ఇవి తెలుసుకుంటే.. మెడికల్‌ బిల్లుల భారం తగ్గించుకోవచ్చు!

21 Nov, 2022 08:45 IST|Sakshi

సమగ్రమైన బీమా ప్లాన్‌ తీసుకోవాలి

రూమ్‌ రెంట్‌ పరిమితులు ఉండకూడదు

డైలీ క్యాష్, కన్జ్యూమబుల్స్‌ కవర్‌ తీసుకోవాలి

ఓపీడీ సేవలకూ కవరేజీ అవసరం ‘కోపే’ షరతులు లేకుండా చూసుకోవాలి

నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో చార్జీలు తక్కువ

కుమార్‌ ప్రైవేటు ఉద్యోగి. ఇటీవలే కడుపులో తీవ్రమైన నొప్పితో హాస్పిటల్‌ లో చేరాడు. పరిశీలించిన వైద్యులు పేగు సంబంధిత ఇన్ఫెక్షన్‌గా తేల్చారు. మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్‌ చేయగా, మొత్తం బిల్లు రూ.80వేలు వచ్చింది. నిజానికి కుమార్‌కు రూ.5 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్‌ హెల్త్‌ ప్లాన్‌ ఉంది. దాంతో అతడు నిశ్చింతగా ఉన్నాడు. కానీ, అయిన బిల్లులో బీమా కంపెనీ చెల్లించింది కేవలం రూ.49,000. మిగిలిన రూ.31,000 తను జేబు నుంచి చెల్లించాల్సి వచ్చింది. బీమా సంస్థ అంత మొత్తం ఎందుకు తగ్గించిందన్నది అతడికి అంతుబట్టలేదు. ఇది కుమార్‌ ఒక్కడికే ఎదురైన పరిస్థితి అనుకోవద్దు. వైద్య చికిత్సల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తమ సొంత ఖజానా నుంచి చెల్లించుకోవాల్సిన సందర్భాలు బోలెడు. నీతి ఆయోగ్‌ 2021 నివేదిక ప్రకారం.. దేశంలో ఆరోగ్య సంరక్షణ కోసం చేస్తున్న మొత్తం వ్యయాల్లో 63 శాతాన్ని ప్రజలు సొంతంగా భరిస్తున్నారు. ప్రపంచదేశాల్లోనే ఇది ఎక్కువ. దీని వెనుక ఎన్నో కారణాలున్నాయి. ఆరోగ్య బీమా పాలసీ ఉన్నా ఇలా మన జేబు నుంచి చెల్లించుకోవాల్సిన పరిస్థితులను తగ్గించుకోవాలంటే ఏం చేయాలో చెప్పే కథనమిది...

అసలు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అన్నదే లేకపో వడం, ఉన్నా సమగ్ర కవరేజీతో తీసుకోకపోవడం కూడా క్లెయిమ్‌ సమయంలో పాలసీదారులపై అదనపు భారం పడేలా చేస్తోంది. చికిత్సలో భాగంగా ఉపయోగించే కొన్ని రకాల వస్తువులు, సేవలకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ నుంచి మినహాయింపు ఉన్న విషయాన్ని నివా బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అండర్‌ రైటింగ్, ప్రొడక్ట్స్‌ క్లెయిమ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బబతోష్‌ మిశ్రా గుర్తు చేశారు. ‘‘చాలా మంది సమగ్రమైన కవరేజీని ఎంపిక చేసుకోవడం లేదు. కరోనా సంక్షోభం తర్వాత పెరిగిపోయిన ద్రవ్యోల్బణ ప్రభావంతో, ఎక్కువ రోజుల పాటు హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తే కవరేజీ చాలడం లేదు.

