ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేరు రిజిస్టర్ చేసుకోవడం ఎలా?

27 Aug, 2021 15:54 IST|Sakshi

అసంఘటిత కార్మికులకు రూ.2 లక్షల ప్రమాదవ బీమా

నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు వంటి అసంఘటిత కార్మికుల సమగ్ర డేటాబేస్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 26న ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ వల్ల అసంఘటిత రంగంలోని 38 కోట్ల మంది కార్మికుల పేర్లను నమోదు చేయడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందవచ్చు అని కేంద్రం తెలిపింది. ఈ కార్మికుల కోసం రాష్ట్రాలు, కార్మిక సంఘాల సమన్వయంతో సామాజిక సంక్షేమ పథకాలను ఈ పోర్టల్ ద్వారా ఏకీకృతం చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

దీనిలో పేర్లను నమోదు చేసుకున్న కార్మికులకు ఒక ప్రత్యేకమైన 12 అంకెల సంఖ్య గల కొత్త ఈ-శ్రమ్ కార్డు జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్ కూడా ఇంట్లో నుంచే ఉచితంగా చేసుకోవచ్చు. కొత్త ఈ-శ్రమ్ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. అసంఘటిత రంగంలోని కార్మికులు తమ ఆధార్ నెంబరు, బ్యాంకు ఖాతా వంటి వివరాలు సాయంతో కొత్త పోర్టల్‌లో తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే జాతీయ టోల్-ఫ్రీ నంబర్ "14434"ను కూడా సంప్రదించవచ్చు.

ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవడం ఎలా

  • ఈ-శ్రమ్ పోర్టల్‌ ఓపెన్ చేసి హోమ్ పేజీలో ఉన్న"రిజిస్టర్ ఆన్ ఈ-శ్రమ్" లింక్/సెక్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీకు కనిపిస్తున్న సెల్ఫ్ రిజిస్ట్రేషన్ దగ్గర ఆధార్ తో లింకు చేసిన మొబైల్ నెంబరును నమోదు చేయాలి.
     
  • కాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ), ఉద్యోగుల స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ)లో సభ్యుడు అయితే అవును అని, లేకపోతే కాదు అని ఎంచుకొని సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీ నమోదు చేసి SUBMIT మీద నొక్కండి. 
  • ఆ తర్వాత మీరు మీ ఆధార్ నెంబర్ చేసి మళ్లీ SUBMIT మీద నొక్కండి. ఆధార్ నెంబర్ మీదేనా కదా అనే తెలుసుకోవడానికి మీకు ఓటీపీ వస్తుంది దాన్ని నమోదు చేసి SUBMIT మీద క్లిక్ చేయండి.
     
  • ఇప్పుడు మీ ఆధార్ లో ఉన్న పూర్తి వివరాలు కనిపిస్తాయి. మిగతా వివరాల నమోదు చేయడానికి కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీరు మీ వ్యక్తి గత వివరాలు, చిరునామా, విద్య అర్హత, వృత్తి, బ్యాంకు వివరాలు వంటివి నమోదు చేయవచ్చు.
  • పైన పేర్కొన్న వివరాలు నమోదు చేశాక మీరు ఈ-శ్రమ్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు లేనప్పటికీ కార్మికులు ఉచిత రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న సీఎస్ సీ కేంద్రాలను సందర్శించి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ అసంఘటిత కార్మికులందరికీ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన(పీఎంఎస్ బివై) కింద ఏడాది కాలానికి ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్యం చెందితే రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యం చెందితే రూ.1 లక్ష రూపాయలు కేంద్రం జమ చేస్తుంది.

మరిన్ని వార్తలు