జబ్బులే రాని, మరణమే లేని బిడ్డ కావాలా? సాధ్యమేనా?

5 Dec, 2022 14:32 IST|Sakshi

మనిషి తన సుఖ, సంతోషాల కోసం చేస్తున్న ప్రయోగాలు ఎంత నష్టాన్ని కలిగిస్తున్నాయో పట్టించుకోవడంలేదు. ఒక శతాబ్ద కాలంలోనే భూగోళంలో వేల సంవత్సరాలకు సరిపడా విధ్వంసం సృష్టించాడు. సహజసిద్ధమైన ప్రక్రియకు భిన్నంగా డిజైనర్ బేబీస్‌ను సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని ఈ ప్రయోగాలు ప్రపంచానికి మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిజైనర్ బేబీస్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?


ఇంట్లో వాడుకునే వాషింగ్ మెషిన్ లేదా ఫ్రిజ్ కొనాలంటే షోరూమ్‌కి వెళ్ళి రకరకాల కంపెనీలకు చెందినవాటిని పరిశీలించి దేనిలో ఉత్తమమైన ఫీచర్స్‌ ఉన్నాయో వాటిని ఎంపిక చేసుకుని ఇంటికి తెచ్చుకుంటాం. రెండు మూడు దశాబ్దాలు తర్వాత చంటిబిడ్డల్ని తయారు చేసే కంపెనీలు పుట్టుకొస్తాయని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బిడ్డలు కావాలనుకున్న దంపతులు ఆ కంపెనీకి వెళ్ళి వారు తయారు చేస్తున్న బిడ్డలకు సంబంధించిన బ్రోచర్స్‌ చూసి తమకు కావాల్సిన లక్షణాలున్న బిడ్డల్ని లేదంటే రకరకాల కాంబినేషన్లతో కూడిన  బిడ్డల్ని తయారు చేయాలని కంపెనీని కోరే పరిస్థితులు వస్తాయంటున్నారు. నవ మాసాలు మోసి బిడ్డల్ని కనాల్సిన అవసరం లేదు. ఇప్పటిలాగా సరోగసి వివాదాలు కూడా ఉండవు. మనకు కావాల్సిన బేబీని నచ్చినట్లు డిజైన్ చేసుకుని తయారు చేయించుకోవచ్చు. అయితే ఇటువంటి అభివృద్ధి సమాజానికి మంచిదేనా? అసలు ఇటువంటి ప్రయోగాలు నిజంగా సాధ్యమవుతాయా? మానవ శరీర నిర్మాణం అత్యంత సంక్లిష్టమైనది. లేబొరేటరీలో వైరస్‌లను సృష్టించినంత తేలికగా...మనిషి జన్యువులను మనకు కావాల్సిన విధంగా ఎడిటింగ్ చేసుకోవడం కుదిరే పనేనా? అంటూ అనేక ప్రశ్నలు మేధావులు, సామాజిక వేత్తలు, సైంటిస్టుల నుంచి వినిపిస్తున్నాయి. అసలిటువంటి ప్రయోగాలు నైతికమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మొక్కలకు సంబంధించి జన్యుపరమైన మార్పులతో  మనం ఆశించిన ఫలితాలు పొందగలుగుతున్నాం. అయితే మనుషుల విషయానికి వచ్చేసరికి ఇష్టం వచ్చినట్లుగా జన్యువుల్లో మార్పులు చేయడం అంత తేలికైన విషయం కాదంటున్నారు అనేక మంది సైంటిస్టులు. ఒక వ్యక్తికి తల్లి దండ్రులనుంచి..తరతరాలుగా వస్తున్న మానసిక, ఆరోగ్య లక్షణాలు, అందమూ, తెలివితేటలు, రంగు, పొడుగు విషయాల్లో మార్పులు చేయడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనిషికి సంబంధించిన ప్రతి లక్షణానికీ కొన్ని వందలు లేదా వేల జన్యువులు కారణమవుతాయి. మనిషి ఎత్తుని ప్రభావితం చేసే జన్యు వైవిధ్యాలు 93 వేల వరకు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇప్పటివరకూ జరిగిన పరిశోధనల్లో 93 వేలలో 697 జన్యువులను మాత్రమే గుర్తించగలిగారు. జన్యు పరివర్తన ఎంత సంక్లిష్టమైన వ్యవహారమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి డిజైనర్‌ బేబీస్‌ అన్న మాట ప్రస్తుతానికి సైన్స్‌ ఫిక్షన్‌కే పరిమితం అని తేల్చేస్తున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకూ మనం జీన్ ఎడిటింగ్‌ ద్వారా జన్యువుని సవరించగలుగుతున్నామే కానీ..దాన్ని మెరుగుపరచడం గురించి మనకేమీ తెలియదంటున్నారు శాస్త్రవేత్తలు.  

ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ తయారు చేయడానికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎంతో కసరత్తు చేస్తారు. డజన్ల మంది ఎన్నో వందల గంటలు శ్రమిస్తారు. ఎన్నో అధ్యయనాలు, వాటికి ఫుట్‌ నోట్స్‌లు తయారు చేసుకుంటారు. ఇవన్నీ చేస్తేనే గాని ఒక ప్రోగ్రాం తయారు కాదు. అదేవిధంగా ఒక జన్యువును ఎడిట్‌ చేయాలంటే ఇంతకంటే ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ అవసరం అవుతుంది. ఇక జన్యువును ఉన్నదానికంటే మెరుగుపర్చడం అంటే ఇప్పట్లో సాధ్యమయ్యేదే కాదంటున్నారు. మనిషిలోని లక్షణాలు మార్చి మనకిష్టం వచ్చినట్లుగా బేబీస్‌ను తయారు చేసుకోవడం అనేది అత్యాశే అవుతుందని కొందరు శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. చైనా శాస్త్రవేత్త కేవలం ఒక జన్యువును తొలగించే ప్రక్రియ మాత్రమే చేయగలిగారు. తద్వారా పుట్టిన బిడ్డలకు ఎయిడ్స్ రాకుండా నివారించగలిగారు. అలా కాకుండా మనం కోరుకున్న లక్షణాలు గల బిడ్డలు పుట్టాలంటే జన్యువులను మెరుగుపరచాలి. ఆయా లక్షణాలకు సంబంధించిన మార్పులు జన్యువుల్లో చేయగలగాలి. ఇప్పటికీ అనేక జబ్బులను నయం చేయడమే మనిషికి సాధ్యం కావడంలేదు. అవన్నీ వదిలేసి కోరుకున్న లక్షణాలున్న బిడ్డలను తయారు చేసుకోవడం అనేది అసాధ్యమంటున్నారు.     

పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని మేధావులైన వైద్య పరిశోధకులు నిజంగా డిజైనర్ బేబీస్‌ను తయారు చేస్తే అప్పుడు సమాజంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి? ఇటువంటి వైద్య విధానాలు కేవలం ధనికులకు మాత్రమే అందుబాటులోకి వస్తాయి. సమాజంలో 90 శాతంగా ఉన్న ఇతర వర్గాలకు ఇటువంటి టెక్నాలజీలు ఎంతో దూరంలో ఉంటాయి. అంటే డబ్బున్నవారు మాత్రమే తమకు కావాల్సినవిధంగా బిడ్డలను లేబరేటరీల్లో తయారు చేయించుకుంటారు. అందమైన, తెలివైన, దీర్ఘాయువు గలిగిన, వ్యాధులు దరిచేరని హై ప్రొఫైల్ బిడ్డలను తయారు చేయించుకుని పెంచుకుంటారు. సమాజంలోని  మిగిలిన వర్గాల ప్రజలు వీరితో ఏ విషయంలోనూ పోటీ పడలేరు. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. ఇప్పటికే మన సమాజంలో ఆడబిడ్డలంటే పుట్టకముందే చంపేసే దుర్మార్గులు చాలా మంది ఉన్నారు.

అదేవిధంగా తమకు పుడుతున్న బిడ్డల్లో లోపాలు తెలుసుకుని మరో రకమైన భ్రూణహత్యలు సమాజంలో పెరిగిపోతాయి. ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా పొంచి ఉంది. ఒక వైకల్యం నిరోధించడానికి ఒక జన్యువును సవరించగలుగుతాం. కాని దాని వల్ల మరో కొత్త వైకల్యం వస్తే..ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? పైగా మనుషులు.. ప్రోగ్రామింగ్‌ చేసిన రోబోల్లా...ప్రోగ్రామింగ్‌ బిడ్డలు భూమి మీదకు వస్తే వారికి సొంత తెలివితేటలు, ఆలోచించే శక్తి ఎక్కడి నుంచి వస్తాయి? తల్లిదండ్రులు ఎలా కోరుకుంటే వారు అలాగే తయారవుతారు. ఇటువంటి పరిణామాలు, పరిశోధనలు భవిష్యత్ సమాజాన్ని గందరగోళంగాను, అంతరాలు మరింతగా పెంచేదిగాను, అస్తవ్యస్థంగాను, సమాజాన్ని వినాశనం దిశగానూ నడిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని సమాజం మేలు కోరే వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనుషుల్లో కొత్త కొత్త జబ్బులు వచ్చే ప్రమాదమూ ఉంటుందని చెబుతున్నారు.

