దుబాయ్‌ బంగారాన్ని తెస్తున్నారా? లిమిట్‌ ఎంతో తెలుసా?

21 Oct, 2022 16:15 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతీయులకు బంగారం అంటే మోజు ఎక్కువ. అందులోనూ తక్కువ ధరకు, ప్రీమియం క్వాలిటీతో లభించే దుబాయ్‌ బంగారం అంటే మరీ ఇష్టం.  ముఖ్యంగా ధంతేరస్‌ పర్వదినం సందర్బంగా ఎంతో కొంత గోల్డ్‌ను కొనుగోలు చేయడం బాగా అలవాటు. అయితే  మన దేశంలో తరుగు మేకింగ్‌ చార్జీలు బాదుడు ఎక్కువ. దీంతో దుబాయ్‌ బంగారానికి గిరాకీ ఎక్కువ.

ఐకానిక్ భవనాలు, ఎక్సైటింగ్‌ ఈవెంట్స్‌ మాత్రమే కాదు షాపింగ్‌కోసం ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒ‍కటి దుబాయ్‌.  అందుకే చాలామంది దుబాయ్‌ నుంచి పుత్తడిని, బంగారు ఆభరణాలను  భారత్‌కు తీసుకొస్తూ ఉంటారు.  కానీ ఇండియాలో బంగారంపై దిగుమతి సుంకాన్ని చెల్లించాలి. రోజువారీ ధరించే లైట్ వేర్ బంగారు ఆభరణాలకు కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు ఉన్నప్పటికీ,  బార్లు లేదా నాణేల రూపంలో బంగారం కస్టమ్ డ్యూటీ  చెల్లించాల్సిందే. ఈ నేపథ్యంలో దుబాయ్‌ నుంచి  గోల్డ్‌ తెచ్చుకోవాలంటే కొన్ని మార్గదర్శకాలను పాటించాలి. లేదంటే తిప్పలు తప్పవు.

ప్రభుత్వసుంకాలు, ఇతర ఛార్జీలవివరాలను పరిశీలిస్తే.. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ పరోక్ష పన్నులు అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) ప్రకారం 1967 పాస్‌పోర్ట్ చట్టం ప్రకారం జారీ చేయబడిన చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్ ఉన్న ఏదైనా  భారత సంతతికి చెందిన వ్యక్తులు బ్యాగేజీలో బంగారు ఆభరణాలను భారతదేశానికి తీసుకురావడానికి అర్హులు.  దిగుమతి సుంకం విషయానికి వస్తే ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉంటే..వారు తీసుకొచ్చే  పసిడికి 12.5 శాతం+సర్‌చార్జ్‌ 1.25 శాతం వర్తిస్తుంది. అలాగే దుబాయ్‌నుంచి ఇండియాకు ఒక వ్యక్తి తెచ్చిన పుత్తడిపై  38.5 శాతం కస్టమ్స్‌ సుంకం చెల్లించాల్సి ఉంటుంది.

ఒక సంవత్సరానికి పైగా విదేశాలలో నివసిస్తున్న ఒక వ్యక్తి  20 గ్రాముల బంగారు ఆభరణాలను, లేదా 50 వేల రూపాయల విలువకు మించకుండా  తీసుకురావచ్చు. అదే మహిళా ప్రయాణికులైతే  ఒక  లక్ష రూపాయల  గరిష్ట విలువ, 40 గ్రాముల  బంగారు ఆభరణాలు తీసుకురావచ్చు.  కాగా కరెంట్‌ ఖాతా లోటుకు చెక్‌ చెప్పేలా బంగారంపై దిగుమతి సుంకాన్ని ఈ ఏడాది  15 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు ఇది 10.75 శాతం మాత్రమే.
 

మరిన్ని వార్తలు