గోధుమలపై ఎందుకీ గోల.. సరైన నిర్ణయం తీసుకోలేరా?

2 Jun, 2022 17:14 IST|Sakshi

గోధుమల ఎగుమతుల విషయంలో కేంద్రం ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయం అసలుకే ఎసరు తెచ్చే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి నిర్ణయం తగు తీసుకోకుంటే భారీ ఎత్తున గోధుములు పాడైపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. 

గోధుమల ఎగుమతిని కేంద్రం ఈ ఏడాది ఆరంభంలో భారీగా ప్రోత్సహించింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌ యుద్ధంతో ఏర్పడిన గోధుమలకు పెరిగిన డిమాండ్‌ను ఉపయోగించుకోవాలని అన్నట్టుగా వ్యూహాలు రూపొందించింది. దీంతో ఎడా పెడా గోధుమల ఎగుమతులు మొదలయ్యాయి. అయితే ఈ సీజన్‌లో ఎండలు బాగా ఉన్నందున గోధమల దిగుమతి తగ్గే అవకాశం ఉందనే అంచనాలు వెలువడ్డాయి. దీంతో మే 14న అకస్మాత్తుగా గోధుమల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది.

కేంద్రం నిషేధం అమల్లోకి వచ్చే సరికే దాదాపు ఇరవై లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలు దేశంలోని ప్రముఖ పోర్టులకు చేరుకుని ఉన్నాయి. వీటిని ఒడల్లోకి ఎక్కించడమే తరువాయి అనే క్రమంలో గోధుమల ఎగుమతికి బ్రేక్‌ పడింది. తాజాగా కేంద్రం ప్రత్యేక అనుమతుల కింద 4 లక్షల టన్నుల పై చిలుకు గోధుమల ఎగుమతికి తాజాగా అనుమతి ఇచ్చింది. ఐనప్పటికీ ఇంకా 17 లక్షల టన్నుల గోధుమలు ఇంకా పోర్టుల్లోనే ఉండిపోయాయి.

త్వరలో దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించనున్నాయి. పోర్టుల్లో ఆరుబయట ఉన్న గోధములు ఈ వర్షంలో చిక్కుకుంటే ఇబ్బందులు తప్పవని ట్రేడర్లు అందోళన వ్యక్తం చేస్తున్నారు. బయటి దేశాల్లో డిమాండ్‌ ఉన్నందువల్ల పోర్టుల్లో ఉన్న సరుకు ఎగుమతికి ప్రత్యేక అనుమతి కావాలని కోరుతున్నారు. లేదంటే పోర్టుల్లో ఉన్న గోధుమలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎఫ్‌సీఐలకు తరలించాలని సూచిస్తున్నారు. లేదంటే ఇటు ఎగుమతి చేయలేక అటు దేశ అవసరాలకు ఉపయోగపడక గోధుమలు పాడైపోయే అవకాశం ఉందంటున్నారు. 

చదవండి: గోధుమ ఎగుమతులపై నిషేధం సానుకూలం

మరిన్ని వార్తలు