అమ్మకానికి విజయ్‌మాల్యా విల్లా.. వేలంలో దక్కించుకున్న హైదరాబాద్‌ సంస్థ

14 Aug, 2021 16:07 IST|Sakshi

Vijay Mallya Kingfisher House Sold For Rs 52 Crores: కింగ్‌ ఆఫ్‌ గుడ్‌టైమ్‌గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యా ఆస్తులు వేలానికి వస్తున్నాయి. ఇందులో ముంబైలో ఉన్న విలాసవంతమైన ఇంటిని హైదరాబాద్‌కి చెందిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ చేజిక్కించుకుంది. 

వేలానికి ఆస్తులు
విజయ్‌మాల్యా... బిజినెస్‌ రంగానికి గ్లాబర్‌ సొబగులు అద్దిన వ్యాపారవేత్త. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్‌ అడ్రస్‌. అయితే కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రారంభంతో ఆయన ప్రభ మసకబారిపోయింది. ఎయిర్‌లైన్స్‌ కంపెనీకి వచ్చిన వరుస నష్టాలతో మాల్యా ఏకంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులకు బాకీ పడ్డారు. చివరకు తమ అప్పుల కింద విజయ్‌ మాల్యా ఆస్తులను వేలానికి పెట్టే హక్కును బ్యాంకులు చట్టపరంగా సాధించాయి.

రూ. 52 కోట్లు
ముంబై ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో విలేపార్లే ఏరియాలో ఉన్న కింగ్‌ ఫిషర్‌ హౌజ్‌ను బ్యాంకులు వేలానికి వేశాయి. ఈ భవనం వేలం ప్రారంభ ధర రూ.52 కోట్లుగా నిర్ణయించాయి. ఈ వేలంలో హైదరాబాద్‌కి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ బేస్‌ ధర దగ్గరే ఈ భవంతిని సొంతం చేసుకున్నట్టు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. 

2016 నుంచి
ప్రస్తుతం వేలంలో అమ్ముడైపోయిన భవనాన్ని బ్యాంకుల కన్సార్టియం 2016లో వేలానికి తెచ్చింది. అయితే ప్రారంభ ధర రూ.150 కోట్లుగా పేర్కొనడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత పలు మార్లు బ్యాంకులు ప్రయత్నాలు చేసినా సానుకూల ఫలితాలు పొందలేదు. చివరకు ఆ భవనం ధర తగ్గించి ప్రారంభ ధర రూ. 52 కోట్లుగా నిర్ణయించడంతో వెంటనే అమ్ముడు పోయింది. 

మరిన్ని వార్తలు