మేడిన్‌ ఇండియా ల్యాప్‌టాప్‌లు, పీసీలు

23 Dec, 2021 01:27 IST|Sakshi

దేశీయంగా తయారీ ప్రారంభించిన హెచ్‌పీ

న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు సహా వివిధ రకాల పర్సనల్‌ కంప్యూటర్లను భారత్‌లో తయారు చేయడం ప్రారంభించినట్లు టెక్‌ దిగ్గజం హెచ్‌పీ వెల్లడించింది. ప్రభుత్వ విభాగాలు కూడా కొనుగోలు చేసే విధంగా వీటిలో కొన్ని ఉత్పత్తులకు అర్హతలు ఉన్నాయని పేర్కొంది. గవర్నమెంట్‌ ఈ–మార్కెట్‌ప్లేస్‌ (జీఈఎం) పోర్టల్‌ ద్వారా ప్రభుత్వ విభాగాలు ఆర్డరు చేసేందుకు ఇవి అందుబాటులో ఉంటాయని హెచ్‌పీ ఇండియా మార్కెట్‌ ఎండీ కేతన్‌ పటేల్‌ తెలిపారు. ‘భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పట్నుంచి చురుగ్గా పనిచేస్తున్నాం.

కోట్ల కొద్దీ ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. మేకిన్‌ ఇండియా ప్రోగ్రాంకి అనుగుణంగా మేము దేశీయంగా తయారీని చేపట్టాము. మా తయారీ కార్యకలాపాలను మరింతగా విస్తరించడం ద్వారా స్వావలంబన భారత కల సాకారం కావడంలో అర్ధవంతమైన పాత్ర పోషించగలమని ఆశిస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో కమర్షియల్‌ డెస్క్‌టాప్‌ల తయారీ కోసం ఫ్లెక్స్‌ సంస్థతో 2020 ఆగస్టులో హెచ్‌పీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికి అనుగుణంగా తమిళనాడు రాజధాని చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబుదూర్‌లోని ఫ్లెక్స్‌ ప్లాంటులో పీసీలు, ల్యాప్‌టాప్‌లు ఉత్పత్తి అవుతున్నాయి.   

తొలిసారిగా విస్తృత శ్రేణి ..
హెచ్‌పీ ఎలీట్‌బుక్స్, హెచ్‌పీ ప్రోబుక్స్, హెచ్‌పీ జీ8 సిరీస్‌ నోట్‌బుక్స్‌ వంటి విస్తృత శ్రేణి ల్యాప్‌టాప్‌లను భారత్‌లో తయారు చేయడం ఇదే తొలిసారని సంస్థ పేర్కొంది. డెస్క్‌టాప్‌ మినీ టవర్స్‌ (ఎంటీ), మినీ డెస్క్‌టాప్స్‌ (డీఎం), స్మాల్‌ ఫార్మ్‌ ఫ్యాక్టర్‌ (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌) డెస్క్‌టాప్స్, ఆల్‌–ఇన్‌–వన్‌ పీసీలు మొదలైన వాటిని కూడా తయారు చేస్తున్నట్లు తెలిపింది. ఇంటెల్, ఏఎండీ ప్రాసెసర్‌ల ఆప్షన్లతో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు హెచ్‌పీ పేర్కొంది. ఫ్లెక్స్‌ ఫ్యాక్టరీ.. చెన్నై పోర్టుకు దగ్గర్లో ఉండటం వల్ల నిర్వహణపరమైన సామర్థ్యాలు మెరుగ్గా ఉంటాయని, ల్యాప్‌టాప్‌లు..ఇతర పీసీ ఉత్పత్తులకు అవసరమైన ముడివస్తువులను సమకూర్చుకోవడం సులభతరంగా ఉంటుందని తెలిపింది. 

మరిన్ని వార్తలు