హెచ్ పీసీఎల్ బైబ్యాక్- ఎస్ఆర్ఎఫ్ జోష్

5 Nov, 2020 11:36 IST|Sakshi

షేరుకి రూ. 250 ధరలో బైబ్యాక్

రూ. 2,500 కోట్లవరకూ వెచ్చింపు

7.5 శాతం జంప్ చేసిన హెచ్ పీసీఎల్

క్యూ2లో ప్రోత్సాహకర ఫలితాలు

7 శాతం ఎగసిన ఎస్ఆర్ఎఫ్ షేరు

సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్ పీసీఎల్) కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో విభిన్న స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

హెచ్ పీసీఎల్
ఒక్కో షేరుకి రూ. 250 ధర మించకుండా 10 కోట్ల షేర్లవరకూ కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు హెచ్ పీసీఎల్ తాజాగా వెల్లడించింది. ఇది కంపెనీ ఈక్విటీలో 6.56 శాతం వాటాకు సమానంకాగా.. బైబ్యాక్ కోసం రూ. 2,500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో కంపెనీ నికర లాభం రూ. 1052 కోట్ల నుంచి రూ. 2,477 కోట్లకు ఎగసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం రూ. 66,165 కోట్ల నుంచి రూ. 61,340 కోట్లకు నీరసించింది. క్యూ2లో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 5.11 డాలర్లకు చేరాయి. ఈ నేపథ్యంలో హెచ్ పీసీఎల్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7.5 శాతం జంప్ చేసి రూ. 201 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 203 వరకూ లాభపడింది. 

ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ఎస్ఆర్ఎఫ్ నికర లాభం 57 శాతం పెరిగి రూ. 316 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 21 శాతం బలపడి రూ. 1,738 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎస్ఆర్ఎఫ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7.2 శాతం జంప్ చేసి రూ. 4,763 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 4,789 వరకూ లాభపడింది. ఈ కౌంటర్లో సగటు ట్రేడింగ్ పరిమాణం 4,980 షేర్లుకాగా.. తొలి రెండు గంటల్లో రెండు రెట్లు అధికంగా 11,100 షేర్లు చేతులు మారాయి.

మరిన్ని వార్తలు