భారీగా పెరిగిన అదానీ, అంబానీల సంపద

3 Mar, 2021 04:10 IST|Sakshi

2020లో కొత్తగా 40 మంది బిలియనీర్లు 

అదానీ, అంబానీల సంపదల్లో భారీ వృద్ధి 

దేశంలో టాప్‌–2 వీరే హరూన్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ విడుదల

హైదరాబాద్‌ నుంచి 10 మంది శ్రీమంతులు

ముంబై: కరోనా విపత్తు సమయంలోనూ 2020లో దేశంలో కొత్తగా 40 మంది సంపన్నులు (బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ సంపద) అవతరించారు. దీంతో 209 మంది బిలియనీర్లతో ప్రపంచంలో అత్యధిక మంది బిలియనీర్లను కలిగిన మూడో దేశంగా ‘హరూన్‌ గ్లోబల్‌ రిచ్‌లిస్ట్‌ 2021’లో భారత్‌ నిలిచింది. ముకేశ్‌ అంబానీ దేశంలో ధనాగ్రజుడిగా తన స్థానాన్ని కొనసాగించారు. ఆయన నికర విలువ 83 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ప్రపంచంలో ఎనిమిదో సంపన్నుడిగా ముకేశ్‌ అంబానీ నిలిచారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ గతేడాది 24 శాతం వృద్ధి చెందడం ఆయన స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.

ఇక గౌతమ్‌ అదానీ సంపద అయితే గతేడాది ఏకంగా రెట్టింపు అయ్యి 32 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో అంతర్జాతీయంగా 20 స్థానాలు పైకి ఎగబాకి ప్రపంచ సంపన్నుల్లో 48వ స్థానాన్ని అదానీ కైవసం చేసుకున్నారు. ముకేశ్‌ తర్వాత దేశంలో రెండో కుబేరుడిగా గౌతమ్‌ అదానీ నిలిచారు. ఆయన సోదరుడు వినోద్‌ అదానీ సంపద 128 శాతం పెరిగి 9.8 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది జనవరి 15 వరకూ ఉన్న ఆయా పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబ సంపదను కూడా హరూన్‌ పరిగణనలోకి తీసుకుంది. భారత్‌లో కరోనానియంత్రణకు ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌లు పేదలపై ఎక్కువ ప్రభావం చూపించినట్టు పేర్కొంది. 

మూడో స్థానంలో శివ్‌నాడార్‌.. 
ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ ప్రమోటర్‌ శివ్‌నాడార్‌ 27 బిలియన్‌ డాలర్లతో దేశంలో మూడో సంపదపరుడిగా హరూన్‌ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. ఆర్సెలర్‌ మిట్టల్‌కు చెందిన లక్ష్మీ నివాస్‌ మిట్టల్, సిరమ్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన సైరస్‌ పూనవాలా తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. జయ్‌ చౌదరి (జెడ్‌స్కాలర్‌ వ్యవస్థాపకుడు) సంపద 2020లో ఏకంగా 274 శాతం పెరిగి 13 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా.. బైజు రవీంద్రన్, ఆయన కుటుంబ విలువ కూడా నూరు శాతం వృద్ధి చెంది 2.8 బిలియన్‌ డాలర్లకు చేరింది. మహీంద్రా గ్రూపు అధినేత ఆనంద్‌ మహీంద్రా, ఆయన కుటుంబం విలువ సైతం 100% పెరిగి 2.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది. బయోకాన్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా నికర విలువ 41% పెరిగి 4.8 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, గోద్రేజ్‌కు చెందిన స్మితా వి సృష్ణ సంపద 4.7 బిలియన్‌ డాలర్లుగాను, లుపిన్‌కు చెందిన మంజూ గుప్తా 3.3 బిలియన్‌ డాలర్లతో ఈ జాబితాలో ఉన్నారు.  

వీరి సంపదలో క్షీణత...
పతంజలి ఆయుర్వేద్‌ ప్రమోటర్‌ అయిన ఆచార్య బాలకృష్ట సంపద 2020లో 32 శాతం తరిగిపోయి 3.6 బిలియన్‌ డాలర్లకు పరిమితం అయింది. భారత్‌లో ఉన్న 177 బిలియనీర్లలో 60 మంది ముంబై కేంద్రంగానే ఉండటం గమనార్హం. ఆ తర్వాత ఢిల్లీలో 40 మంది, బెంగళూరులో 22 మంది  కుబేరులు ఉన్నారు. 1,058 బిలియనీర్లతో సంఖ్యా పరంగా చైనా మొదటి స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా చూస్తే హరూన్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌లో మొత్తం 3,228 బిలియనీర్లు ఉన్నారు. టెస్లా ఎలాన్‌ మస్క్‌ సంపద 197 బిలియన్‌ డాలర్లు, అమెజాన్‌ జెఫ్‌ బెజోస్‌ సంపద 189 బిలియన్‌ డాలర్లు, బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ సంపద 114 బిలియన్‌ డాలర్లతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.

భాగ్యగనగరం నుంచి 10 మంది
హైదరాబాద్‌ నుంచి 10 మంది కుబేరులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరిలో ఏడుగురు ఫార్మా రంగానికి చెందినవారే కావడం విశేషం. మిగతా ముగ్గురు నిర్మాణ, మౌలిక రంగానికి చెందిన వారు. 
 

మరిన్ని వార్తలు