రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి 1,000 కోట్ల పెట్టుబడులు

17 Apr, 2021 16:23 IST|Sakshi

క్యూ1లో ఆఫీస్‌ స్పేస్‌లోకి పీఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ 

నివాస విభాగంలోకి రూ.80 కోట్లు 

నైట్‌ఫ్రాంక్‌ ఇండియా వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో(క్యూ1) హైదరాబాద్‌ ఆఫీస్‌ స్పేస్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి 143 మిలియన్‌ డాలర్లు(రూ.1,000 కోట్లు), నివాస విభాగంలోకి 11 (రూ.80 కోట్లు) మిలియన్‌ డాలర్ల ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఎన్‌సీఆర్‌ నగరాల్లో 3.15 కోట్ల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరగగా.. మన నగరంలో 18 లక్షల చ.అ. రెండు ప్రధాన ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. 2011 జనవరి నుంచి 2021 మార్చి మధ్య కాలంలో హైదరాబాద్‌ రియల్టీలోకి 16 డీల్స్‌ ద్వారా 2,866 మిలియన్‌ డాలర్ల పీఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చాయి.

2021 క్యూ1లో దేశవ్యాప్తంగా 19 డీల్స్‌ ద్వారా డెట్, ఈక్విటీ రూపంలో 3,241 మిలియన్‌ డాలర్ల పీఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చాయి. ఇందులో 71 శాతం ఆఫీస్‌ స్పేస్‌లోకి, 15 శాతం రిటైల్, 7 శాతం నివాసం, 7 శాతం గిడ్డంగుల విభాగంలోకి పెట్టుబడులు వచ్చాయి. 2020 క్యూ1లో దేశీయ రియల్టీలోకి 199 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అంటే ఏడాదిలో 16 రెట్లు ఎక్కువ. విలువల పరంగా చూస్తే.. 2021 క్యూ1 పీఈ పెట్టుబడులు గతేడాదిలో 80 శాతం, అంతకుక్రితం సంవత్సరంలో 48 శాతంగా ఉన్నాయి. 

ఈ క్యూ1లో రెసిడెన్షియల్‌లో 7 డీల్స్‌ ద్వారా 234 మిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ రాగా.. ఆఫీస్‌ స్పేస్‌లోకి 6 డీల్స్‌ ద్వారా 2,148, రిటైల్‌లో ఒక్క డీల్‌తో 484, వేర్‌హౌస్‌లో 4 డీల్స్‌ ద్వారా 216 మిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరిగాయి. క్యూ1లో వచ్చిన పెట్టుబడులను దేశాల వారీగా చూస్తే.. కెనడా నుంచి అత్యధికంగా 915 మిలియన్‌ డాలర్లు, అమెరికా నుంచి 830, సింగపూర్‌ నుంచి 341, మన దేశం నుంచి 62 మిలియన్‌ డాలర్లు వచ్చాయి.

>
మరిన్ని వార్తలు