బజ్జీల బండి.. కోట్ల ఆస్తులండీ!

12 Aug, 2021 02:50 IST|Sakshi

ఓ చిన్న పాన్‌షాపు.. పక్కనే ఓ బజ్జీలు, మిర్చీల దుకాణం.. ఆ పక్కన ఓ కిరాణా.. చూస్తే ఏదో మధ్య తరగతి బతుకుల్లా కనిపిస్తాయి. కానీ ఇంటికెళ్లి చూస్తే వైభోగమే. పెద్ద పెద్ద ఇళ్లు, కార్లు, కోట్ల విలువైన భూములు, ఆస్తులు.. ఇలా ఏదో ఒకరిద్దరు కాదు.. వందలాది మంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ చేసిన దాడుల్లో కళ్లు బైర్లు కమ్మే ఇలాంటివెన్నో వెలుగుచూశాయి. ఆ వివరాలు తెలుసుకుందామా? 

చిన్న దుకాణాలు..  వీధి వ్యాపారులు 
ఇబ్బడిముబ్బడిగా సంపాదిస్తున్నా పన్ను కట్టకుండా ఎగ్గొడుతున్నవారిపై కన్నేసిన ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఇటీవల కాన్పూర్‌లో నిఘా పెట్టింది. పలు ప్రాంతాల్లో చిన్న చిన్న కిరాణా, మందులు, కూరగాయల దుకాణాలు నడుపుతున్నవారు, వీధి వ్యాపారులు కూడా లక్షలు, కోట్ల రూపాయల్లో సంపాదిస్తున్నట్టు గుర్తించింది. అలాంటి 250 మందిపై దాడులు చేసిన అధికారులు.. వారి ఆస్తులు చూసి బిత్తరపోవడం గమనార్హం. 

  • ఈ 250 మంది గత నాలుగేళ్లలోనే ఏకంగా రూ.375 కోట్ల మేర వెనకేసినట్టు ఐటీ అధికారులు తేల్చారు. వారు కాన్పూర్‌లోని స్వరూప్‌ నగర్, ఆర్యనగర్, హులాగంజ్, బిర్హానారోడ్‌ వంటి ఖరీదైన ప్రాంతాల్లో భూములు, స్థలాలు కొన్నట్టు గుర్తించారు. 
     
  • కొందరు పాన్‌ షాపుల ఓనర్లు గత ఏడాది లాక్‌డౌన్‌ నాటి నుంచి ఏకంగా రూ.5 కోట్ల మేర ఆస్తులు సంపాదించుకున్నారు. 
     
  • బికాన్‌గంజ్‌కు చెందిన ఇద్దరు, లాల్‌బంగ్లా ప్రాంతానికి చెందిన ఒక శానిటేషన్‌ వర్కర్లు గత రెండేళ్లలో రూ.10 కోట్ల విలువైన ఇళ్లు, స్థలాలు కొన్నారు. 


రెండు, మూడు కార్లు.. 

  • కాన్పూర్‌లో గుర్తించిన సీక్రెట్‌ మిలియనీర్స్‌ (రహస్య కోటీశ్వరులు)లో చాలా మందికి రెండు, మూడు కార్లు ఉన్నాయి. 
  • మాల్‌రోడ్‌లో ఓ స్నాక్స్‌ (పానీపూరీ, వడాపావ్‌ వంటివి) షాపు యజమాని తాను కిరాయికి తీసుకున్న కార్లు, ఇతర వాహనాల కోసం ప్రతినెలా లక్షా 25 వేలు అద్దె చెల్లిస్తున్నాడు. 

లక్షలు, కోట్లలో వ్యాపారం చేస్తున్నా.. 
ఐటీ అధికారులు దాడులు చేసిన 250 మంది కూడా లక్షలు, కోట్లలో వ్యాపారం చేస్తున్నా ఎలాంటి పన్నులూ కట్టడం లేదని గుర్తించారు. బిగ్‌డేటా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వారి వ్యాపారాలు, జీఎస్టీ రిజిస్ట్రేషన్, ఇతర లెక్కలు తేల్చారు. 65 మంది అసలు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకోలేదని గుర్తించారు.  

  • ఏటా లక్షలు, కోట్లు సంపాదిస్తున్నా బయటపడకుండా వివిధ మార్గాలు అనుసరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. చాలా మంది తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట ఆస్తులు కొన్నారు. జాతీయ, ప్రైవేటు బ్యాంకుల్లో కాకుండా సహకార బ్యాంకుల్లో, ఆర్థిక పథకాల్లో, ప్రైవేటు చిట్టీలు, ఫైనాన్స్‌ సంస్థల్లో డిపాజిట్లు చేశారు. 

ఎలా  బయటపడ్డారు? 
సొమ్ము ట్రాన్స్‌ఫర్ల సమయంలో, కొన్ని ప్రభుత్వ పత్రాలకు సంబంధించి కొందరు వ్యాపారులు పాన్‌కార్డు వివరాలను ఇచ్చారు. వీటితోపాటు ఆస్తుల కొనుగోళ్ల సమయంలో ఆధార్‌ వినియోగించారు. పాన్‌ కార్డు, ఆధార్‌ రెండింటినీ లింక్‌చేసి ఉండటంతో భారీ కొనుగోళ్లు, అమ్మకాల వివరాలు అధికారులకు అందాయి. దీనిపైవారు కూపీ లాగడంతో లక్షలు, కోట్లలో వ్యాపారం,సంపాదన బయటపడ్డాయి. 

ఇదే మొదటిసారేం కాదు.. 
మన దేశంలో ఇలా చిన్న దుకాణాలు, వీధి వ్యాపారం చేసే ‘రహస్య కోటీశ్వరుల’ను గుర్తించడం ఇదే మొదటిసారేం కాదు. 2016లో కాన్పూర్‌లోనే సుమారు 12 మంది వీధి వ్యాపారుల దగ్గర రూ.60 కోట్ల లెక్కలు చూపని ఆస్తులను గుర్తించారు. 2019లో అలీగఢ్‌లో ఓ చిన్న స్నాక్స్‌ బండి యజమాని ఏటా 60 లక్షలకుపైగా టర్నోవర్‌ చేస్తున్నట్టు తేల్చారు.  
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు