హైదరాబాద్‌లో ఈ ఇళ్లకే గిరాకీ!

14 May, 2022 12:32 IST|Sakshi

మధ్యతరగతి గృహాలకే  డిమాండ్‌! 

ధర రూ.25–50 లక్షలు ఉన్న ఇళ్ల కొనుగోళ్లకే మక్కువ 

గత నెలలోని విక్రయాల్లో 52 శాతం ఈ తరహా ఫ్లాట్‌లే

ఏప్రిల్‌లో 5,331 గృహాల విక్రయం; వీటి విలువ రూ.2,767 కోట్లు  

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌లో రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉండే మధ్యతరగతి గృహాలకు డిమాండ్‌ కొనసాగుతోంది. గత నెలలో విక్రయమైన  గృహాలలో 53 శాతం ఈ తరహా ఇళ్లే కావటం ఇందుకు ఉదాహరణ. గతేడాది ఏప్రిల్‌లోని ఇళ్ల అమ్మకాల్లో మధ్య తరగతి ఫ్లాట్ల వాటా 34 శాతంగా ఉండగా.. ఈ ఏప్రిల్‌ నాటికి ఏకంగా 53 శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో రూ.25 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలకు గిరాకీ భారీగా క్షీణించింది. గతేడాది ఏప్రిల్‌లో ఈ తరహా ఇళ్ల వాటా 42 శాతం ఉండగా.. ఈ ఏప్రిల్‌ నాటికి ఏకంగా 17 శాతానికి తగ్గిపోయాయి. కరోనా కారణంగా విస్తీర్ణమైన ఇళ్లు, ప్రత్యేకంగా గది, ఇతరత్రా ఏర్పాట్లు కావాలని కొనుగోలుదారులు కోరుకోవటమే అందుబాటు గృహాలకు డిమాండ్‌ తగ్గిపోవటానికి ప్రధాన కారణాలని వివరించారు. ఇక, రూ.50–70 లక్షల మధ్య ధర ఉండే గృహాల వాటా 11% నుంచి 13 శాతానికి, రూ.75 లక్షలపైన ధర ఉండే లగ్జరీ ఇళ్ల వాటా 13 శాతం నుంచి 17 శాతానికి పెరిగాయి. 

విస్తీర్ణమైన ఇళ్లకే డిమాండ్‌.. 
కరోనా, వర్క్‌ ఫ్రం హోమ్, ఆన్‌లైన్‌ క్లాస్‌ల నేపథ్యంలో ఇంటి విస్తీర్ణాలు పెరిగాయి. ఇంట్లో ప్రత్యేకంగా గది, 24 గంటలు వైఫై ఉండాలని నివాసితులు భావిస్తున్నారు. దీంతో గతేడాది ఏప్రిల్‌లోని గృహ విక్రయాలలో 1,000 చ.అ. నుంచి 2,000 చ.అ. విస్తీర్ణమైన ఫ్లాట్ల వాటా 69 శాతం ఉండగా.. ఈ ఏప్రిల్‌ నాటికి 72 శాతానికి పెరిగాయి. 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన అపార్ట్‌మెంట్ల వాటా 10 శాతం నుంచి స్వల్పంగా 11 శాతానికి పెరిగింది. కాగా.. గతేడాది ఏప్రిల్‌లో 1,000 చ.అ. లోపు విస్తీర్ణమైన ఫ్లాట్ల వాటా 21 శాతం ఉండగా.. ఈ ఏప్రిల్‌ నాటికి 17 శాతానికి క్షీణించాయి.  ఈ ఏడాది ఏప్రిల్‌లోని గృహ విక్రయాలలో హైదరాబాద్‌ వాటా 15 శాతం కాగా.. మేడ్చల్‌–మల్కాజ్‌గిరి 44 శాతం, రంగారెడ్డి 40 శాతం, సంగారెడ్డి 1 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 

డిమాండ్‌ ఎందుకంటే..? 
హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌ ద్రవ్యోల్బణం, ఆర్థ్ధిక మందగమనం వంటి ఒత్తిళ్లను సమర్థ వంతంగా ఎదుర్కొంటుంది. పెరిగిన నిర్మాణ వ్యయం కారణంగా ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నప్పటికీ.. ఈ ప్రభావం పరిమిత స్థాయిలోనే ఉంది. ఉపాధి భద్రత, హౌస్‌హోల్డ్‌ ఆదాయం, పొదుపులలో పెరుగుదల కారణంగా ప్రాపర్టీలకు గిరాకీ ఉంది.  – శిశీర్‌ బైజాల్, సీఎండీ, నైట్‌ఫ్రాంక్‌ 

చదవండి: ‘111’ మాస్టర్‌ ప్లాన్‌ ఎలా ఉండాలంటే?

మరిన్ని వార్తలు