HYD Irani Chai:ఇరానీ చాయ్‌ లవర్స్‌కు చేదు వార్త..! భారీగా పెరిగిన ధరలు..!

25 Mar, 2022 10:02 IST|Sakshi

ఇరానీ చాయ్‌ లవర్స్‌ చేదు వార్త..! జంట నగరాల్లో ఇరానీ చాయ్‌ మరింత ప్రియం కానుంది. ఒక కప్పు ఛాయ్‌పై ఏకంగా రూ. 5 పెంచుతున్నట్లు హోటల్‌ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇరానీ చాయ్‌ రూ. 15 నుంచి రూ. 20కు చేరుకుంది. పెరిగిన ధరలు మార్చి 25 నుంచి అమలులోకి వచ్చాయి.

ఇంధన ధరల పెంపు..!
రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో క్రూడాయిల్‌ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. క్రూడాయిల్‌ ధరల ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఇప్పటికే ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ప్యాకేజ్డ్‌ వస్తువులను భారీగా పెంచాయి. ఇక ద్రవ్యోల్భణ ఒత్తిళ్లను అధిగమించడానికి మరోమారు 10-15 శాతం వరకు ధరలను పెంచేందుకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు సిద్దమైన్నాయి. ఇరానీ టీ పొడి ధర కిలో రూ.300నుంచి రూ.500కు చేరుకొంది. పాలు లీటరుకు రూ.100కు చేరింది. ఇక కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ ధర రూ. 1,800కు చేరుకునే అవకాశం ఉంది. హోటళ్లలో ఇతరత్రా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఇరానీ ఛాయ్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 

కరోనాతో మరింత కష్టంగా..!
కరోనా రాకతో హోటళ్ల నిర్వహణ మరింత కష్టంగా మారింది. హోటళ్ల బిజినెస్‌ పూర్తిగా దెబ్బతింది. ఇక లాక్ డౌన్ అనంత‌రం అస‌లు వ్యాపారం సాగ‌డం లేదని యజమానులు పేర్కొన్నారు. కరోనా తర్వాత నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో.. పాత ధరకు విక్రయించడం సాధ్యం కాదని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.  భారీ నష్టాల నేపథ్యంలో ధరల పెంపు అనివార్యమైందని హోటల్‌ యాజమానులు తెలిపారు. క‌రోనాకు ముందు ఒక క‌ప్పు  ఇరానీ చాయ్ ధ‌ర రూ.10 ఉండేది ఇప్పుడు ఏకంగా..రూ.20కు చేరింది.

చదవండి: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌..! వాటిని తినాలంటే జంకుతున్న భారతీయులు..!

మరిన్ని వార్తలు