టీహబ్‌–2లో 200 స్టార్టప్‌ల కార్యకలాపాలు

24 Sep, 2022 12:32 IST|Sakshi

నూతన ఆవిష్కరణలకు బాటలు

మరింత పెరగనున్న ఐటీ భూమ్‌ 

సాక్షి, హైదరాబాద్: ఐటీ శాఖ ప్రతిష్టాత్మకంగా రాయదుర్గంలో నిర్మించిన అంకుర పరిశ్రమల స్వర్గధామం టీహబ్‌–2లో సుమారు 200 అంకుర సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిసింది. వీటిలో ఐటీ, అనుంబంధ రంగాలు, కృత్రిమ మేధ, సైబర్‌ సెక్యూరిటీ తదితర రంగాలతోపాటు ఆరోగ్య, ప్రజోపయోగ సేవలందించేందుకు నూతన ఆవిష్కరణలు చేసే సంస్థలు ఉన్నాయి. జూన్‌ నెలలో ఐటీ శాఖ ఈ హబ్‌ను ప్రారంభించిన విషయం విదితమే. సెప్టెంబరు తొలి వారం నుంచి పలు సంస్థలు ఇక్కడి నుంచి పనిచేయడం ప్రారంభించినట్లు ఐటీ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. సుమారు రూ.276 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రంలో దశలవారీగా సుమారు రెండు వేల కంపెనీలకు వసతి కల్పించనున్నారు.  

టీహబ్‌–2 ప్రత్యేకతలివే.. 
► స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహించేందుకు గచ్చిబౌలిలో 2015లో ఏర్పాటు చేసిన తొలి టీహబ్‌ ప్రయోగం విజయవంతం కావడంతో టీహబ్‌–2 ను తెలంగాణ  ప్రభుత్వం నిర్మించింది.

► ఈ కేంద్రాన్ని రాయదుర్గంలో 3.5 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో నిర్మించారు. దేశంలోనే ఇది అతిపెద్ద ఇంక్యుబేటర్‌ కేంద్రమని..ప్రపంచంలోనే రెండవదని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి.

► కాగా గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టీహబ్‌ మొదటిదశను ఐఐఐటీ–హైదరాబాద్,ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్,నల్సార్‌ సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి. ఇందులో 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గచ్చిబౌలిలోని ఐఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో నెలకొల్పారు.

► స్టారప్‌ కంపెనీలు నెలకొల్పాలనుకునే ఔత్సాహికులు, వారికి పెట్టుబడి సాయం అందించే ఇన్వెస్టర్లు,ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలను ఒకేచోటకు చేర్చడం హబ్‌ ఉద్దేశం.

► అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉన్న అవకాశాలను ఒడిసిపట్టుకునేదుకు అనువైన వ్యవస్థను టీహబ్‌లలో ఏర్పాటు చేయడం విశేషం. 

తొలిదశ స్ఫూర్తితో.. 
గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన టీహబ్‌ మొదటి దశ ప్రయోగం విజయవంతమైంది. తొలిదశ టీహబ్‌లో ఏడేళ్లుగా ఇందులో 1200 స్టార్టప్‌ కంపెనీలు పురుడు పోసుకున్నాయి. సుమారు రూ.1800 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. సుమారు 2500 మందికి ఉపాధి కల్పించింది. ఇక్కడ పురుడుపోసుకున్న పలు స్టార్టప్‌లు దేశ,విదేశాల్లో పనిచేస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, సేవా, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్,హెల్త్‌కేర్, ఇండస్ట్రీ రంగాల్లో సేవలందిస్తోన్న కంపెనీలకు సాంకేతికసహకారం అందిస్తున్నాయి.

ఈ హబ్‌ను మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల, అడోబ్‌ సిస్టమ్స్‌ సీఈఓ శంతను నారాయణ్, బయోకాన్‌ చైర్మన్‌ కిరణ్‌ మంజుందార్‌షాలు సందర్శించి.. ఇక్కడ స్టార్టప్‌లను నెలకొల్పిన యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించారు. ఈ హబ్‌లో స్టార్టప్‌ ఇన్నోవేషన్, కార్పొరేట్‌ ఇన్నోవేషన్, డెమో డే, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ తదితర అంశాలపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పిస్తున్న విషయం విదితమే. (క్లిక్: బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి ‘ఇంజనీర్డ్‌ ఇన్‌ ఇండియా’)

ఐటీ భూమ్‌..హైహై 
టీహబ్‌ ఒకటి, రెండోదశలకు స్పందన క్రమంగా పెరుగుతుండడంతో నగరంలో ఐటీ రంగంలో మరిన్ని నూతన స్టార్టప్‌లు పురుడు పోసుకునే అవకాశాలుంటాయని హైసియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ రంగం మరింత పురోగమించేందుకు ఈ పరిణామం దోహదం చేస్తుందని పేర్కొన్నాయి. (క్లిక్ చేయండి: పండక్కి కొత్త బండి కష్టమే!)

మరిన్ని వార్తలు