హైదరాబాద్‌ లగ్జరీ జోష్‌.. దేశంలో రెండో స్థానం

16 Oct, 2022 15:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అందుబాటు ధరల రియల్టీ మార్కెట్‌గా ఉన్న హైదరాబాద్‌ లగ్జరీ విపణిగా అభివృద్ధి చెందింది. కరోనా కంటే ముందు వరకూ దేశంలో అఫర్డబులిటీ మార్కెట్‌లో హైదరాబాద్‌ ముందు వరుసలో నిలిచేది. కానీ, ఇప్పుడు దేశంలోని అత్యంత లగ్జరీ స్థిరాస్తి విపణిలో ముంబై తర్వాత భాగ్యనగరం రెండో స్థానానికి ఎదిగింది. దక్షిణాది రాష్ట్రాలలో అయితే మనదే తొలిస్థానం. ∙

గృహ కొనుగోలుదారుల సగటు ఆదాయం, నెలవారీ ఈఎంఐ చెల్లింపు నిష్పత్తి ఆధారంగా నైట్‌ఫ్రాంక్‌ కొనుగోలు సూచీని అంచనా వేసింది. దీని ప్రకారం.. 2010లో హైదరాబాద్‌లో ఆదాయంలో 53% ఈఎంఐ కోసం వెచ్చించేవారు. ఆ తర్వాత 2014లో 42%, 2019లో 33%, 2020లో 28%గా క్రమంగా తగ్గుతూ వచ్చింది. కానీ, కరోనా తర్వాత వడ్డీ రేట్ల పెరుగుదలతో ఈఎంఐ భారం కూడా పెరిగింది. ఫలితంగా 2021లో ఆదాయంలో ఈఎంఐ వాటా 29%, 2022 నాటికి 31 శాతానికి వెచ్చించాల్సి వస్తోంది. ముంబైలో 2010లో ఆదాయంలో 93 శాతంగా ఈఎంఐగా చెల్లిస్తే సరిపోయేది. 2022 నాటికి 53 శాతానికి తగ్గింది. 22 % ఈఐఎం నిష్పత్తితో అహ్మదాబాద్‌ అత్యంత సరసమైన గృహ మార్కెట్‌గా నిలవగా.. 26%తో పుణే రెండో స్థానంలో, 27%తో చెన్నై మూడో స్థానంలో నిలిచింది.

తగ్గిన కొనుగోలు శక్తి.: ఏడాది క్రితం 7.30 శాతంగా ఉన్న గృహ రుణ వడ్డీ రేట్లు ఏడాది కాలంలోనే 0.95% మేర పెరిగి 8.25కి చేరింది. దీంతో గృహ కొనుగోలు నిర్ణయాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా ‘అఫర్డబులిటీ ఇండెక్స్‌ క్యూ3–2022’ నివేదిక వెల్లడించింది. వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా స్థిరాస్తి కొనుగోళ్ల శక్తి సగటున 2% క్షీణించడంతో పాటూ ఈఎంఐలపై 7.4% అదనపు భారం పడుతుందని వివరించింది.

చదవండి: ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఇకపై ఫ్యామిలీ డాక్టర్లుగా..

మరిన్ని వార్తలు