EV Charging Stations: ఎలక్ట్రిక్ వెహికల్ ప్రియులకు హెచ్‌పీసీఎల్‌‌ శుభవార్త!

17 Sep, 2021 17:16 IST|Sakshi

ముంబై: ఎలక్ట్రిక్ వెహికల్ ప్రియులకు హెచ్‌పీసీఎల్‌‌ శుభవార్త తెలిపింది. రాబోయే మూడేళ్లలో 5,000 ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్‌‌) యోచిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 84 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. గత కొన్ని నెలలుగా హెచ్‌పీసీఎల్‌‌ తన రిటైల్ అవుట్ లెట్లలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఇఎస్ఎల్), టాటా పవర్, మెజెంటా ఈవీ సిస్టమ్స్ అనే మూడు సంస్థలతో జతకట్టింది.

రూ.65,000 కోట్ల పెట్టుబడులు..
"హెచ్‌పీసీఎల్‌‌ గ్రీన్ పవర్, గ్రీన్ హైడ్రోజన్ అవకాశాలకు సంబంధించి సమీక్షిస్తోంది" అని హెచ్‌పీసీఎల్‌‌ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంకె సురనా కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో తెలిపారు. వివిధ ప్రాజెక్టుల కింద వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.65,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో హెచ్‌పీసీఎల్‌‌ తన స్టార్ట్-అప్ అభివృద్ధి కార్యక్రమం కింద మెజెంటా ఈవీ సిస్టమ్స్ సహకారంతో మొట్టమొదటి ఈవీ(ఎలక్ట్రిక్ వేహికల్) ఛార్జర్ కేంద్రాన్ని ప్రారంభించింది. "ఛార్జ్ గ్రిడ్ ఫ్లేర్" అని పేరుతో పిలిచే ఈ ఈవీ ఛార్జర్ తక్కువ ధరకు ఛార్జింగ్ సౌకర్యాలను కలిపిస్తుంది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ అవుట్ లెట్లలో "ఛార్జ్ గ్రిడ్ ఫ్లేర్" శ్రేణి ఛార్జర్లను ఇన్ స్టాల్ చేయాలని హెచ్‌పీసీఎల్‌‌ యోచిస్తోంది.(చదవండి: అథర్‌ బంపర్‌ ఆఫర్‌.. ఏ స్కూటర్‌కైనా ఛార్జింగ్‌ ఫ్రీ)

ఈ-మొబిలిటీ వాహనాల కొనుగోలుకు వినియోగదారులను ప్రోత్సహించడం కోసం, ఈవీ రంగంలో ద్విచక్ర, కార్ల వాహన యాజమానుల బ్యాటరీ ఛార్జింగ్ సమస్యలను పరిష్కరించడం కోసం హెచ్‌పీసీఎల్‌‌ మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేస్తోంది. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) యాజమాన్యంలోని సబ్సిడరీ అయిన సీఇఎస్ఎల్‌‌తో హెచ్‌పీసీఎల్‌‌ ఒప్పందం చేసుకుంది. రాబోయే 10 సంవత్సరాలలో ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్ కతా, పూణేతో వంటి నగరాల్లో ఎంపిక చేసిన రిటైల్ అవుట్ లెట్లలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. 

మరిన్ని వార్తలు