మన స్మార్ట్‌ఫోన్‌లో ఎంత ర్యామ్ ఉండాలి?

12 Feb, 2021 20:14 IST|Sakshi

ప్రతి సంవత్సరం మొబైల్ మార్కెట్లోకి కొత్త కొత్త ఫీచర్లతో చాలా మొబైల్స్ విడుదల అవుతుంటాయి. అయితే, చాలా మంది మాత్రం ఏ మొబైల్ కొనాలనే విషయంలో అయోమయానికి లోనవుతారు. కొన్నిసార్లు రకరకాల ఆలోచనలతో విరమించుకున్నవాళ్లూ ఉంటారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ప్రధానంగా కోరుకునేది వేగం. తమ ఫోన్ వేగంగా పనిచేయాలని కోరుకుంటారు. అందుకు మొబైల్ లో అతి ముఖ్యమైనది ర్యామ్. మన ఫోన్ ఎంత సామర్థ్యం గల ర్యామ్ ఉంటే అంత వేగంగా పనిచేస్తుంది. 

కానీ, కొన్నిసార్లు మనకు అవసరం లేని దానికన్నా ఎక్కువ సామర్ధ్యం గల మొబైల్ కొన్న డబ్బులు వృధానే. అందుకే మనం ఏదైనా మొబైల్ కొనే ముందు మనకు ఎంత సామర్ధ్యం గల ర్యామ్ ఉంటే మంచిది అని తెలుసుకోవాలి. అసలు ర్యామ్ అంటే ఏమిటి, మన మొబైల్ ఫోన్ లో ఎంత సామర్ధ్యం గల ర్యామ్ ఉంటే మంచిది అని ఇప్పడు తెలుసుకుందాం.. 

ర్యామ్(రాండమ్ యాక్సెస్ మెమరీ):
రాండమ్ యాక్సెస్ మెమరీ అనేది తాత్కాలిక, ఇంటర్మీడియట్ డేటాను నిల్వ చేసే ఒక మెమరీ. మన మొబైల్ లో స్వల్ప కాలంలో ఎక్కువ పనులు ఒకేసారి చేసిపెడుతుంది. ఇది డేటాను మాత్రం ఎప్పటికి నిల్వ చేసుకోదు, తక్కువ కాలం మాత్రమే మనం మొబైల్ లో చేసే పనులను గుర్తుంచుకుంటుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెబుతాను. మీరు మొబైల్ ఒక చిన్న గేమ్ ఇన్స్టాల్ చేసి ఆడుతుంటారు అనుకుందాం. మీకు ఏదైనా కాల్ వచ్చినప్పుడు వారితో మాట్లాడుతారు. ఆ తర్వాత మళ్లీ గేమ్ ఓపెన్ చేస్తారు. అప్పుడు ఆ గేమ్ మళ్లీ మొదటి నుంచి ప్రారంభం అవుతుంది. ఇలా మొదటి నుంచి ప్రారంభం కావడానికి ప్రధాన కారణం మీ మొబైల్ తక్కువ సామర్ధ్యం గల ర్యామ్ ఉండటం వల్ల అది తక్కువ కాలానికి గుర్తు పెట్టుకుంది. 

అలాగే మీ మొబైల్ లో ఎక్కువ సామర్ధ్యం గల ర్యామ్ ఉంటే రెండు, మూడు పనులను ఒకేసారి చేసిన ఎటువంటి ఆటంకం కలగదు. పైన చెప్పిన ఉదాహరణలో తక్కువ ర్యామ్ ఉండటం వల్ల ఎక్కువ సేపు గేమ్ గుర్తుపెట్టుకోలేక మొదటి నుంచి ప్రారంభం అయ్యింది. అయితే, అసలు మన మొబైల్ లో ఎంత సామర్ధ్యం గల ర్యామ్ తీసుకోవాలంటే మన అవసరాలు బట్టి మనం నిర్ణయించుకోవాలి. మొబైల్ ఫోన్ తక్కువగా వాడే వారు 8జీబీ ర్యామ్ గల మొబైల్ ను తీసుకున్న డబ్బులు వృధానే. అలాగే ఎక్కువ మొబైల్ తో పనిచేసే వారు 3జీబీ ర్యామ్ తీసుకుంటే మీకు చిరాకు వేస్తుంది.                  

1జీబీ - 3జీబీ ర్యామ్:
స్మార్ట్‌ఫోన్ ను కొత్తగా కొనేవారు లేదా తక్కువ వాడే వారు 3జీబీ లోపు ర్యామ్ గల మొబైల్ తీసుకుంటే మంచిది. వీటి ద్వారా ఎటువంటి ఆటంకం లేకుండా కాల్స్, సందేశాలను పంపడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆన్లైన్ లో ఇతర పనులు చేసుకునే వారు ఆశించవచ్చు. సాధారణ అవసరాలకు ఫోన్లను వాడేవారికి ఇవి చాలా ఉత్తమంగా ఉంటాయి. మీ ఇంట్లో ఉండే పెద్దవారికి ఇవి చాలా ఉపయోగపడుతాయి. ఈ ఫోన్లలో టెంపుల్ రన్ వంటి జనాదరణ పొందిన గేమ్స్ కూడా కష్టంగా ప్లే అవుతాయి, మల్టి-టాస్క్ కూడా నిర్వహించలేవు. వీటిని ఎంట్రీ లెవెల్ మొబైల్స్ అని అంటారు. 

 4జీబీ - 6జీబీ ర్యామ్:
స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియా బాగా ఉపయోగించే వారు, ఫోనులో ఒకేసారి రెండు లేదా మూడు పనులు చేసేవారి మొబైల్ ఫోన్ లలో 4జీబీ - 6జీబీ సామర్థ్యం గల ర్యామ్ ఉంటే చాలా మంచిది. అలాగే ఫోటోలను, వీడియోలను ఎడిట్ చేసుకునే వారికీ కూడా బాగా ఉపయోగపడుతాయి. 4జీబీ - 6జీబీ ర్యామ్ గల మొబైల్ మల్టీ-టాస్కింగ్ పనులు కూడా సులభంగా నిర్వహిస్తుంది. మీరు ఒకేసారి బ్రౌజర్ ట్యాబ్లు, మెసేజింగ్ యాప్స్ వంటివి ఒకేసారి చక్కగా నిర్వహించవచ్చు. పబ్‌జీ, ఫౌజీ వంటి గేమ్స్ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఆడవచ్చు. మీకు 

8జీబీ - 12జీబీ ర్యామ్:
ప్రస్తుతం చాలానే స్మార్ట్ ఫోన్లు 8జీబీ ర్యామ్ తో వస్తున్నాయి. ఈ ఫోన్ హెవీ గేమింగ్ మల్టి టాస్కింగ్, సూపర్ స్పీడ్ తో పనిచేస్తుంది. ఎక్కువ శాతం పనులను మొబైల్ ద్వారా చేయాలనుకునే వారికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. హై-ఎండ్ గేమ్స్, ఫోటో, వీడియో చేసే వారికీ 8జీబీ - 12జీబీ ర్యామ్ సామర్ధ్యం గల మొబైల్స్ చాలా ఉపయోగపడుతాయి. Aspalt 9, Call Of Duty వంటి హై ఎండ్ గేమ్స్ ఆడేవారికి సరిగ్గా సరిపోతుంది. ఇది ఎటువంటి ఆటంకం లేకుండా చాలా అప్స్ ని ఒకేసారి నిర్వహిస్తుంది. ర్యామ్ తో పాటు మన మొబైల్ లో వచ్చే ప్రాసెసర్ మీద ఆధారపడి కూడా మొబైల్ పనితీరు ఆధారపడి ఉంటుంది.

మరిన్ని వార్తలు