ఫార్మా కారిడార్‌లో.. రియల్‌ పెట్టుబడులు 

27 Feb, 2021 18:59 IST|Sakshi

ఐడీఏ బొల్లారం, పాశమైలారంలోని ఫార్మా కంపెనీలతో మియాపూర్, కూకట్‌పల్లి, బాచుపల్లి, మదీనాగూడ, చందానగర్, కొండాపూర్‌ వంటి ప్రాంతాల అభివృద్ధి రూపురేఖలు మారిపోయాయి. 
జీనోమ్‌వ్యాలీ ఏర్పాటుతో షామీర్‌పేట, తుర్కపల్లి, మేడ్చల్, పఠాన్‌చెరు, కీసర వంటి ప్రాంతాలలో నివాస, రిటైల్‌ అభివృద్ధి జరిగింది. తాజాగా ముచ్చెర్లలో 19 వేల ఎకరాల్లో రానున్న ఫార్మా సిటీ.. దాని చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి ఊహించలేనిదే. 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఐటీ రంగం తర్వాత అత్యధిక మందికి ఉద్యోగ అవకాశాల ను కల్పిస్తుంది ఫార్మా రంగమే. ఏ ప్రాంతంలోనైనా సరే పారిశ్రామిక అభివృద్ధి జరిగితే దాని చుట్టూ 30 కి.మీ. వరకు రెసిడెన్షియల్‌ డెవలప్‌మెంట్‌ శరవేగంగా జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫార్మాసిటీ.. రీజినల్‌ రింగ్‌ రోడ్‌కు సమీప దూరంలోనే ఉండటం ఈ ప్రాజెక్ట్‌కు అదనపు అంశం. ఇప్పటికే మెట్రో రైల్, ఔటర్‌ రింగ్‌ రోడ్‌లతో గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు ఆర్‌ఆర్‌ఆర్, ఫార్మా సిటీలు మణిహారంగా మారనున్నాయి. 

కలిసొచ్చిన కరోనా..
కోవిడ్‌–19 తర్వాతి నుంచి కొనుగోలుదారుల ఆలోచనలలో మార్పులొచ్చాయి. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతికదూరం తప్పనిసరైన నేపథ్యంలో ఇరుకు ఇళ్లకు బదులుగా విశాలమైన గృహాలను ఎంచుకుంటున్నారు. ఓఆర్‌ఆర్, మెట్రో రైల్‌లతో శివారు ప్రాంతాల నుంచి ప్రధాన నగరానికి ప్రయాణం చాలా సులువైంది. దీంతో సిటీకి దూరమైన సరే ప్రశాంతమైన వాతావరణం ఉండే ప్రాజెక్ట్‌లలో కొంటున్నారు. బెంగళూరు, ముంబై, పుణే వంటి ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌కు కలిసొచ్చే ప్రధానమైన అంశం.. భూముల ధరలు తక్కువగా ఉండటమే. అందుకే స్థానిక కొనుగోలుదారులతో పాటు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు, ప్రవాసులు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తున్నారని ఫార్చ్యూన్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ సీఎండీ బీ శేషగిరి రావు తెలిపారు. 

నౌ ఆర్‌ నెవర్‌
ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారంలో కంటే రియల్టీ పెట్టుబడులే రెట్టింపు ఆదాయాన్ని అందిస్తాయి. చేతిలోని నగదుతో ప్రతీ ఒక్కరూ స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారు. సిటీకి దూరంగా ఉన్న వంద ఎకరాల భూమిని విక్రయించేసి.. అదే డబ్బుతో అందుబాటు ధరల్లో అభివృద్ధికి ఆస్కారం ఉండే రియల్టీ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. ‘‘కరోనా టైంలో కస్టమర్లు ముందుకురారు అనుకున్నాం. కానీ, కస్టమర్ల నుంచి ఎంక్వైరీలు పెరిగాయి. ప్రతికూల సమయంలో ధరలు తగ్గే అవకాశం ఉంటుందని, డెవలపర్లు ఆఫర్లూ అందిస్తారని పెట్టుబడులు పెట్టేందుకు కస్టమర్లే ముందుకొచ్చారని పేర్కొన్నారు. నౌ ఆర్‌ నెవర్‌ అనే భావన కస్టమర్లలో పెరిగిపోయింది.  

చదవండి: 
3,600 ఎకరాల్లో బటర్‌ఫ్లై సిటీ

2020లో అతిపెద్ద డీల్‌ హైదరాబాద్‌లోనే..
 

మరిన్ని వార్తలు