దాంతో మిగిలిన మొత్తాన్ని పాలసీదారులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది’’ అని బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం హెడ్‌ భాస్కర్‌ నెరుర్కర్‌ పేర్కొన్నారు. ఔట్‌ పేషెంట్‌ రూపంలో పొందే వైద్య సేవలకు చాలా ప్లాన్లలో కవరేజీ ఉండదు. కో–పే, సబ్‌ లిమిట్‌ తదితర షరతులు క్లెయిమ్‌ సమయంలో పాలసీదారులపై చెల్లింపుల భారానికి కారణమవుతాయి. అందుకుని పాల సీ కవరేజీ విషయంలో కొన్ని ముందస్తు జా గ్రత్తలు తప్పనిసరి. దీనికితోడు పాలసీదారులు తమపై భారం తగ్గించుకునేందుకు అందుబాటు లోని ఇతర మార్గాలను గుర్తించడమే పరిష్కారం.

బయటి ల్యాబ్‌లు
ఔట్‌ పేషెంట్‌గా వైద్య చికిత్సలకు వెళ్లినప్పుడు హాస్పిటల్‌కు సంబంధించిన ల్యాబ్‌లలో కాకుండా, బయటి డయాగ్నోస్టిక్స్‌లో టెస్ట్‌లు చేయించుకోవడం ద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు. హాస్పిటల్‌ అనుబంధ కేంద్రాల్లో రక్త పరీక్షలు, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్‌ తదితర రేడియో ఇమేజింగ్‌ సేవల చార్జీలు ఎంతో అధికంగా ఉంటుంటాయి. ప్రైవేటులోనూ హెల్త్‌ స్టార్టప్‌ల రూపంలో ఎన్నో కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. హెల్తియన్స్, థైరోకేర్‌ ఇలా చాలానే ఉన్నాయి. వైద్యులు పరీక్షలు సూచించినప్పుడు తక్కువ చార్జీలున్న వాటికి (న మ్మకమైన సంస్థలకే పరిమితం) వెళ్లొచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ పరీక్షలు చేయించుకోవచ్చు. హాస్పి టల్‌ చార్జీలతో పోలిస్తే 40–50 శాతం తక్కువకే ఎన్నో సంస్థలు ఈ సేవలను ఆఫర్‌ చేస్తున్నాయి.

జనరిక్‌ మందులు
వైద్యుల సూచించిన మందులను, హాస్పిటల్‌ వద్దనున్న ఫార్మసీల్లోనే తీసుకోవాలని లేదు. ఆ ప్రిస్కిప్షన్‌తో నేరుగా జనరిక్‌ ఫార్మసీ స్టోర్‌కు వెళ్లి వాటికి ప్రత్యామ్నాయాలను తీసుకోవచ్చు. కంపెనీ ఏదైనా, లోపల అదే మందు ఉంటే చాలు. బ్రాండెడ్‌ ఔషధాల పేర్లకు బదులు, ఫార్మా ఇంగ్రేడియంట్‌ పేర్లతోనే రోగులకు మందులు సూచించాలని జాతీయ వైద్య మండలి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. కనుక బ్రాండెడ్‌ ఔషధాలకు జనరిక్‌ మందులు మంచి ప్రత్యామ్నాయం. ఫార్మా కంపెనీలు తమ బ్రాండ్లను సిఫారసు చేయాలంటూ వైద్యులను కోరుతుంటాయి. ఇందుకోసం సిబ్బంది, వైద్యులకు ప్రయోజనాల రూపంలో చాలా ఖర్చు చేస్తుంటాయి. దీంతో బ్రాండెడ్‌ ఔషధాల ధరలు అధికంగా ఉంటాయి. జనరిక్‌ మందులకు ఈ బెడద లేదు. బ్రాండెడ్‌తో పోలిస్తే 80 శాతం చౌకగా లభిస్తాయి. ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన కేంద్రాలు కూడా దేశవ్యాప్తంగా జనరిక్‌ ఔషధాలను విక్రయిస్తున్నాయి.

