47 అంతస్తులతో ‘హైదరాబాద్‌ వన్‌’.. దేశంలోనే ఫస్ట్‌!

17 Feb, 2022 21:11 IST|Sakshi

దేశంలోనే తొలి ఎత్తయిన లగ్జరీ కో–లివింగ్‌ ప్రాజెక్ట్‌

ఉద్యోగస్తులు, విదేశీయులకు మాత్రమే

యువత అభిరుచికి తగ్గట్టుగా ఆధునిక వసతి

మహిళల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు

కొత్త నగరానికి వెళ్లి తాత్కాలికంగా కొన్ని రోజులుండాల్సి వస్తే... వసతి పెద్ద సమస్య. పేయింగ్‌ గెస్ట్‌గా ఉన్నా, ఎంత లగ్జరీ హాస్టల్‌ అయినా... ఇరుకు గదులు, అంతంత మాత్రంగా ఉండే ఆహారం, టైమింగ్స్‌... అన్నింటికీ ఇబ్బంది. సరే ఎలాగోలా సర్దుకుపోదాం అనుకున్నా.. మెన్, ఉమెన్‌కు వేర్వేరు హాస్టల్స్‌ వల్ల కపుల్‌ కలిసుండలేరు. వీటన్నింటికీ సింపుల్‌ సొల్యూషన్‌ సెన్సేషన్‌ ఇన్‌ఫ్రాకాన్‌ వారి ‘హైదరాబాద్‌ వన్‌’ లగ్జరీ కో–లివింగ్‌ ప్రాజెక్ట్‌. 

సాక్షి, హైదరాబాద్‌: ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి నగరానికి వచ్చే ఉద్యోగులు, విద్యార్థులు ఇక వసతికోసం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. 47 అంతస్తులతో అత్యంత లగ్జరీ కో–లివింగ్‌ ప్రాజెక్టు ఇప్పుడు హైదరాబాద్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో నిర్మాణంలో ఉంది. సాధారణ హాస్టల్స్‌లో ఒకే రూమ్‌లో నాలుగైదు బెడ్లు వేస్తారు. భోజన ఏర్పాట్లు హాస్టల్స్‌ నిర్వాహకులే చూసుకుంటారు. దీనివల్ల రూమ్‌ స్థలాన్ని మనకు నచ్చినవిధంగా ఉపయోగించుకోలేం. ఆహార నాణ్యతలోనూ రాజీ పడాల్సి వస్తుంది. 

ఇక నగరానికి వచ్చింది జంట అయితే.. హాస్టల్స్‌లో వేర్వేరుగా ఉండాల్సి వస్తుంది. కానీ ఈ కో–లివింగ్‌లో ఆ సమస్య ఉండదు. ఎవరైనా ఉండొచ్చు. సాధారణ హాస్టల్స్‌ లాగానే ఇక్కడా బెడ్‌కు ఇంతని ధర ఉంటుంది. గంటలు, రోజులు, నెల, సంవత్సరాల వారీగా గదులను అద్దెకు తీసుకోవచ్చు. హైదరాబాద్‌ వన్‌ ప్రాజెక్ట్‌లో నెలకు ఒక్క బెడ్‌ అద్దె రూ.26–36 వేల మధ్య ఉంటుందని సమాచారం. (క్లిక్: హైదరాబాద్‌ సిటీలో సాఫీ జర్నీకి సై)

మహిళల కోసమే ఐదంతస్తులు...
47 అంతస్తుల్లో మొత్తం 1,928 స్టూడియో అపార్ట్‌మెంట్లుంటాయి. 6వ అంతస్తు నుంచి 10 వరకు కేవలం ఉమెన్‌ కో–లివింగ్‌ అపార్ట్‌మెంట్లుంటాయి. వీటిని మహిళా ఉద్యోగస్తులు, విదేశీ విద్యార్థులకు మాత్రమే అద్దెకిస్తారు. 36 నుంచి 46వ ఫ్లోర్‌ వరకు 11 అంతస్తులను సీనియర్‌ ప్రొఫెషనల్స్, ప్రవాసులకు మాత్రమే కేటాయించారు. 47వ అంతస్తులో మహిళల కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్‌ పూల్‌ ఏర్పాటు చేస్తున్నారు. (క్లిక్: హెల్త్‌ స్టార్టప్‌లకు వెల్లువలా పెట్టుబడులు)

జీవనశైలికి అనుకూలంగా... 
నేటి యువత లైఫ్‌స్టైల్‌కు అనుకూలంగా.. స్విమ్మింగ్‌ పూల్, జిమ్, రెస్టారెంట్లు, బార్, సెలూన్, స్పా, యాంపి థియేటర్‌ వంటివి ఏర్పాటు చేస్తారు. 24 గంటలు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంటుంది. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నారు. అత్యవసరమైన సమయాల్లో స్త్రీల సౌకర్యార్థం పలుచోట్ల ప్యానిక్‌ బజర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

రక్షణ నిమిత్తం సీసీ కెమెరాలు, సాంకేతిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. విశాలమైన పార్కింగ్, అందులో ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ పాయింట్లుంటాయి. 24 గంటలు వైద్య సదుపాయం, ఫార్మసీ అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ సాంస్కృతిక, స్ఫూర్తిదాయక కార్యక్రమాలుంటాయి. వీకెండ్స్‌లో నైట్‌ బజార్, ఫుడ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహిస్తారు. వీటిని బయటివాళ్లు కూడా వినియోగించుకోవచ్చు. (క్లిక్: ఇందిరాపార్కులో.. లాహిరి లాహిరి

మరో మాన్‌హటన్‌..
హైదరాబాద్‌ వన్‌ ప్రాజెక్ట్‌కు 5–7 కి.మీ. పరిధిలో దాదాపు 5–6 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తారు. వచ్చే నాలుగేళ్లలో ఈ ప్రాంతం అమెరికాలోని మాన్‌హటన్‌లాగా మారటం ఖాయం. నగరానికి వచ్చే విదేశీ విద్యార్థులు, ఉన్నతస్థాయి ఉద్యోగస్తులు, ప్రవాసుల సౌకర్యార్థం ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం.
– పూర్ణ చందర్, ఈడీ, సెస్సేషన్‌ ఇన్‌ఫ్రాకాన్‌

మరిన్ని వార్తలు