Hyderabad Real Estate News: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు..ఎక్కువగా ఇళ్లు కొంటున్న ప్రాంతాలివే!

16 Apr, 2022 21:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలి, మాదాపూర్‌ వంటి పశ్చిమాది ప్రాంతాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) ఆఫీస్‌ స్పేస్‌..గ్రోత్‌ ఇన్‌ డిస్పర్షన్‌ (గ్రిడ్‌) పాలసీతో నగరం నలువైపులా విస్తరించింది. ఈ పాలసీలో భాగంగా ప్రభుత్వం ఔటర్‌ వెంబడి ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఉన్న 11 పారిశ్రామిక పార్క్‌లను ఐటీ పార్క్‌లుగా మార్చింది. దీంతో పాటు కొంపల్లిలో ఐటీ టవర్, కొల్లూరులో ఐటీ పార్క్‌లను నిర్మిస్తోంది. ఫలితంగా పశ్చిమం వైపున కాకుండా ఇతర ప్రాంతాలలో కొత్తగా 3.5–4 కోట్ల చ.అ. ఐటీ ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి రానుందని జేఎల్‌ఎల్‌ తెలిపింది. 

∙గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీల్లో హైదరాబాద్‌ దూసుకెళుతోంది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం 9.04 కోట్ల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ ఉన్న హైదరాబాద్‌.. ఈ ఏడాది ముగింపు నాటికి 10 కోట్ల చ.అ. మైలురాయిని దాటనుందని జేఎల్‌ఎల్‌ సర్వేలో తేలింది. ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌లో బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ తర్వాత  హైదరాబాద్‌ నాల్గో స్థానంలో నిలిచింది. 2019–21 మధ్య కాలంలో నగరంలో కొత్తగా 3.47 కోట్ల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి వచ్చింది. గత కొంత కాలంగా కొంపల్లి, బాచుపల్లి, మేడ్చల్‌ వంటి ఉత్తరాది ప్రాంతాలు, ఎల్బీనగర్, ఉప్పల్, పోచారం వంటి తూర్పు ప్రాంతాలలో నివాస క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఆయా ప్రాంతాలలోని అందుబాటు గృహాలను ఐటీ ఉద్యోగులు కొనుగోలు చేస్తున్నారు. 

81 శాతం వృద్ధి రేటు.. 
గత కొన్నేళ్లుగా గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్లో హైదరాబాద్‌ నగరం మెరుగైన స్థానాన్ని నమోదు చేస్తుంది. 2016 నుంచి 2021 వరకు పరిశీలిస్తే.. ఏకంగా 81 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం విశేషం. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇదెంతో మెరుగైన స్థానం. హైదరాబాద్‌ తర్వాత రెండో స్థానంలో ఉన్న బెంగళూరు ఈ ఆరేళ్లలో 47 శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోని గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌ విభాగంలో హైదరాబాద్‌ నగర భాగస్వామ్యం ఇటీవలి వరకు 12.7 శాతంగా ఉండగా.. కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్పేస్‌తో 25 శాతానికి పెరిగింది.  

గ్రిడ్‌ పాలసీ అమలుతో.. 
గ్రిడ్‌ పాలసీతో నగరం నలువైపులా ఐటీ విస్తరించింది. డెవలపర్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అమలు చేస్తుంది. మూడు సంవత్సరాల వ్యవధిలో 500 లేదా అంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ, ఐటీఈఎస్‌ యూనిట్లకు యాంకర్‌ యూనిట్‌ ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఇందులో సంబంధిత భూమిని 50 శాతం ఐటీ, ఐటీఈఎస్‌ ప్రయోజనాల కోసం వినియోగించగా.. మిగిలిన సంగంలో నివాస, వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించవచ్చనే వెసులుబాటును కల్పించింది. హైదరాబాద్‌ ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌ అనేది కేవలం రెండు ప్రధాన కారిడార్లలోనే కేంద్రీకృతమై ఉంది. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలు గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌ ఇంజిన్లుగా పనిచేస్తున్నాయి. 96 శాతం స్పేస్‌ ఈ ప్రాంతాల నుంచే ఉందని జేఎల్‌ఎల్‌ తెలంగాణ, ఏపీ ఎంండీ సందీప్‌ పట్నాయక్‌ తెలిపారు.

చదవండి: తగ్గేదేలే! ఆఫీస్‌ స్పేస్‌లో హైదరాబాద్‌ అదుర్స్!

మరిన్ని వార్తలు