హెచ్‌పీసీఎల్‌ డివిడెండ్‌ రూ. 14

20 May, 2022 00:42 IST|Sakshi

క్యూ4లో నికర లాభం డౌన్‌

రూ. 1,795 కోట్లకు పరిమితం

న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 40 శాతం రూ. 1,795 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం(2020–21) ఇదే కాలంలో రూ. 3,018 కోట్లు ఆర్జించింది. క్యూ4లో స్థూల రిఫైనింగ్‌ మార్జిన్లు(జీఆర్‌ఎం) 12.44 డాలర్లకు బలపడినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ పుష్ప కుమార్‌ జోషి పేర్కొన్నారు.

2021 క్యూ4లో 8.11 డాలర్ల జీఆర్‌ఎం మాత్రమే లభించింది. అయితే చౌకగా కొనుగోలు చేసిన నిల్వల లాభాలను మినహాయిస్తే ఒక్కో బ్యారల్‌ చమురు శుద్ధిపై 6.42 డాలర్ల మార్జిన్లు సాధించినట్లు జోషి వెల్లడించారు. కాగా.. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ అమ్మకపు నష్టాలు మార్జిన్ల లాభాలను దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. చమురు ధరలు 14ఏళ్ల గరిష్టానికి చేరినప్పటికీ మార్చి 22 నుంచి మాత్రమే వీటి ధరలను పెంచడం ప్రభావం చూపినట్లు వివరించారు. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 14 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది.

పూర్తి ఏడాదికి
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 3.72 లక్షల కోట్ల ఆదాయం, రూ. 6,383 కోట్ల నికర లాభం సాధించినట్లు జోషి తెలియజేశారు. 2020–21లో హెచ్‌పీసీఎల్‌ రూ. 2.69 లక్షల కోట్ల టర్నోవర్‌ సాధించగా.. రూ. 10,664 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్యూ4లో దేశీయంగా 10.26 మిలియన్‌ టన్నులను విక్రయించగా.. అంతక్రితం 3.83 ఎంటీ అమ్మకాలు నమోదయ్యాయి. వెరసి 4 శాతం వృద్ధి సాధించింది. ఇక పూర్తి ఏడాదిలో 6 శాతం అధికంగా 37.65 ఎంటీ అమ్మకాలు నమోదయ్యాయి. ఇదే కాలంలో ఎల్‌పీజీ అమ్మకాలు 4.4 శాతం పుంజుకుని 7.7 ఎంటీకి చేరాయి.
ఫలితాల నేపథ్యంలో హెచ్‌పీసీఎల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.5% నీరసించి రూ. 240 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు