ఆసియాలో టాప్‌ టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్‌

30 Aug, 2022 05:38 IST|Sakshi

కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ ఫీల్డ్‌ నివేదిక

న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో బీజింగ్‌ తర్వాత అగ్రస్థాయి టెక్నాలజీ కేంద్రాలుగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నిలిచాయి. నైపుణ్యాలు, రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్, వ్యాపార అనుకూల వాతావరణం ఇత్యాది 14 అంశాల ఆధారంగా టాప్‌ టెక్నాలజీ హబ్‌లను కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ నివేదికను సోమవారం విడుదల చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సంలో బెంగళూరు 2,30,813 టెక్నాలజీ ఉద్యోగాలను కల్పించింది. ఆ తర్వాత చెన్నైలో 1,12,781, హైదరాబాద్‌లో 1,03,032 మందికి, ఢిల్లీలో 89,996 మందికి కొత్తగా ఐటీ రంగంలో ఉద్యోగాలు లభించాయి.

ఐటీ, టెక్నాలజీ ఆధారిత రంగాలు భారత ఆర్థిక వ్యవస్థను నడిపించే కీలక చోదకాలుగా కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ భారత ఎండీ అన్షుల్‌ జైన్‌ పేర్కొన్నారు. ‘‘మార్కెట్‌ మూలాలు బలంగా ఉన్నాయి.  దీంతో ప్రపంచ ఐటీ సంస్థలకు భారత్‌ అనుకూల కేంద్రంగా అవతరించింది. అంతేకాదు, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలకు సైతం కేంద్రంగా ఉంది’’అని జైన్‌ వివరించారు. కార్యాలయ స్థలాల లీజులో (ఆఫీస్‌ స్పేస్‌) బెంగళూరు సగటున 38–40 శాతం వాటాను కలిగి ఉందని.. అలాగే, బెంగళూరులో వార్షిక ఆఫీసు లీజు పరిమాణంలో టెక్నాలజీ రంగాలకు సంబంధించి 38–40 శాతంగా ఉందని ఈ నివేదిక తెలిపింది.

మరిన్ని వార్తలు