తగినంత కవరేజీ
ఒకరి అవసరాలకు తీర్చే, సరిపడా కవరేజీతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం ఎంతో ముఖ్యమని మెడి అసిస్ట్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ నిఖిల్‌ చోప్రా సూచించారు. ఏ పట్టణంలో నివసిస్తున్నారు? వయసు? కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు? కుటుంబ ఆరోగ్య చరిత్ర అంశాల ఆధారంగా కవరేజీ ఎంతన్నది నిర్ణయించుకోవాలి. పెళ్లయి, పిల్లలతో మెట్రోల్లో నివసించే వారు కుటుంబం మొత్తానికి మెరుగైన కవరేజీతో ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ తీసుకోవాలి. కనీసం రూ.5–10 లక్షలకు బేస్‌ ప్లాన్‌ తీసుకుని, దీనికి రూ.20–25 లక్షలతో సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ తీసుకోవాలి.

వైద్య ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో సమ్‌ అష్యూరెన్స్‌ (కవరేజీ) చాలుతుందా? లేదా? అన్నది మధ్య మధ్యలో సమీక్షించుకుంటూ ఉండాలి. తీసుకునే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ సమగ్రంగా ఉండాలి. మెడికల్, నాన్‌ మెడికల్‌ ఖర్చులతోపాటు, ఇంట్లో ఉండి తీసుకునే చికిత్సలకు చెల్లింపులు చేసేలా ఉంటే మంచిది. అలాగే, బీమా సంస్థ హాస్పిటల్స్‌ నెట్‌వర్క్‌ పెద్దగా ఉండాలి. అప్పుడు నగదు రహిత చికిత్సలు పొందడానికి వీలుంటుంది. ప్రమాద మరణం, ప్రమాదంలో వైకల్యానికి కవరేజీనిచ్చే రైడర్‌ను జోడించుకోవాలి. కుటుంబంలో గుండె జబ్బులు, కేన్సర్‌ తదితర వ్యాధుల రిస్క్‌ ఉంటే, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌ను సైతం తీసుకోవాలి.

ఓపీడీ/డేకేర్‌
ఇండెమ్నిటీ ప్లాన్లలో బీమా సంస్థలు హాస్పిటల్‌లో చేరినప్పుడు అయ్యే వ్యయాలకే చెల్లింపులు చేస్తుంటాయి. అలాగే, డేకేర్‌ ట్రీట్‌మెంట్‌లకు కూడా చెల్లింపులు చేస్తాయి. అంటే హాస్పిటల్‌లో చేరకుండా, చికిత్స తీసుకుని అదే రోజు వెళ్లిపోయే వీలున్నవి. ఇవి కాకుండా, వైద్యం కోసం ప్రజలు చేస్తున్న ఖర్చులో సగం ఔట్‌ పేషెంట్‌ రూపంలో (హాస్పిటల్‌లో చేరాల్సిన అవసరం లేకుండా) సేవలపైనే ఉంటున్నట్టు ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సీఈవో మయాంక్‌ భత్వాల్‌ తెలిపారు. డాక్టర్‌ కన్సల్టేషన్‌ చార్జీలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాలకు చేస్తున్న వ్యయాలకు బీమా ప్లాన్లలో కవరేజీ ఉండడం లేదు. అందుకుని ఓపీడీ కవరేజీనిచ్చే బీమా ప్లాన్‌ తీసుకోవాలని భత్వాల్‌ సూచించారు.

