జోరుగా హైరింగ్‌.. టెలికం, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల్లో భారీగా నియామకాలు 

8 Jun, 2022 00:11 IST|Sakshi

మే నెలలో 9 శాతం అప్‌: మాన్‌స్టర్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండో నెలా నియామకాలకు డిమాండ్‌ కొనసాగింది. ప్రధానంగా టెలికం, బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), దిగుమతి .. ఎగుమతి రంగాల్లో హైరింగ్‌ పెరిగింది. గతేడాది మే నెలతో పోలిస్తే ఈసారి మే లో 9 శాతం వృద్ధి నమోదైంది. రిక్రూట్‌మెంట్‌ సమాచార సంస్థ మాన్‌స్టర్‌డాట్‌కామ్‌కు చెందిన ఉద్యోగాల సూచీ (ఎంఈఐ) ప్రకారం రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

‘దేశవ్యాప్తంగా వివిధ వ్యాపార విభాగాలు కోలుకోవడం, 5జీ సేవలు ప్రారంభం కానుండటం తదితర అంశాల ఊతంతో నియామకాలకు సంబంధించి 2022–23 ఆర్థిక సంవత్సరం ఘనంగానే ప్రారంభమైంది. ఇప్పటివరకూ అయితే దేశీ జాబ్‌ మార్కెట్‌ మెరుగ్గానే ఉంది‘ అని మాన్‌స్టర్‌డాట్‌కామ్‌ సీఈవో శేఖర్‌ గరిశా తెలిపారు. ప్రతిభావంతులను నియమించుకోవాలని రిక్రూటర్లు భావిస్తున్నారని, మార్కెట్‌లో కచి్చతంగా వారికి డిమాండ్‌ నెలకొంటుందన్నారు.

నివేదికలో ప్రధాన అంశాలు.. 

  • సరఫరా వ్యవస్థలు మెరుగుపడటంతో దిగుమతులు, ఎగుమతుల విభాగంలో జాబ్‌ పోస్టింగ్‌లు 47 శాతం పెరిగాయి. 
  • డిజిటైజేషన్, నగదురహిత చెల్లింపులు, డిజిటల్‌ మనీ తదితర విధానాలు బీఎఫ్‌ఎస్‌ఐకి దన్నుగా ఉన్నాయి. ఈ విభాగంలో నియామకాలు 38 శాతం పెరిగాయి. 5జీ సేవల ప్రారంభం అంచనాలపై టెలికం/ఐఎస్‌పీ విభాగాల్లో జాబ్‌ పోస్టింగ్‌ల వృద్ధి 36 శాతంగా ఉంది. 
  • ట్రావెల్, టూరిజం విభాగాలు పూర్తిగా కోలుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వీటిలో నియామకాల పోస్టింగ్‌లు 29 శాతం పెరిగాయి. వాస్తవానికి ఏప్రిల్‌తో పోలిస్తే (15 శాతం) ఈ విభాగం దాదాపు రెట్టింపు అయ్యింది. 
  • ఉద్యోగులు క్రమంగా ఆఫీసు బాట పడుతుండటంతో ఆఫీస్‌ పరికరాలు, ఆటోమేషన్‌ విభాగాల్లో నియామకాలు 101 శాతం, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 25 శాతం మేర పెరిగాయి. రిటైల్‌ విభాగంలో 11 శాతం వృద్ధి నమోదైంది. 
  • 2021 సెప్టెంబర్‌ నుండి మీడియా, వినోద రంగంలో క్షీణత కొనసాగుతోంది. మే నెలలో హైరింగ్‌ 19 శాతం తగ్గింది. 
  • ఇంజినీరింగ్, సిమెంట్, నిర్మాణ, ఐరన్‌..స్టీల్‌ విభాగాల్లో ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ కార్యకలాపాలు 9 శాతం మేర తగ్గాయి. 
  • షిప్పింగ్, మెరైన్‌లో 4% క్షీణత నమోదైంది. 
  • కరోనా మహమ్మారి అనంతరం రికవరీలో ద్వితీయ శ్రేణి పట్టణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీనికి నిదర్శనంగా నగరాలవారీగా చూస్తే కోయంబత్తూర్‌లో అత్యధికంగా నియామకాల పోస్టింగ్‌లు నమోదయ్యాయి. 27 శాతం పెరిగాయి. ముంబైలో ఇది 26 శాతంగా ఉంది. ఇక ఢిల్లీ–రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌), హైదరాబాద్‌లో జాబ్‌ పోస్టింగ్‌ల వృద్ధి 16 శాతంగా నమోదైంది. 
  • చెన్నై (15 శాతం), పుణె (13%), బెంగళూరు (9%), కోల్‌కతా (6%) పెరిగాయి. 
మరిన్ని వార్తలు