హైబ్రిడ్ వర్క్: ఐటీ దిగ్గజాలకు ఆ తలనొప్పి బాగా తగ్గిందట!

26 Jul, 2022 13:30 IST|Sakshi

కాలిఫోర్నియా: వర్క్‌ ఫ్రం హోం పని విధానం అటు  ఐటీ ఉద్యోగులకు,  ఇటు ఐటీ సంస్థలకు బాగా  ఉపయోగపడింది అనేది అందరికీ తెలిసిన విషయమే.  అయితే హైబ్రిడ్ వర్క్  కంపెనీలకు ఇతర ఉపయోగాలతోపాటు మరో ప్రయోజనం కలిగిందని తాజా అధ్యయనంలో తేలింది.  పని విధానం రేటింగ్‌, ప్రమోషన్‌ ప్రక్రియపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోవడమేకాదు, ఐటీ దిగ్గజాలకు అట్రిషన్‌ (కంపెనీనుంచి మరో కంపెనికి తరలిపోవడం) అనే పెద్ద తలనొప్పినుంచి మూడోవంతు ఊరట లభించిందట.

హైబ్రిడ్‌ పనివిధానంతో ప్రముఖ ఐటీ కంపెనీల్లో అట్రిషన్ రేటు 35 శాతం తగ్గిందని తాజా అధ్యయనంలో తేలింది. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన నికోలస్ బ్లూమ్ ఆధ్వర్యంలోని  కొత్త అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది. మొత్తంగా హైబ్రిడ్, లేదా వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగులు, సంస్థలకు ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో హైలైట్ చేసింది.

కరోనా మహమ్మారి సమయంలో లాక్‌డౌన్లు, ప్రయాణ ఆంక్షలతో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల కోసం వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని అవలబించాయి. ఆ తరువాత  సడలింపులతో హైబ్రిడ్ వర్క్ పద్దతిని ఫాలో అవుతున్నాయి. సాధారణంగా ప్రతి వారం కార్యాలయంలో రెండు నుండి మూడు రోజులు పని చేయడం , మిగిలిన రోజుల్లో ఇంట్లోనుంచే పని చేయడం అన్నమాట. నిరుద్యోగం రేటు ఐదు దశాబ్దాలలో కనిష్ట స్థాయికి చేరుకోవడంతో,  ఇంటి నుండి పని చేసే విధానాన్ని తీవ్రంగా విమర్శించిన కొందరు కూడా ఉద్యోగులను ఆకర్షించడానికి వర్క్‌ ఫ్రం హోంను ఎంచు కున్నారుని స్టడీ వ్యాఖ్యానించింది. 

గ్లోబల్ ట్రావెల్ ఏజెంట్ Trip.comలో 2021, 2022లో  1,612 ఇంజనీర్లు, మార్కెటింగ్ అండ్‌ ఫైనాన్స్ ఉద్యోగులపై ట్రయల్‌ స్టడీ చేసింది.  ఇందులో భాగంగా  బేసి డేట్స్‌లో జన్మించిన వారు బుధ, శుక్రవారాల్లో ఇంటి నుండి పని చేసేందుకు నిర్ణయించుకోగా, మరికొందరు పూర్తి సమయం కార్యాలయంలో పని చేశారు. ఈ అధ్యయనం సానుకూల ఫలితాలతో Trip.com మొత్తం కంపెనీకి హైబ్రిడ్ పనిని అందించిందని ఈ స్టడీ నివేదించింది. బ్లూమ్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన రూబింగ్ హాన్ , జేమ్స్ లియాంగ్ సహ రచయితలుగా ఒక పేపర్‌ను పబ్లిష్‌ చేశారు.

అట్రిషన్‌లో మెరుగుదలతో పాటు, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్  పేపర్ హైబ్రిడ్ ఏర్పాట్లు పని షెడ్యూల్‌లు ,అలవాట్లను ఎలా మారుస్తుందో కూడా హైలైట్ చేసింది. రిమోట్ రోజులలో తక్కువ గంటలు పని చేసినా కానీ వారాంతంతో సహా ఇతర రోజులలో పని గంటల సంఖ్యను పెంచారు. మొత్తంగా, ఉద్యోగులు ఇంటి రోజులలో దాదాపు 80 నిమిషాలు తక్కువ పనిచేశారు కానీ ఇతర పని దినాల్లో వారాంతంలో దాదాపు 30 నిమిషాలు ఎక్కువ పనిచేశారు. ఈ పనివిధానంతో వర్క్‌ రివ్యూ, ప్రమోషన్స్‌లో ఎలాంటి ప్రభావం లేదని తెలిపింది. మొత్తంగా ఇంటి నుండి పని చేసే అవకాశం ఉన్నవారు కొంచెం ఎక్కువ ఉత్పాదకతను నివేదించారు. ఆఫీసుల్లో పనిచేసినవారితో పోలిస్తే  కోడ్ లైన్లలో 8 శాతం పెరుగుదల నమోదైందట.

మరిన్ని వార్తలు