‘‘మీ బీమా ప్లాన్‌ ఔట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఓపీడీ) వ్యయాలకు కవరేజీ ఇవ్వకపోతే, అప్పుడు హాస్పిటల్స్‌కు వెళ్లొద్దు. క్లినిక్‌లకు వెళ్లండి. ఎందుకంటే హాస్పిటల్స్‌ అయితే చార్జీలపై 18 శాతం జీఎస్‌టీ కూడా విధిస్తాయి’’అని మిశ్రా వివరించారు. బీమా ప్లాన్‌లో రీస్టోరేషన్‌ సదుపాయం కూడా ఉండాలి. ఒక పాలసీ సంవత్సరంలో కవరేజీ మొత్తం ఖర్చయిపోతే, తిరిగి మరోసారి హాస్పిటల్‌లో చేరాల్సి వస్తే అప్పుడు ఈ రీస్టోరేషన్‌ (నూరు శాతం కవరేజీని పునరుద్ధరించేవి) సాయపడుతుంది. హాస్పిటల్‌లో చేరినప్పుడు డైలీ క్యాష్‌ బెనిఫిట్‌ను కొన్ని పాలసీలు ఇస్తున్నాయి. ఆస్పత్రిలో ఉన్నప్పుడు కవరేజీ పరిధిలోకి రాని వాటి కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేసుకోవచ్చు. ఇప్పటికే ప్లాన్‌ తీసుకుని, అందులో ఈ ఫీచర్లు లేకపోతే పోర్టింగ్‌ ద్వారా అన్ని ఫీచర్లు ఉన్న ప్లాన్‌కు మారిపోవడం మంచి మార్గం.

క్యాష్‌లెస్‌ ఆస్పత్రులు
బీమా కంపెనీ నెట్‌వర్క్‌ పరిధిలోని ఆస్పత్రికి వెళ్లడం ద్వారా తమపై పడే వ్యయాలను పాలసీదారులు తగ్గించుకోవచ్చు. బీమా సంస్థలకు దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఆస్పత్రులతో భాగ స్వామ్యం ఉంటుంది. వాటిలో చేరితే పాలసీదారులకు తక్కువ చార్జీలు అమలవుతాయి. దీనివల్ల అటు బీమా సంస్థకు, పాలసీదారుకు ప్రయోజనం ఉంటుంది. నగదు రహిత వైద్య సేవలతోపాటు, పాలసీదారు తన వంతుగా చెల్లింపులు చేయాల్సి వస్తే వాటిపైనా తక్కువ చార్జీలు పడతాయి. కన్జ్యూమబుల్స్‌ చార్జీలు విధించవు. లేదా చాలా పరిమితంగా వేస్తాయి. నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌కే పాలసీదారులు వెళ్లేలా చూడడం కోసం.. కొన్ని బీమాకంపెనీలు నాన్‌ నెట్‌వర్క్‌ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటే కో–పేమెంట్‌ (బిల్లులో కొంత మొత్తం పాలసీదారు చెల్లించేలా) షరతు విధిస్తున్నాయి.

హాస్పిటల్‌ రూమ్‌
పాలసీదారుడు హాస్పిటల్‌లో చేరినప్పుడు వైద్యేతర ఖర్చులకు (నాన్‌ మెడికల్‌) బీమా కంపెనీలు చెల్లింపులు చేయవు. రోగి రూమ్‌లో ఉన్నప్పుడు ఇచ్చే టిష్యూ, హ్యాండ్‌ వాష్, టూత్‌పేస్ట్‌ తదితర ఉత్పత్తులతోపాటు, హౌస్‌ కీపింగ్‌ చార్జీలు పాలసీలో కవర్‌ కావు. అలాగే, హాస్పిటల్‌లో చేరేందుకు రిజిస్ట్రేషన్‌ చార్జీలు, పోషకాహార నిపుణుడి చార్జీలు, కాటన్, బ్యాండేజ్‌లు, డిస్పోజబుల్‌కు బీమా సంస్థల చెల్లింపులు చేయవు. అయితే, వీటికి సైతం చెల్లింపులు చేసే ఆప్షన్‌ను బీమా సంస్థలు కొన్ని అందిస్తున్నాయి. ఇందుకోసం కొంత అదనపు ప్రీమియం వసూలు చేస్తా యి.

