వాహన బీమా వ్యయం తగ్గించుకుందామా...

12 Mar, 2021 16:46 IST|Sakshi

అన్‌లాక్‌ తుది దశకు చేరినప్పటికీ... కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ మళ్లీ బలంగా పుంజుకుంటోంది. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ  ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపధ్యంలో దాదాపుగా 40శాతం తమ ఉద్యోగులను ఇకపై ఇంటి నుంచే పనిచేసేందుకు వీలుగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కి అవకాశం ఇవ్వాలని అత్యధిక సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయని వర్క్‌ప్లేస్‌ ఆఫ్‌ ద ఫ్యూచర్‌ అనే అంశపై బిసిజి వెలువరించిన నివేదిక వెల్లడించింది. ఉద్యోగులు సైతం ఈ  విధానానికే మొగ్గు చూపుతున్నారని, అత్యవసరమైతే తప్ప  ఇంటికే పరిమితం కావాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వాహన బీమా ఖర్చు వీరికి అనవసర అదనపు వ్యయంగా పరిణమించింది. దీనిపై పాలసీ బజార్‌ డాట్‌ కామ్‌ హెడ్‌ సజ్జా ప్రవీణ్‌ చౌదరి ఏమంటున్నారంటే...

వర్క్‌ ఫ్రమ్‌హోమ్‌...నో కార్‌ ఆన్‌ రోడ్‌...
వచ్చే 7 నుంచి 8 నెలల పాటు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని చాలా సంస్థలు కొనసాగిస్తున్నాయి. దీంతో ఆయా సంస్థల్లో చేసే ఉద్యోగులు... తమ వాహన బీమా విషయంలో కొంత గందరగోళానికి లోనవుతున్నారు. ఎక్కువ మంది కార్పొరేట్‌ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారంటే  రోడ్లపై ఎక్కువగా కార్లు ఉండవని అర్ధం.మరి మన వాహనాన్ని మనం ఎక్కువగా వినియోగించనప్పుడు... కారు భధ్రత కోసం అధిక ఖర్చుతో కూడిన బీమా పాలసీలు అనవసరమని,  రోజూ మనం కారును విరివిగా ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే ప్రమాదాలు, వాటి కారణంగా వచ్చే డ్యామేజీలు వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాని పక్షంలో...బీమా పాలసీలకు పెట్టిన ఖర్చు వృధాయేనని అనుకోవడంలో తప్పులేదు. అలాగని పూర్తిగా బీమాకు దూరమవడం కూడా సరికాదు. వాహనం వినియోగం సగానికిపైగా తగ్గిపోయిన పరిస్థితుల్లో... తక్కువ ఖర్చుతో తగినంత బీమా భధ్రత కల్పించే పాలసీల కోసం చూడాలి..

థర్డ్‌ పార్టీ తప్పనిసరి...
వ్యక్తిగత వాహన భధ్రత కోసం బీమా తీసుకోవడం అనేది వ్యక్తుల ఇష్టాన్ని బట్టి ఆధారపడినా,ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ప్రతి వాహనానికీ థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ కవరేజ్‌(టిపి కవరేజ్‌) మాత్రం తప్పనిసరి. ఆఫీసులకు రాకపోకలు  లేని పరిస్థితుల్లో యాక్సిడెంటల్‌ డ్యామేజెస్‌ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే టిపి కవర్‌ మాత్రం తప్పదు. అలాగే మన వాహనం మన ఇంటి దగ్గర నిలిపి ఉంచినప్పుడు కూడా కొన్ని రకాల డ్యామేజీలు అయ్యే అవకాశం ఉంది. అలాంటి డ్యామేజీలకు పరిహారం వచ్చేలా కూడా జాగ్రత్త పడాలి. అంతేకాకుండా వాహనాలు ఎక్కడైనా పార్క్‌ చేసి ఉన్నప్పుడు సాధారణంగా జరిగేది వాహనాల చోరీ..  దేశంలో రోజుకి దాదాపుగా 100 వాహనాలు చోరీకి గురవుతున్నట్టు అంచనా. ఈ నేపధ్యంలో వాహనాల చోరీ నుంచి రక్షణ కల్పించే బీమా పాలసీ కూడా అవసరమే.  అదే విధంగా ఆగి ఉన్న వాహనాలు దగ్థం అంటూ ఈ  మధ్య కొన్ని సంఘటనలు తరచు చూస్తున్నాం.  కారణాలేవైనా గానీ అగ్ని ప్రమాదం వల్ల కలిగే నష్టాలు కూడా పరిపాటిగా మారాయి. మన కారుకు నష్టం కలిగించిన, దొంగిలించిన వ్యక్తిని కనిపెట్టడం సులభం కాదు కాబట్టి ముందుగానే అందుకు తగిన భధ్రత కల్పించడం ముఖ్యం.

త్రీ ఇన్‌ వన్‌...గో
టిపి, ఫైర్, థెఫ్ట్‌ కలిపి ఉన్న బీమా పాలసీలు తీసుకోవడం మంచిది. ఈ తరహా ఉత్పత్తులు చాలా తక్కువ వ్యయంతోనే అందుబాటులోకి వచ్చాయి. సాధారణ మోటార్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలతో పోలిస్తే ఇవి 50శాతం పైగా తక్కువ వ్యయం అవుతాయి. జీతం మీద ఆధారపడిన ఉద్యోగులకు ఖర్చులు తగ్గించుకోవడంలో ఇవి సహకరిస్తాయి. అలాగే అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఇంటిపట్టన ఉంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటాయి. కేవలం థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ మాత్రమే తీసుకోవడం కన్నా ఈ మూడూ కలిపి అందిస్తున్న పాలసీలను ఎంచుకోవడం మంచిది. 
–సజ్జా ప్రవీణ్‌ చౌదరి, పాలసీ బజార్‌ డాట్‌ కామ్‌ 

 
 

మరిన్ని వార్తలు