యూనికార్న్‌ కంపెనీగా అవతరించిన హైదరాబాద్ కంపెనీ.. కేటీఆర్ అభినందనలు!

25 Jan, 2022 19:44 IST|Sakshi

హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ సాఫ్ట్ వేర్ స్టార్టప్ సంస్థ డార్విన్ బాక్స్ యూనికార్న్‌ కంపెనీగా అవతరించింది. డార్విన్ బాక్స్ డీ-సిరీస్ ఫండ్ రైజ్‌లో భాగంగా టీసీవీ కంపెనీ నుంచి 72 మిలియన్ డాలర్లను సేకరించింది. దీంతో ఈ కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్లకు పైగా చేరుకోవడంతో యూనికార్న్‌ కంపెనీగా అవతరించింది. ఒక బిలియన్ డాలర్లకు పైగా విలువ గల ప్రైవేట్ సంస్థలను యూనికార్న్‌ కంపెనీలుగా పిలుస్తారు. యూనికార్న్‌ కంపెనీగా మారిన డార్విన్‌ బాక్స్‌ స్టారప్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. 

ఈ సక్సెస్‌ మీట్‌లో జయేష్‌ రంజన్‌, డార్విన్‌ బాక్స్‌ వ్యవస్థాపకులు రోహిత్‌, చైతన్య, జయంత్ పాలేటి కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్‌ మాట్లాడారు. ఇండియాలో స్టార్ట్‌అప్‌ల పురోగతి చాలా వేగంగా నడుస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో 300లకు పైగా స్టార్టప్‌ సంస్థలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో మొదలైన డార్విన్ బాక్స్‌ కంపెనీ యూనికార్న్‌ అవ్వడం మంచి విషయమన్నారు. యూనికార్న్‌ కంపెనీగా అవతరించిన డార్విన్‌ బాక్స్‌ వ్యవస్థాపకులు చైతన్య పెద్ది, జయంత్ పాలేటి, రోహిత్ చెన్నమనేని & ఎండియా పార్ట్‌నర్స్‌కి పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫేస్‌బుక్ వేదికగా అభినందనలు తెలిపారు.

జయంత్ పాలేటి, రోహిత్ చెన్నమాని & చైతన్య పెద్ది కలిసి 2015లో డార్విన్ బాక్స్ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ హెచ్ఆర్ కి సంబంధించిన సేవలు అందిస్తుంది. ఉద్యోగుల హాజరు, పేరోల్ & ఉద్యోగి ఆన్ బోర్డింగ్ వంటి విధులను డిజిటైజ్ చేస్తుంది. దీని ఇతర పెట్టుబడిదారులలో సీక్వోయా, లైట్ స్పీడ్ ఇండియా & సేల్స్ ఫోర్స్ వెంచర్స్ ఉన్నాయి. డార్విన్ బాక్స్ వార్షిక రికరింగ్ రెవిన్యూ(ఏఆర్ఆర్) సంవత్సరానికి సుమారు $30 మిలియన్లకు రెట్టింపు అయింది. అలాగే, ఈ ఏడాదిలో(2022) యూనికార్న్‌ సంస్థగా అవతరించిన 4వ కంపెనీ.

మరిన్ని వార్తలు