నగర రియల్టీలోకి పెట్టుబడుల వరద

4 Sep, 2021 05:02 IST|Sakshi

హెచ్‌1లో రూ.2,250 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌

ముంబై, పుణే, కోల్‌కతా కంటే ఇక్కడే ఎక్కువ

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి పెట్టుబడుల వరద ప్రవహిస్తుంది. ప్రతీ ఏటా ఆరోగ్యకరమైన వృద్ధి రేటును నమోదు చేస్తుంది. ఈ ఏడాది జనవరి–జూన్‌ (హెచ్‌1) మధ్య కాలంలో నగర రియల్టీలోకి 309.4 మిలియన్‌ డాలర్లు (రూ.2,250 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. ఇదే సమయంలో పుణేలోకి 232.2 మిలియన్‌ డాలర్లు (రూ.1,690 కోట్లు), ముంబైలోకి 188.6 మిలియన్‌ డాలర్లు (రూ.1,370 కోట్లు), కోల్‌కతాలోకి 104.6 మిలియన్‌ డాలర్లు (రూ.760 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. హెచ్‌1లో చెన్నై రియల్టీలో ఎలాంటి స్టాండలోన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లావాదేవీలు జరగలేదు. హైదరాబాద్, చెన్నై నగరాల్లో పలు ప్రాజెక్ట్‌లలో సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్, ఆర్‌ఎంజెడ్‌ కార్ప్‌ జాయింట్‌ వెంచర్‌ 210 మిలియన్‌ డాలర్లు (రూ.1,500 కోట్లు) పెట్టుబడులు పెట్టింది. ఇలాంటి లావాదేవీలను ఒకటే నగరంలో పెట్టుబడులుగా పరిగణించకుండా.. బహుళ నగరాల ఇన్వెస్ట్‌మెంట్స్‌గా పరిగణించారు.  

     ఈ ఏడాది హెచ్‌1లో దేశవ్యాప్తంగా 2.4 బిలియన్‌ డాలర్లు (రూ.18,600 కోట్లు) పెట్టుబడు లు వచ్చాయి. గతేడాది హెచ్‌1తో పోలిస్తే 52 శాతం ఎక్కువ. గతేడాది హెచ్‌1లో నగరంలోకి 79 మిలియన్‌ డాలర్లు (రూ. 570 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. పుణేలోకి 39.7 మిలియన్‌ డాలర్లు (రూ.290 కోట్లు) ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చా యి. బెంగళూరు, కోల్‌కతా, చెన్నైలలో స్టాండలోన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లావాదేవీలు జరగలేదు.

గృçహాలు, ఆఫీస్‌లకు డిమాండ్‌..
నివాస, కార్యాలయాల సముదాయాలలో పెట్టుబడులకు హైదరాబాద్‌ అత్యంత ఆకర్షణీయమైన నగరంగా మారింది. అంతకుక్రితం ఐదేళ్లతో పోలిస్తే 2015–19లో భాగ్యనగరంలో అత్యధికంగా ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడుల వృద్ధి నమోదయింది. నిర్మాణంలో ఉన్న ఆఫీస్‌ ప్రాజెక్ట్‌లలో కంటే భవిష్యత్తు ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు అమితమైన ఆసక్తిని చూపిస్తున్నారని ఆసియా కొల్లియర్స్‌ ఇండియా ఎండీ అండ్‌ సీఈఓ రమేష్‌ నాయర్‌ తెలిపారు. ప్రపంచంలోని చాలా వరకు టెక్నాలజీ కంపెనీలు తమ గ్లోబల్‌ సెంటర్లను హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. స్థిరమైన, నిజమైన గృహ వినియోగదారుల నుంచి నివాస సముదాయాలకు డిమాండ్‌ ఉందని చెప్పారు. సులభమైన వ్యాపార విధానాలు, మెరుగైన మౌలిక వసతుల వంటి కారణంగా రాష్ట్రం నిలకడగా అగ్రస్థానంలో కొనసాగుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు