Work From Home: ఇక ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందే..!

27 Feb, 2022 17:59 IST|Sakshi

ప్రస్తుతం కరోనా వైరస్ మూడో దశ కూడా ముగిసింది. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి మళ్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీసుల వైపు మళ్లుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ, ఐటీ ఆధారిత చిన్న, మధ్య తరహా, భారీ సంస్థలు ఉద్యోగుల విషయంలో ఏం ఆలోచిస్తున్నాయి? అనే అంశంపై హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేష్(HYSEA) ఒక కీలక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్(HYSEA) ఫిబ్రవరిలో నిర్వహించిన 'రిటర్న్ టు ఆఫీస్' సర్వేలో మొత్తం 68 కంపెనీలు పాల్గొన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్నవే కాకుండా మల్టీ నేషనల్ కంపెనీలు కూడా ఈ సర్వేలో పాల్గొన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సంస్థల్లో వీటి శాతం 30గా భావించవచ్చు. ఇప్పటికే 56 శాతం ఆఫీసుల్లో ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేస్తున్నారు. అదే సమయంలో 28 శాతం కంపెనీలు కొన్ని షరతులతో కూడిన వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌(హైబ్రిడ్ మోడల్)లను నిర్వహిస్తున్నాయి.

ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. 65 శాతం కంపెనీలు 100 శాతం ఉద్యోగులు అందరూ ఆఫీసులకు వచ్చి పని చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాయి. అయితే అది ఒకేసారి కాకుండా హైబ్రిడ్ మోడల్లో ఉండాలనుకుంటున్నాయి. అదే సమయంలో 15 శాతం కంపెనీలు అన్ని పనిదినాల్లో 100 శాతం ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేయాలని కోరుకుంటున్నాయి. 54 శాతం కంపెనీలు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, నిర్ణయాల ఆధారంగా వర్క్ ఫ్రమ్ ఆఫీసు విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అదే సమయంలో 46 శాతం కంపెనీలు స్థానిక నాయకత్వ నిర్ణయాలకు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

(చదవండి: మార్చిలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..!)

మరిన్ని వార్తలు