సైన్స్‌కు సంబంధించిన ఏ ఆవిష్కరణ జరిగినా అది సమాజంలో ప్రజలందరికీ ఉపయోగపడాలి. అంతేగాని కొన్ని వర్గాలకు, సమాజంలోని కులీన వర్గాలకు మాత్రమే ఉపయోగపడే ఆవిష్కరణలు ఏమాత్రం మంచిది కాదని సామాజికవేత్తలు గట్టిగా వాదిస్తున్నారు. బిడ్డలు కలగని దంపతులకు పిల్లలు కలిగేవిధంగా అనేక  ప్రయోగాలు చేశారు. నలభై సంవత్సరాల క్రితం టెస్ట్ ట్యూబ్‌ బేబీ పుట్టినపుడు ప్రపంచం ఆశ్యర్యపోయింది. క్లోనింగ్‌తో గొర్రె పిల్లల్ని పుట్టించినపుడు మరింత సంభ్రమాశ్చర్యాలకు సమాజం గురైంది. ఇంటా.. బయటా గొడ్రాలు అని నిందిస్తుంటే అవమానంతో కుమిలిపోయే మహిళలకు వరంలా నేడు ఐవీఎఫ్ విధానం, సరోగసి విధానం అందుబాటులోకి వచ్చాయి. రోజు రోజుకూ సాంకేతికంగా ఎంతో వృద్ధి చెందుతున్నాం.

సైంటిస్టులు ప్రజలకు సర్వ సౌకర్యాలు, సౌఖ్యాలు అందిస్తున్నారు. అదే సమయంలో డిజైనర్ బేబీస్ గురించి జరుగుతున్న పరిశోధనలు సమాజంలోని ఒక వర్గానికి సంతోషం కలిగించవచ్చు. కాని 90 శాతం మంది ప్రజలకు ఇటువంటి ప్రయోగాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రమాదకర వ్యాధులు రాకుండా, కావాల్సిన విధంగా పిల్లల్ని తయారుచేయించుకుంటే...బోనస్‌గా మరిన్ని కొత్త జబ్బులు, కొత్త సమస్యలు పుట్టుకురావచ్చు. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా కకావికలం చేసిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. 

దాదాపు వందేళ్ళ క్రితం ఇద్దరు బయాలజిస్టులు మానవ పునరుత్పత్తి ప్రక్రియలో అద్భుతమైన సాంకేతిక పురోగోతి వస్తుందని ప్రకటించారు. వీటి గురించే ఆల్డస్ హక్స్‌లీ అనే రచయిత బ్రేవ్ న్యూ వరల్డ్‌ అనే పుస్తకం రాసాడు. ఫ్యాక్టరీలో వస్తువులను తయారు చేసుకుంటున్నట్లుగా...2540 నాటికి మనకు కావాల్సిన బిడ్డలను ప్రయోగశాలల్లో తయారు చేసుకుంటామని అందులో రాసాడు. అప్పటి కాలంలో మహిళలు పిల్లల్ని స్వయంగా కనే పరిస్థితులు ఉండవని, కేవలం లేబరేటరీల్లోనే తయారవుతారని తెలిపాడు. డిజైనర్ బేబీస్‌ గురించి జరుగుతున్న పరిశోధనలు కూడా చివరికి మానవ సమాజాన్ని ఆ దిశగా తీసుకువెళ్తాయనే చర్చ సాగుతోంది. సమాజంలో సంభవించే కొన్ని పరిణామాలు, కొన్ని శాస్త్ర ప్రయోగాలు ఎవరు అడ్డుకున్నా ఆగవు. అలా కొందరు ఆపగానే ఆగిపోతే మానవ సమాజం ఇంత పురోగతి సాధించేది కాదు. అలాగే హక్స్‌లీ తన పుస్తకంలో రాసినట్లుగా కొన్నేళ్ళలో మన తర్వాతి తరం వారు.. పిల్లల్ని తమకు కావాల్సిన విధంగా ప్రయోగశాలల్లో తయారు చేయించుకుని కొనుక్కునే రోజులు వస్తాయేమో. (అయిపోయింది)

ఈ. వీ. బాలాజీ, కన్సల్టింగ్‌ ఎడిటర్‌, సాక్షి టీవీ

మరిన్ని వార్తలు