హెచ్‌పీసీఎల్‌ లాభం 157 శాతం అప్‌

7 Aug, 2020 05:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) నికర లాభం 157 శాతం ఎగిసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 2,253 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది రూ. 877 కోట్లు. రిఫైనరీల సామర్థ్యాన్ని గణనీయంగా వినియోగించుకోవడం, పరిశ్రమతో పోలిస్తే మరింత మెరుగైన పనితీరు కనపర్చడం వల్ల కరోనా వైరస్‌పరమైన సవాళ్లు ఉన్నప్పటికీ సానుకూల ఫలితాలు సాధించగలిగినట్లు హెచ్‌పీసీఎల్‌ సీఎండీ ముకేశ్‌ కుమార్‌ సురానా తెలిపారు. క్యూ1లో అమ్మకాలు రూ. 45,945 కోట్లకు క్షీణించినప్పటికీ నికర లాభాలు పెరగడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాలు రూ. 74,596 కోట్లు. లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌లో పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పడిపోయాయని, అయితే క్రమంగా ఆంక్షల సడలింపుతో మళ్లీ పుంజుకుంటున్నాయని సురానా చెప్పారు.

మరిన్ని వార్తలు