హెటెక్‌ మొక్కల కుండీ..చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు..

9 Oct, 2022 09:01 IST|Sakshi

ఈ ఫొటోలో కనిపిస్తున్నది హైటెక్‌ మొక్కల కుండీ. ఇది పూర్తిగా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. ఇందులో ఏకకాలంలో ఇరవై ఒక్క రకాల మొక్కలను పెంచుకునే వీలుంది. ఇందులోని నాటిన మొక్కలకు ఈ కుండీ తానే స్వయంగా కావలసిన నీరు, పోషకాలు అందిస్తుంది. సూర్యకాంతి అవసరమైన సమయంలో దీనిపైన ఉన్న రూఫ్‌లో అమర్చిన ఎల్‌ఈడీ లైట్లు వెలుగుతాయి.  

ఇందులో పెరిగే మొక్కలకు ఎలాంటి మట్టి అవసరం లేదు. మట్టి, బురద బెడద లేకుండానే ఇందులో వేసిన మొక్కలు ఇట్టే పెరిగిపోతాయి. హెటెక్‌ కుండీలను తయారుచేసే బహుళజాతి సంస్థ ‘లెట్‌పాట్‌’ ఈ కుండీని ‘ఎల్‌పీహెచ్‌–మ్యాక్స్‌’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. 

స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే, బ్లూటూత్‌ ద్వారా ఇందులోని మొక్కల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది ‘స్మార్ట్‌ హైడ్రోపోనిక్‌ ప్లాంట్‌ కల్టివేటర్‌’.

మనుషుల ప్రమేయం పెద్దగా అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది. దీని ట్యాంకును నీటితో నింపి, ఫ్రిజ్‌ మాదిరిగా ప్లగ్‌ పెట్టి, ఆన్‌ చేసుకుంటే చాలు. మరేమీ చూసుకోనక్కర్లేదు. ఇందులో పూల మొక్కలు, ఆకుకూరలు, కూరగాయల మొక్కలను భేషుగ్గా పెంచుకోవచ్చు. దీని ధర 329 డాలర్లు (సుమారు రూ.27 వేలు) మాత్రమే! 

మరిన్ని వార్తలు