అద్దెల ద్వారా ఆదాయం వస్తోందా? ఈ విషయాలు తెలుసుకోకపోతే...!

14 Nov, 2022 08:57 IST|Sakshi

అదనంగా వచ్చే ఆదాయంలో .. అద్దె ఏది?

గతంలో ఎన్నోసార్లు తెలియజేశాం. అడిగాం. ‘మీ ఆదాయాన్ని ఎలాగూ చూపిస్తున్నారు ఆదాయం కింద .. దానితో పాటు అదనంగా వచ్చే ఆదాయాన్ని కూడా చూపిస్తున్నారా?‘  ఈ మధ్య డిపార్ట్‌మెంట్‌ వారు సేకరించిన సమాచారం ప్రకారం పైన అడిగిన ప్రశ్నకు ‘నో‘ అని సమాధానం వచ్చింది. వారి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది తమకు అదనంగా వచ్చే ఆదాయాన్ని తమ తమ రిటర్నులలో ‘డిక్లేర్‌‘ చేయడం లేదని తెలిసింది. తేలింది. అలాంటి వారెవరో తెలుసుకోవాలనుందా?  

ఇంటి మీద అద్దె ఎంతెంతయ్యా? 
‘నేను ఎప్పుడూ అద్దెను బ్యాంకులో డిపాజిట్‌ చేయను. నాకు అక్షరాలా నగదు చేతిలో పడాల్సిందే. రశీదు ఇవ్వను. ఎప్పుడూ వ్యాపారస్తులు .. అటువంటి వారికే ఇస్తాను. ఉద్యోగస్తులకు ఇవ్వను‘ అని సగర్వంగా చెప్తాడు మూడు అంతస్తులున్న ముత్యాల రావు. ‘ఇల్లు, ఫ్లాట్లు నా పేరు మీదే ఉన్నాయి. కాని అద్దె ప్రతి నెలా మా ఆవిడ బ్యాంకు అకౌంటులో జమ చేస్తారు. పాన్‌ నంబరు మా ఆవిడదే. రశీదు ఇస్తాను. కానీ ఆదాయం మొత్తం రూ. 5 లక్షలు దాటదు‘ అని తానెంతో తెలివిగా ప్లానింగ్‌ చేసుకుంటున్నానని సంబరపడతాడు నాలుగు ఫ్లాట్లున్న నాగభూషణ రావు గారు. ‘మనం ఎప్పుడూ 50:50నే. సగం బ్యాంకులో జమ.. మిగతా సగం నగదు. నగదు ఇస్తే కానీ రశీదు ఇవ్వను. ఇంటికి రిపేర్లు, పన్నులు, సున్నాలు అన్నింటికీ మనమే చెల్లించాలి కదా. అదెలా రాబట్టాలి?‘ ఇలా ఎదురు ప్రశ్న వేసి బేతాళుడి ప్రశ్నలాగా ఫీల్‌ అవుతాడు పిచ్చేశ్వర్రావు గారు. ‘వాళ్లిచ్చే 30% రిపేరుకు ఏం సరిపోతుంది. కరోనా తర్వాత రూ. 3 లక్షలు ఖర్చు పెట్టా. అందుకని సగం అద్దె చూపిస్తా‘ .. ఇదీ చాణక్య రావుగారి స్టేట్‌మెంటు. పేయింగ్‌ గెస్ట్‌ హౌస్‌ ఓనరు పేరాశ రావుగారిది కూడా ఇదే వరస! ఆయన సరసనే చేరారు ఎందరో ఓనర్లు. ‘ఐకమత్యమే మహాబలం‘ అని జ్ఞాపకం చేసుకుంటూ. 


‘మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు. విల్లా వాడిదే. అక్కడ పన్ను ఎక్కువ. అందుకని రెంటు నా అకౌంటులో వేసుకుంటాను. వాడికి పాన్‌ లేదు. నేను ఇది ఆదాయంగా చూపించను‘ మితిమీరిన తెలివితేటలున్న మృత్యుంజయ రావు మనసులోని మాట ఇది. ‘నాకు రెండు అగ్రిమెంట్లు. ఒకటి అద్దెది .. సగం. మిగతా సగానికి ఫర్నిచర్, ఏసీ, వాషింగ్‌ మెషిన్, మంచాల నిమిత్తం అద్దె. ఈ అద్దె చూపించను‘ మందహాసంతో మధుసూదన రావుగారి ముక్తాయింపు. 

ఇలా అద్దె కింద వచ్చే ఆదాయాన్ని చూపించకుండా ఉండటానికి ఎన్నో అడ్డదార్లు .. ఎగవేతకు ఆలోచనలు. ఇవన్నీ తప్పుడు ఆలోచనలే.. చట్టం ఒప్పుకోదు. పన్ను కట్టడానికి పంగనామాలు .. చట్టానికి తూట్లు .. ఎగవేతకు అగచాట్లు.. దొరికిన తర్వాత తప్పని పాట్లు. ఇకనైనా కట్టిపెట్టాలి ఈ ముచ్చట్లు. 

నగదు అయినా, బ్యాంకు ద్వారా అయినా మీరు ఓనర్‌ అయితే మీకు చేతికొచ్చే అద్దె ఏమాత్రం తగ్గించకుండా చూపించండి. ఫ్లాట్ల విషయంలో నెలసరిగా మెయింటెనెన్సును అద్దెకు కలపకుండా, డైరెక్టుగా వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌కి ఇప్పించండి. కొంత ఉపశమనం ఉంటుంది.

మరిన్ని వార్తలు