భువనగిరి వద్ద ఏజీఐ కొత్త ప్లాంటు

29 Oct, 2020 05:41 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కంటెయినర్‌ గ్లాస్‌ బాటిళ్ల తయారీ సంస్థ ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌ హైదరాబాద్‌ సమీపంలోని భువనగిరి వద్ద కొత్త ప్లాంటును నెలకొల్పుతోంది. ఇందుకోసం కంపెనీ మాతృ సంస్థ అయిన హెచ్‌ఎస్‌ఐఎల్‌ రూ.220 కోట్లు పెట్టుబడి చేస్తోంది. 15 ఎకరాల్లో స్థాపిస్తున్న ఈ నూతన కేంద్రం 2022 సెప్టెంబర్‌ చివరికి కార్యరూపం దాల్చనుందని హెచ్‌ఎస్‌ఐఎల్‌ వైస్‌ చైర్మన్‌ సందీప్‌ సొమానీ తెలిపారు. రోజుకు 150 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. ఔషధాలు, సుగంధ పరిమళాలు, సౌందర్య సాధనాలు, ఖరీదైన మద్యం ప్యాకింగ్‌ కోసం హై ఎండ్‌ స్పెషాలిటీ గ్లాస్‌ బాటిళ్లను ఇక్కడ తయారు చేస్తారు. ఫర్నేస్‌తోపాటు అయిదు తయారీ లైన్లు ఏర్పాటు కానున్నాయి. యూఎస్‌ఏ, ఆ స్ట్రేలియా, యూరప్‌ దేశాలకు సైతం ఎగుమతి చేయ నున్నారు. 1972లో ప్రారంభమైన ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌.. ముడి సరుకు లభ్యత దృష్ట్యా హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌తోపాటు భవనగిరిలో ప్లాంట్లను నిర్వహిస్తోంది. వీటి సామర్థ్యం రోజుకు 1,600 టన్నులు. కంపెనీ వార్షికాదాయం రూ.1,300 కోట్లు. సుమారు 3,000 మంది ఉద్యోగులున్నారు. 5 నుంచి 4,000 మిల్లీలీటర్ల సామర్థ్యం గల బాటిళ్లను ఉత్పత్తి చేస్తోంది.

మరిన్ని వార్తలు