ఇంటర్నెట్ లేకుండా 'ఆఫ్‌లైన్ ట్రాన్సక్షన్‌'.. ఇప్పుడు చాలా సింపుల్!

20 Mar, 2023 07:39 IST|Sakshi

ప్రస్తుతం ఫోనేపే.. గూగుల్ పే వంటివి అందుబాటులోకి వచ్చిన తరువాత చేతిలో డబ్బులు పెట్టుకునే వారి సంఖ్య దాదాపు తగ్గిపోయింది. డబ్బు పంపించాలన్నా.. తీసుకోవాలన్నా మొత్తం ఆన్‌లైన్‌లో జరిగిపోతున్నాయి. అయితే ఈ ఆన్‌లైన్‌ ట్రాన్షాక్షన్స్ జరగటానికి తప్పకుండా ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి, ఇందులో కొన్ని సార్లు నెట్‌వర్క్ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆన్‌లైన్‌ కష్టాలు, నెట్‌వర్క్ సమస్యలకు స్వస్తి చెప్పడానికి ఆఫ్‌లైన్ విధానం కూడా అమలులో ఉంది. ఇది ప్రస్తుతం చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఈ విధానం ద్వారా సులభంగా ట్రాన్షాక్షన్స్ పూర్తి చేసుకోవచ్చు.

భారతదేశంలోని దాదాపు అన్ని బ్యాంకులు UPI సేవలను ప్రాసెస్ చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) '*99# సర్వీస్' ప్రారంభించింది. ఇందులో వినియోగదారుడు చేయవలసిందల్లా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా *99# డయల్ చేయడం.

వినియోగదారుడు తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా *99# డయల్ చేసిన తరువాత మొబైల్ స్క్రీన్‌పై ఇంటరాక్టివ్ మెనూ కనిపిస్తుంది. దీని ద్వారా సులభంగా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. ఇందులో బ్యాలెన్స్ విచారణ వంటి సర్వీసులతోపాటు యుపిఐ పిన్‌ సెట్ చేయడం / మార్చడం కూడా చేసుకోవచ్చు.

*99# USSD కోడ్‌ ద్వారా యుపిఐ లావాదేవీ ప్రారంభించడం ఎలా?

మొదట మీ బ్యాంకు అకౌంట్‌కి లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి *99# డయల్ చేయండి. తరువాత మీకు కింద కనిపిస్తున్న మెనూ పాప్ వస్తుంది. 

 1. సెండ్ మనీ
 2. రిక్వెస్ట్ మనీ
 3. చెక్ బ్యాలన్స్
 4. మై ప్రొఫైల్
 5. పెండింగ్ రిక్వెస్ట్
 6. ట్రాన్సాక్షన్
 7. యుపిఐ పిన్

 • ఇందులో మీరు డబ్బు పంపించడానికి సెండ్ మనీ సెలక్ట్ చేసుకుని సెండ్ చేయాలి.
 • తరువాత మీరు ఏ అకౌంట్ నుంచి డబ్బు పంపాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకుని మళ్ళీ సెండ్ చేయాలి. 
 • మొబైల్ నంబర్ ద్వారా ట్రాన్సాక్షన్ ఎంచుకుంటే రిసీవర్ యుపిఐ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను టైప్ చేసి సెండ్ చేయండి.
 • మీరు పంపాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేసి, సెండ్ ఆప్సన్ మీద క్లిక్ చేయండి.
 • చెల్లింపు కోసం రిమార్క్‌ని ఎంటర్ చేయండి.
 • మొత్తం ట్రాన్సాక్షన్ పూర్తి చేయడానికి యుపిఐ పిన్‌ని ఎంటర్ చేయండి.
 • ఇవన్నీ మీరు సక్రమంగా పూర్తి చేస్తే మీ ఆఫ్‌లైన్‌ ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది.

అంతే కాకుండా.. మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నుంచి *99# ఉపయోగించి, సరైన సూచనలను అనుసరించడం ద్వారా UPI సేవలను ఆఫ్‌లైన్‌లోనే నిలిపివేయవచ్చు. ఇవన్నీ చేసేటప్పుడు తప్పకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

మరిన్ని వార్తలు