ప్రపంచ తొలి 10 మంది కుబేరుల్లో అంబానీ!

2 Mar, 2021 16:23 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల ‘హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్ 2021‌’ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్ 2021 ధనవంతుల జాబితా నేడు విడుదల చేశారు. ముఖేష్ అంబానీ మొత్తం సంపద గత ఏడాది కాలంలో 24 శాతం పెరిగి 83 బిలియన్‌ డాలర్లకు(సుమారు రూ .6.09 లక్షల కోట్లు) చేరుకున్నట్లు నివేదిక తెలిపింది. ఇటీవల, చైనా జాంగ్ షాన్షాన్ ఈ వారంలో 22 బిలియన్ డాలర్లను కోల్పోయిన తర్వాత ముఖేష్ అంబానీ ఆసియాలో అత్యంత ధనవంతుడు అయ్యాడు. 

ముకేష్ అంబానీతో పాటు అనేక ఇతర భారతీయ బిలియనీర్లు కూడా ‘హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్ 2021‌’ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారు గౌతమ్ అదానీ కుటుంబం రూ.2.34 లక్షల కోట్ల సంపదతో 48వ స్థానం, శివ నాడర్ కుటుంబం రూ.1.94 లక్షల కోట్ల సంపదతో 58వ స్థానం, లక్ష్మి ఎన్ మిట్టల్ రూ.1.40 లక్షల కోట్ల సంపదతో 104వ స్థానం, సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధిపతి సైరస్ పూనావాలా రూ.1.35 లక్షల కోట్లతో సంపదతో 113వ స్థానంలో నిలిచారు. హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్ ప్రకారం భారత్‌లో మొత్తం 209 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో 177 మంది ప్రస్తుతం భారత్‌లో నివసిస్తున్నారు.

‘హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్’ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా టెస్లా కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌ నిలిచారు. గత ఏడాది కాలంలో ఆయన సంపద 328 శాతం పెరిగి 197 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఒక్క సంవత్సర కాలంలో ఆయన సంపద ఏకంగా 151 బిలియన్‌ డాలర్లు పెరగడం విశేషం. అమెజాన్.కామ్ ఇంక్ అధినేత జెఫ్ బెజోస్ 189 బిలియన్ డాలర్ల నికర విలువతో రెండవ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద లగ్జరీ-వస్తువుల తయారీ సంస్థ ఎల్విఎంహెచ్ మోయిట్ హెన్నెస్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 114 బిలియన్ డాలర్ల నికర విలువతో 3వ స్థానంలో, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 110 బిలియన్ డాలర్లతో 4వ స్థానంలో, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ 101 బిలియన్ డాలర్ల సంపదతో 5వ స్థానంలో ఉన్నారు.

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 10వ ఎడిషన్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఏడాది వ్యవధిలో 50 బిలియన్‌ డాలర్లకు పైగా సంపద పోగేసిన వారు కేవలం ముగ్గురే ముగ్గురు కావడం విశేషం. వీరిలో ఒకరు ఎలన్‌ మస్క్‌(151 బిలియన్‌ డాలర్లు) కాగా.. జెఫ్‌ బెజోస్‌(50 బిలియన్‌ డాలర్లు), పిన్‌డ్యువోడ్యువో అధినేత కొలిన్‌ హువాంగ్(50 బిలియన్‌ డాలర్లు) ఉన్నారు. "బిలియనీర్లు గత సంవత్సరంలో జర్మనీ యొక్క స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)తో సమానంగా 3.5 ట్రిలియన్ డాలర్ల సంపదను" సృష్టించారు. గత ఏడాది కాలంలో కొత్తగా పుట్టుకొచ్చిన బిలియనీర్ల విషయంలో అగ్రరాజ్యం అమెరికాతో భారత్‌ పోటీ పడింది. అమెరికాలో మొత్తం 69 మంది కొత్తగా బిలియనీర్ల జాబితాలో చేరగా.. భారత్‌ నుంచి ఆ సంఖ్య 40గా నమోదైంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 జాబితాను ప్రపంచంలో 68దేశాలలో ఉన్న 2,402 కంపెనీలు, 3228 బిలియనీర్లను పరిగణలోకి తీసుకోని విడుదల చేశారు.

చదవండి:

భారీగా పడిపోయిన బంగారం ధరలు 

కోవిన్‌ 2.0 రెడీ.. వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్‌ చేసుకోండిలా!


 

మరిన్ని వార్తలు