హాస్పిటల్‌లో అన్ని చార్జీలు రూమ్‌ విభాగం ఆధారంగానే ఉంటాయని నివాబూపాకు చెందిన బబతోష్‌ మిశ్రా తెలిపారు. డాక్టర్‌ ఫీజులు, ఐసీయూ అడ్మిషన్‌ చార్జీలు, ఆహారం, ఇతర సేవలకు చార్జీలను రూమ్‌ కేటగిరీ ఆధారంగానే విధిస్తారు. సింగిల్‌ రూమ్‌కు బదులు ట్విన్‌ షేరింగ్‌ ఎంపిక చేసుకుంటే, అప్పుడు పాలసీదారు తాను సొంతంగా చెల్లించాల్సిన చార్జీలు చాలా వరకు తగ్గుతాయి. ఒకవేళ పాలసీలో సింగిల్‌ ఏసీ ప్రైవేటు రూమ్‌ అనే నిబంధన ఉంటే, దీనికంటే ఎగువ కేటగిరీ అయిన డీలక్స్‌ రూమ్‌లో చేరి చికిత్స పొందినప్పుడు, చార్జీలు కూడా అధికంగా పడతాయి. అప్పుడు పాలసీదారు జేబు నుంచి చెల్లించే మొత్తం పెరిగిపోతుంది.

కో–పే, డిడక్టబుల్‌
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను కో–పేమెంట్‌ లేదా డిడక్టబుల్‌ ఆప్షన్లతో తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. కానీ, చికిత్సలు అవసరమైనప్పుడు పాలసీదారు తన వంతు వాటాగా చెల్లించే మొత్తం ఎక్కువగా ఉంటుంది. కో–పే లేదా డిడక్టబుల్‌ అన్నవి నిర్ణీత మొత్తం దాటినప్పుడు అమల్లోకి వచ్చేవి. అందుకని తక్కువ కో–పే/డిడక్టబుల్‌ ఉన్న వాటినే ఎంపిక చేసుకోవాలి. ప్రీమియం భారం లేదనుకుంటే, కో–పే లేని ప్లాన్‌కు వెళ్లాలి.

రైడర్లు
ఎప్పుడో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుని, అందులో అన్ని రకాల ఫీచర్లు లేకపోతే.. అలాంటి అన్ని సదుపాయాలను ఆఫర్‌ చేస్తున్న బీమా కంపెనీకి పోర్ట్‌ ద్వారా మారిపోవాలి. పోర్టింగ్‌తో వేరే కంపెనీకి మారే ఉద్దేశ్యం లేకపోతే అప్పుడు అదనపు కవరేజీలను ఆఫర్‌ చేసే రైడర్లు తీసుకోవడం ద్వారా, చికిత్సలు అవసరమైనప్పుడు తమపై పడే భారాన్ని తగ్గించుకోవచ్చు. అన్ని యాడాన్‌లు అందరికీ ఉద్దేశించినవి కావు. అవసరమైన రైడర్లను జోడించుకోవచ్చు. ప్రస్తుత ప్లాన్‌లో రూమ్‌ రెంట్‌కు పరిమితులు ఉంటే, అప్పుడు రూమ్‌రెంట్‌ వేవర్‌ రైడర్‌ తీసుకోవాలి. డైలీ క్యాష్, కన్జ్యూమబుల్స్‌ కవరేజీలను కూడా ఎంపిక చేసుకోవాలి.

డిస్కౌంట్స్‌
హాస్పిటల్స్‌ డిజిటల్‌ సేవలపై తగ్గింపులను ఆఫర్‌ చేస్తున్నాయి. కొన్ని ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌పై 10 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నాయి. డిస్కౌంట్‌తో కూడిన హెల్త్‌కార్డ్‌లను ఆఫర్‌ చేసేవీ ఉన్నాయి. ఫార్మసీ బిల్లులపైనా తగ్గింపు ఇస్తున్నాయి. ఇలాంటివి తెలుసుకుని వాటిని పొందడం ద్వారా ఖర్చుల భారం తగ్గించుకోవచ్చు.

చదవండి: రిటైర్మెంట్‌ తర్వాత స్థిరమైన ఆదాయానికి..

మరిన్ని వార్తలు