రికార్డు స్థాయిలో గృహ విక్రయాలు.. దేశంలోనే దూసుకుపోతున్న హైదరాబాద్‌!

7 Jan, 2023 17:49 IST|Sakshi

2021తో పోలిస్తే 87 శాతం పెరుగుదల 

దేశంలోనే ఇదే అత్యధిక వృద్ధి రేటు 

విక్రయాలు, లాంచింగ్స్‌లో 2వ స్థానం

సాక్షి, హైదరాబాద్‌: 2022 హైదరాబాద్‌ రియల్టీ నామ సంవత్సరంగా నిలిచింది. గృహ విక్రయాలు, ప్రారంభాలలో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. కరోనా, గృహాల ధరలు, వడ్డీ రేట్లు పెరుగుదల ఉన్నప్పటికీ.. హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు జరిగాయి. గతేడాది 47,487 అమ్మకాలు, 68 వేల యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. 2021తో పోలిస్తే విక్రయాలలో 87 శాతం వృద్ధి రేటుతో నగరం తొలిస్థానంలో నిలిచింది.

2021లో హైదరాబాద్‌లో 25,406 గృహాలు అమ్ముడుపోగా.. 2022లో దేశంలోని ఏ నగరంలో లేనివిధంగా భాగ్యనగరంలో రికార్డు స్థాయిలో 87 శాతం వృద్ధి రేటు నమోదయింది.

2022లో విక్రయాలలో తొలి స్థానంలో నిలిచిన ముంబైలో 44 శాతం మాత్రమే వృద్ధి కాగా.. ఎన్‌సీఆర్‌లో 59 శాతం, బెంగళూరులో 50%, పుణేలో 59 శాతం, చెన్నైలో 29 శాతం, కోల్‌కత్తాలో 62 శాతం వృద్ధి నమోదయింది. గతేడాది హైదరాబాద్‌లో 51,500 యూనిట్లు లాంచింగ్‌ కాగా.. ఈ ఏడాది 32% పెరుగుదల కనిపించిందని అనరాక్‌ గ్రూప్‌ నివేదిక వెల్లడించింది. 

లాంచింగ్స్‌లో 51 శాతం పెరుగుదల..
దేశంలో గతేడాది 3,57,600 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. 2021లో 2,36,700 గృహాలు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో 51 శాతం వృద్ధి.

అయితే 2014తో పోలిస్తే మాత్రం 2022లో లాంచింగ్‌లు తక్కువే. 2014లో 5.45 లక్షల యూనిట్లు ప్రారంభమయ్యాయి. లాంచింగ్స్‌లో ముంబై, హైదరాబాద్‌ పోటీపడ్డాయి. ఈ రెండు నగరాల వాటా 54 శాతంగా ఉంది.

2014 రికార్డు బద్దలు.. 
2022లో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 3,64,900 గృహాలు విక్రయమయ్యాయి. 2021లో 2,36,500 యూనిట్లు అమ్ముడుపోయాయి. అంటే ఏడాదిలో 54 శాతం వృద్ధి. 2014 తర్వాత ఈ స్థాయిలో గృహాలు అమ్ముడుపోవటం ఇదే తొలిసారి. 2014లో 3.43 లక్షల ఇళ్లు విక్రయమయ్యాయి. ఇళ్ల అమ్మకాలలో ముంబై తొలిస్థానంలో నిలిచింది. ఇక్కడ 1,09,700 యూనిట్లు అమ్ముడుపోగా.. 63,700 యూనిట్లతో ఎన్‌సీఆర్‌ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు