బదులు వివిధ రకాల ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసి మంచి లాభాలు కనిపిస్తుంటే.. కరెక్షన్‌ వచ్చినా లాభాలు కాపాడుకోవాలని భావిస్తుంటే మొత్తం పెట్టుబడుల్లో ఒక వంతును స్థిరాదాయ పథకాల్లోకి మార్చుకోవచ్చు. ఇది మరింత అర్థవంతంగా ఉంటుంది. ఒక్కో ఇన్వెస్టర్‌ పెట్టుబడుల కాలాన్ని అనుసరించి వచ్చిన లాభాలు వేర్వేరుగా ఉంటుంటాయి. ఉదాహరణకు 15–20 ఏళ్ల క్రితం నాటి పెట్టుబడులు కూడా నాకు కొన్ని ఉన్నాయి. ఈ పెట్టుబడుల విలువలో 90 శాతం లాభాల రూపంలో సమకూరిందే. ఒకవేళ మీరు ఒక నెల క్రితమే లేదా సంవత్సరం క్రితమే ఇన్వెస్ట్‌ చేసి, 50 శాతం పెరిగి ఉంటే.. అందులో మీ లాభం మూడింట ఒక వంతుగానే ఉంటుంది. ఒకవేళ మీరు ఐదేళ్ల క్రితం ఇన్వెస్ట్‌ చేసి ఉంటే మొత్తం విలువలో మీ లాభాలు 75 శాతంగా ఉండొచ్చు. కనుక పెట్టుబడుల కాలాన్ని అనుసరించి ఈ లాభాల పరిమా ణం వేర్వేరుగా ఉంటుంది. మార్కెట్ల పట్ల ఆందోళనగా ఉంటే, గణనీయంగా పడిపోతాయని    భావిస్తుంటే.. మీరు అస్సెట్‌ అలోకేషన్‌ (వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను విభజించడం)ను అనుసరించాలి.  

అత్యవసర నిధిగా ఎంత మొత్తం ఉండాలన్నది ఎలా నిర్ణయించుకోవాలి? అసలు ఎంత సరిపోతుంది?– కరణ్‌ 
అత్యవసర నిధికి సంబంధించి కచ్చితమైన, ప్రామాణిక సూత్రం అంటూ ఏదీ లేదు. మీ అంతట మీరే దీన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటే.. వారికి సంబంధించి వైద్య అత్యవసర పరిస్థితులు ఎదురుకావచ్చు. అటువంటి సందర్భాల్లో మీకు అధిక మొత్తంలో అత్యవసర నిధి అవసరం అవుతుంది. మీకు పిల్లలు ఉంటే అప్పుడు అత్యవసర నిధి అవసరం వేరుగా ఉంటుంది. అలాగే, మీ ఉద్యోగానికి భద్రత ఎంత మేరకు? మీ ఆదాయంలో స్థిరత్వం ఏ మేరకు అన్నది కూడా అత్యవసర నిధిని నిర్ణయించుకోవడంలో ముఖ్య అంశాలు అవుతాయి. ఆదాయంలో స్థిరత్వం లేకపోతే అత్యవసర నిధి మరింత మొత్తం ఏర్పాటు చేసుకోవాలి. ఎంత మేరకు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకునేందుకు ఈ అంశాలన్నీ కీలకమవుతాయి.   

- ధీరేంద్రకుమార్‌,సీఈవో,వ్యాల్యూ రీసెర్చ్‌
 

మరిన్ని వార్తలు