హైదరాబాద్‌లో భారీ ‘సోలార్‌’ పరిశ్రమ..

28 Jul, 2021 16:29 IST|Sakshi

దక్షిణ భారత దేశంలో సోలార్‌ పవర్‌ ఉత్పత్తికి హైదరాబాద్‌ కీలక కేంద్రం కానుంది. నగరానికి చెందిన ప్రీమియర్‌ ఎనర్జీస్‌ సంస్థ భారీ ఎత్తున సోలార్‌ పరిశ్రమకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేయనుంది. దీనికి సంబంధించిన మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. 

1.5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ సెల్‌, మ్యాడ్యుల్‌ తయారీ పరిశ్రమని 2021 జులై 19న హైదరాబాద్‌ నగరంలో ప్రీమియర్‌ ఎనర్జీస్‌ సంస్థ ప్రారంభించబోతుంది. రూ. 483 కోట్ల వ్యయంతో ఈ తయారీ యూనిట్‌ను నెలకొల్పారు. ఇందులో 750 మెగావాట్ల సోలార్‌ సెల్స్‌, 750 మెగావాట్ల మాడ్యుల్స్‌ తయారీ సామర్థ్యంతో కంపెనీ పని చేయనుంది. అధునాతన మల్టీక్రిస్టలీన్‌, మోనో పీఈఆర్‌సీ టెక్నాలజీని ఈ యూనిట్‌లో ఉపయోగించనున్నారు.

రాబోయే రోజుల్లో మరో రూ. 1200 కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల సోలార్‌ మాడ్యుల్‌  తయారీ యూనిట్‌ని విస్తరిస్తామని ప్రీమియర్‌ ఎనర్జీస్‌ తెలిపింది. విస్తరణ తర్వాత సంస్థ సోలార్‌ మాడ్యుల్‌ తయారీ సామర్థ్యం 3 గిగావాట్లకు చేరుకుంటుందని ప్రీమియర్‌ ఎనర్జీస్‌ ఎండీ చిరంజీవ్‌ సలూజా తెలిపారు. ఈ ఆర్థిక సంవ్సతరానికి రూ.1500 కోట్ల టర్నోవర్‌ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామని, అంతకు ముందు ఏడాది కంపెనీ రెవెన్యూ రూ. 850 కోట్లగా నమోదు అయ్యిందని ఆయన అన్నారు.
 

మరిన్ని వార్తలు